పలు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీరు.. ట్రాఫిక్ జామ్
న్యూఢిల్లీ : శుక్రవారం నుండి కురుస్తున్న భారీ వర్షాలతో దేశ రాజధాని ఢిల్లీ జలమయమైంది. శనివారం ఉదయం కూడా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. దీంతో గీతా కాలనీ, అక్బర్ రోడ్, సౌత్ అవెన్యూ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. రహదారులు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతమైన గురుగ్రామ్‌లోనూ పలు కీలక ప్రాంతాలు నీట మునిగాయి. పాలం, జాఫర్‌పూర్, లోధి రోడ్, సఫ్దర్‌జంగ్, రిడ్జ్ తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. వచ్చే 24 గంటల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. శనివారం ఉదయం 8.30 గంటలకు ఢిల్లీలో ఉష్ణోగ్రత 26.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
విమాన సర్వీసులకు అంతరాయం
శుక్రవారం కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. పలు దేశీయ విమానాలు ఆలస్యంగా నడిచాయి. విమానాశ్రయ టెర్మినల్ పరిసరాల్లోనూ భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది.
రాజస్థాన్‌లోనూ భారీ వర్షాలు
రాజస్థాన్‌లోని దౌసాలో వరుసగా రెండో రోజు భారీ వర్షాలు కురిశాయి. పలు ప్రధాన రహదారులు జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ధోల్‌పూర్‌లో భారీ వర్ష సూచన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ 1 నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు శనివారం సెలవు ప్రకటించారు. అయితే బోధన, బోధనేతర సిబ్బంది విధులకు హాజరు కావాలని ఆదేశించారు.
తూర్పు రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్‌లో సెప్టెంబర్ 4, 5 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉత్తరాఖండ్‌లో సెప్టెంబర్ 4 నుంచి 10 వరకు, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో సెప్టెంబర్ 4 నుంచి 6 వరకు, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.







కామెంట్‌లు (0)