ఏఆర్ కానిస్టేబుల్ సహా మరో వ్యక్తికి తీవ్ర గాయాలు..
ప్రజాశక్తి-వల్లూరు (కడప) : కడప–తాడిపత్రి జాతీయ రహదారిపై వల్లూరు మండల పరిధిలోని ఎయిర్‌పోర్టు సమీపంలో శుక్రవారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏఆర్ కానిస్టేబుల్ సహా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు .... పెద్దపుత్త గ్రామానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ నరసింహులు కడప నుంచి తన స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. అదే సమయంలో తోలగంగన్నపల్లె నుంచి మరో ద్విచక్ర వాహనదారుడు కడప వైపు వెళుతుండగా ఎయిర్‌పోర్టు సమీపంలో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో నరసింహులుకు తల, ఎడమ కాలికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ద్విచక్ర వాహనదారుడి ఎడమ మోకాలికి తీవ్ర గాయమైనట్లు సమాచారం. ఢీకొన్న వేగానికి ఇద్దరూ రోడ్డుపై పడిపోవడంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వల్లూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక సహాయం అందించారు. అనంతరం 108 అంబులెన్స్‌లో ఇద్దరినీ చికిత్స నిమిత్తం కడపలోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.








కామెంట్‌లు (0)