ఆదివారం, 29 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

న్యాయ సేవల పథకాల అమలులో సమర్థవంతమైన పనితీరు కనబరచాలి : జడ్జి ఎస్. బాబా ఫక్రుద్దీన్

20 గంటల క్రితం

Ensure effective implementation of legal services schemes Judge S Baba Fakruddin
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 28, 2026, 02:44 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

మండల న్యాయ సేవాధికార సంస్థల సిబ్బందికి కార్యాచరణ దిశానిర్దేశం : జడ్జి ఎస్. బాబా ఫక్రుద్దీన్


ప్రజాశక్తి - కడప : న్యాయ సేవల పథకాల అమలులో సవర్తమంతమైన పనితీరు కనబరచాలని మండల న్యాయ సేవాధికార సంస్థల సిబ్బందికి సీనియర్ సివిల్ జడ్జి డి ఎల్ ఎస్ ఏ సెక్రటరీ ఎస్. బాబా ఫక్రుద్దీన్ కార్యాచరణ దిశా నిర్దేశం చేశారు. శనివారం మండల లీగల్ సర్వీసెస్ కమిటీల ఉద్యోగులతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీల ద్వారా అమలవుతున్న న్యాయ సేవా కార్యక్రమాలు, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ రూపొందించిన వివిధ పథకాల అమలు తీరు, ప్రజలకు అందిస్తున్న ఉచిత న్యాయ సహాయ సేవలు, నిర్వహించాల్సిన అవగాహన శిబిరాలు, జైళ్లలో చేపట్టాల్సిన న్యాయ సేవా కార్యక్రమాలపై సమగ్రంగా సమీక్షించారు. ముఖ్యంగా లీగల్ ఎయిడ్ క్లినిక్‌ల నిర్వహణ, న్యాయ సహాయ దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం, ఖైదీలకు అవసరమైన న్యాయ సహాయం అందించడం, మధ్యవర్తిత్వ పథకం అమలు, సాధారణ న్యాయస్థానాల నుంచి మధ్యవర్తిత్వానికి కేసుల రిఫరల్, జాతీయ లోక్ అదాలత్ నిర్వహణ తదితర అంశాలపై సిబ్బందికి తగిన సూచనలు, మార్గదర్శకాలు అందించారు. అదేవిధంగా అకౌంట్స్ నిర్వహణ, చెల్లింపుల ప్రక్రియ, టి ఎస్ ఏ హైబ్రిడ్ మాడ్యూల్ ద్వారా ఆన్‌లైన్ విధానంలో చేపట్టాల్సిన పనులు, వార్తాపత్రికల్లో ప్రచురితమయ్యే ప్రజా సమస్యలకు సంబంధించిన కథనాలపై తీసుకోవాల్సిన చర్యలు, వాటికి సంబంధించిన యాక్షన్ టేకెన్ రిపోర్టుల సమర్పణపై వివరించారు. బాధితులకు అందించే పరిహార పథకం, పోక్సో కేసుల్లో బాధితులకు అందించాల్సిన పరిహారం, అర్హులైన బాధితులకు సకాలంలో న్యాయం మరియు పరిహారం అందేలా తీసుకోవాల్సిన చర్యలపై కూడా ప్రత్యేకంగా చర్చించారు.ఈ సందర్భంగా కార్యదర్శి ఎస్. బాబా ఫక్రొద్దీన్ మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అమలవుతున్న పథకాలు క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. న్యాయ సహాయం కోసం వచ్చే పేదలు, బలహీన వర్గాలు, మహిళలు, బాలలు, వృద్ధులు, ఖైదీలు మరియు బాధితులకు సత్వర న్యాయ సేవలు అందించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. ప్రతి కార్యక్రమానికి సంబంధించిన రికార్డులు, నివేదికలు, ఆన్‌లైన్ వివరాలను ఎప్పటికప్పుడు సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు.మండల లీగల్ సర్వీసెస్ కమిటీల పనితీరును మరింత మెరుగుపరిచి, న్యాయ సేవాధికార సంస్థ లక్ష్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఈ సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, బద్వేల్, పులివెందుల, సిద్దవటం, ఎల్.ఆర్. పల్లి, నందలూరు, కమలాపురం, మైదుకూరు, జమ్మలమడుగు, రైల్వే కోడూరు మండల లీగల్ సర్వీసెస్ ఉద్యోగులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్