ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

స్థానిక ఎన్నికల్లో కూటమి అక్రమాలు

11 నవంబర్, 2026

కడప
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026, 11:59 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- అంబేద్కర్ సర్కిల్లో సిపిఎం, సిపిఐ ఆందోళన

ప్రజాశక్తి-కడప అర్బన్ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలపై ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కడప నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో సిపిఎం, సిపిఐ నగర కమిటీల ఆధ్వర్యంలో బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ నగర కార్యదర్శులు రామమోహన్, వెంకటశివ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రజల పాత్ర ఏమీ లేదని, పోలీసులు, టిడిపి గూండాల పాత్రే ఉందని, అటువంటప్పుడు ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు. దాడులు, దౌర్జన్యాలతో ప్రజలను రానీయకుండా అభ్యర్థులను, ఏజెంట్లను భయపెట్టి నిర్బంధించి రిగ్గింగు చేసుకున్నారని, ఇది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ఖూనీ చేయడమేనని తీవ్రంగా విమర్శించారు. డబ్బు పంపకం, హెచ్చరికలు, పోలీసు కేసులు, బెదిరింపులకు పాల్పడి పూర్తి అప్రజాస్వామిక పద్ధతుల్లో ఎన్నికలు జరుపుకున్నారని విమర్శించారు. రాష్ట్ర చర్రితలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల అక్రమాలు జరిగాయని విమర్శించారు. ఎమ్మెల్యేలు అధికారాన్ని, పోలీసులను అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా చేశారని తెలిపారు. యథేచ్ఛగా రిగ్గింగు చేశారని, అడ్డుకున్న వామపక్ష పార్టీల అభ్యర్థులను పోలీసులు వచ్చి కొట్టి నిర్బంధించారని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు అంటే ఏజెంట్లను కొట్టడం, బెదిరించడం, రిగ్గింగు అని టిడిపి కొత్త నిర్వచనం చెబుతోందని తెలిపారు.

ప్రజలకు మంచి చేశామనే నమ్మకం ఉంటే అధికారపార్టీ రిగ్గింగుకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ గెలుస్తోందని, అయినా టిడిపి రిగ్గింగుకు పాల్పడిందంటే ప్రజలపై నమ్మకం కోల్పోయి భయపడుతోందని అర్థమవుతోందన్నారు. 2029లో ఇదే పరిస్థితి ఉంటే ప్రజాస్వామ్యం పరిహాసం అవుతుందని వివరించారు.

ఒకవైపు ఓట్లు కాపాడుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యయుత ఆందోళనలు జరుగుతుంటే, మరోవైపు ఉన్న ఓట్లు వేసుకోనీయకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం తన స్వతంత్రతను కోల్పోయి అధికార పార్టీ చేతిలో కీలుబొమ్మగా మారిందన్నారు. కడప జిల్లాలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జిల్లా ప్రజానికం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి సిపిఎం నేతలు అన్వేష్, దస్తగిరిరెడ్డి, కామనూరు శ్రీనివాసులు రెడ్డి, జమీల, శంషాద్, రాజమణి, రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, నరసింహ, రవి, రఘు, అఖిలేష్, సిపిఐ నేతలు రాజారెడ్డి, నాగసుబ్బారెడ్డి, బాదుల్లా, సుబ్రమణ్యం, మనోహర్ రెడ్డి, భాగ్యలక్ష్మి, మల్లికార్జున పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్