- మహిళను కాపాడిన మత్స్యకారులు
- తండ్రి, ఇద్దరు పిల్లలు గల్లంతు
- కొనసాగుతున్న గాలింపు చర్యలు
ప్రజాశక్తి- యలమంచిలి : పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం చించినాడలో గోదావరి వంతెనపైనుంచి ఇద్దరు పిల్లలతో సహా భార్యాభర్తలు గోదావరిలోకి దూకారు. వారిలో ఒకరిని మత్స్యకారులు కాపాడారు. ముగ్గురు గల్లంతయ్యారు. శనివారం చోటుచేసుకున్న ఈ విషాద ఘటనకు సంబంధించి పోలీసుల కథనం ప్రకారం... తణుకు గ్రామానికి చెందిన నంబూరి శ్రీనివాస్ (45), ఆయన భార్య పద్మిని (42), పిల్లలు ఈశ్వర్ (16), నిత్య (15) రెండు ద్విచక్ర వాహనాలపై చించినాడ వచ్చారు. అనంతరం బ్రిడ్జిపైకి వెళ్లి గోదావరిలో దూకేశారు. ఆ సమయంలో అక్కడ చేపలను పడుతున్న మత్స్యకారులు దీన్ని గమనించి పడవపై వెళ్లి పద్మినిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. శ్రీనివాస్, ఈశ్వర్, నిత్య గల్లంతయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న పద్మినిని 108 అంబులెన్స్లో తొలుత పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి, అనంతరం తణుకు, మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు, రెస్క్యూ సిబ్బంది పడవల సహాయంతో గోదావరిలో పొద్దుపోయేవరకు గాలించినా గల్లంతైన ముగ్గురి ఆచూకీ లభించలేదు. యలమంచిలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తణుకు పట్టణంలో శ్రీనివాస్, పద్మిని పాలు, కిరాణా వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం అంతమాత్రంగా ఉండటం, అప్పుల పాలు కావడం, అప్పులు ఇచ్చిన వారి నుండి ఒత్తిడి పెరగడంతో ఆ కుటుంబం ఈ చర్యకు పాల్పడిందని గ్రామస్తులు చెప్తున్నారు. శ్రీనివాస్ స్వగ్రామం వీరవాసరం మండలం మత్స్యపురి. 20 ఏళ్ల క్రితం తణుకు వచ్చి స్థిరపడ్డారు. శ్రీనివాస్ కుమారుడు పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం, కుమార్తె స్థానిక ప్రైవేట్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. కాగా, ఇటీవల తణుకు మండలం వేల్పూరుకు చెందిన దంపతులు అదే ప్రాంతంలో గోదావరిలోకి దూకిన ఘటనలో భర్త మృతి చెందగా, భార్య ఆచూకీ నేటికీ లభ్యం కాలేదు. పది రోజుల వ్యవధిలో మరో కుటుంబం అదే ప్రాంతంలో నదిలో దూకడంతో మళ్లీ విషాదం నెలకొంది. ఇలాంటి ఘటనల నివారణకు ఇక్కడ వంతెనపై ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని స్థానికులు, సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తున్నా అధికారులు పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వెలువెత్తుతున్నాయి.








కామెంట్లు (0)