- పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి
ప్రజాశక్తి - వేంపల్లె : ఇటీవల కురిసిన అకాల వడగండ్ల వాన, వీచిన పెనుగాలుల వల్ల అరటి తోటలు పూర్తిగా నెలమట్టం అయ్యాయని కాబట్టి ఈదురు గాలులతో నష్ట పోయిన అరటి సాగు రైతన్నలకు కూటమి ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని తాళ్లపల్లె, నందిపల్లి, కుప్పాలపల్లె, టి. వెలమవారిపల్లె, బక్కన్న గారిపల్లె గ్రామాలలో నెలమట్టం అయిన అరటి పంటలను గురువారం పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి తులసిరెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అలాగే పంట నష్టంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటివల వీచిన ఈదురు గాలులతో వేంపల్లె మండలంలో దాదాపు 400 ఎకరాలలో 200 మంది రైతులకు సంబంధించిన అరటిపంట పూర్తిగా నేలమట్టం అయ్యిందని తెలిపారు.అటు ప్రకృతి వైపరీత్యాలు, ఇటు ప్రభుత్వ వైఫల్యాలు వలన రైతుకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని తెలిపారు. పంటల సాగుకు పెరిగిన కూలి ధరలు, పెరిగిన ఎరువుల ధరలు, క్రిమిసంహారక ధరలు వలన పెట్టుబడి ఖర్చు విపరీతంగా పెరిగిందని తెలిపారు. దాదాపు ఎకరాకు రు 1,50 లక్ష ఖర్చుపెట్టడం జరిగిందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో వడగండ్ల వాన, పెను గాలుల వల్ల పంట పూర్తిగా దెబ్బతినిందని చెప్పారు. ఎకరాకు కనీసం రూ 50 వేల నష్ట పరిహారం అందించాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు తులసిరెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని వ్యవసాయ రుణాలు మాఫీ చేసి రైతును ఆదుకోవాలని కోరారు, వ్యవసాయం గిట్టుబాటు గాక రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయినట్లు చెప్పారు.
కొందరు రైతులు ఆత్మహత్య చేసుకొంటున్నట్లు తెలిపారు. రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో ఉందని చెప్పారు. రైతులను అప్పుల ఊబి నుండి గట్టెక్కించాలంటే వ్యవసాయ రుణాల మాఫీ చేయాలని తులసిరెడ్డి కోరారు.తెలంగాణ ప్రభుత్వం రూ 2 లక్షల వరకు, మహారాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు సహకార బ్యాంకుల్లో వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు రూ 75 వేల వరకు తమిళనాడు ప్రభుత్వం రుణమాఫీ చేసింది చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాజధాని అమరావతి కోసం రెండవ విడత భూ సమీకరణలో భూములు ఇచ్చిన 7 గ్రామాల రైతులకు ఒక్కొక్క కుటుంబానికి రూ 1.50 లక్ష మాఫీ చేసిందని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రూ 1.50 లక్ష వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేయాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగం రామకృష్ణారెడ్డి, డాక్టర్ సుబ్రమణ్యం, పులివెందుల సమన్వయకర్త ధ్రువ కుమార్ రెడ్డి, వేంపల్లి మండల శాఖ అధ్యక్షుడు రామకృష్ణ, ఉత్తన్న, రమణ, బద్రీనాథ్, రాఘవయ్య, శేఖర్, రైతులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)