శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెండింగ్ రిజర్వాయర్ల పూర్తికి నిధులు విడుదల చేయాలి : సిపిఎం

3 రోజుల క్రితం

CPM District Secretary Chandrashekhar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 05:05 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం


  • కే.సీ.కెనాల్ కు నీటి స్థిరీకరణ చేసి విడుదల చేయాలి

  • సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ డిమాండ్

ప్రజాశక్తి కడప అర్బన్ : జిల్లాలోని పెండింగ్ రిజర్వాయర్ల పూర్తికి నిధులు విడుదల చేయాలని, 23 కరువు మండలాలలో నివారణ చర్యలు చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం కోసం అహర్నిశలు పోరాడిన పూల సుబ్బయ్య, పెద్ద పసుపుల ఈశ్వర్ రెడ్డి లాంటి కమ్యూనిస్టుల పేర్లు పెట్టటం స్వాగతించగల విషయమని పేర్కొన్నారు. బచావత్ ట్రిబ్యునల్ కృష్ణా నదిలోని 75 శాతం నీటి లభ్యత ఆధారంగా నాలుగు రాష్ట్రాలకు పూర్వపు ఆయకట్టు ఆధారంగా నీటిని పంపిణీ చేసిందని, మిగులు జలాలను దిగువ రాష్ట్రాలు వాడుకునే వెసులుబాటు ఇచ్చినప్పటికీ, సరైన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు వినియోగించుకోలేకపోయారన్నారు. జిల్లాలోని కరువు మండలాలకు కృష్ణా జలాలు అందించే రిజర్వాయర్లకు నిధులు కేటాయించి ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. బ్రహ్మంసాగర్, వామికొండ, సర్వరాయసాగర్ రిజర్వాయర్లు మొదటి దశ పూర్తి చేసినప్పటికీ వాటికింది మెయిన్ కెనాల్స్, పంట కాలువలు దశాబ్దాలు గడుస్తున్నా పూర్తి చేయక అవి చాపల చెవులుగా మారాయన్నారు. పెండ్లిమర్రి మండలంలో పెండింగ్ లో ఉన్న గాలేరు-నగరి ప్రధాన పెద్ద కాలువ పూర్తి చేయలేదని, సబ్ చానల్స్ ఊసే లేదని తెలిపారు. భూ నిర్వాసితులకు 2013 నిర్వాసితుల చట్టం నిర్దేశించిన ప్రకారం నష్టపరిహారం చెల్లించలేదని ఆరోపించారు. బోర్లు తవ్వితే జలం పడుతుందో లేదో తెలియని అయోమయంలో రైతులు ఉన్నారన్నారు. కుందూనది విస్తరణ, లింగాల లిఫ్ట్, రాజోలి, జోళదరాసి, జూపాడు బంగ్లా లిఫ్ట్, మల్యాల, ముచ్చుమర్రి, పైడిపాలెం ఎత్తిపోతల పథకాలు పూర్తి చేసి కె.సి.కెనాల్ నీటి స్థిరీకరణ చేయాలని డిమాండ్ చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ద్వారా రాయలసీమ జిల్లాలకు, కడప జిల్లాకు అధికంగా నీరు రావాలన్నారు. కడప జిల్లాలోని 23 మండలాలలో తీవ్రమైన వర్షాభావంతో కరువు అలుముకొని ఉందని తెలిపారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎ.రామ్మోహన్, జిల్లా కమిటీ సభ్యులు బి.దస్తగిరి రెడ్డి, కె.శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్