జయలక్ష్మి ఎలక్ట్రికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్ దగ్ధం..
రూ.50 లక్షల సరుకు అగ్నికి ఆహుతి..
షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు..
ప్రజాశక్తి - నందలూరు (కడప) : నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని అరవపల్లి రైల్వే గేటు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జయలక్ష్మి ఎలక్ట్రికల్ అండ్ ఫాన్సీ స్టోర్ లో మంటలు చెలరేగి దుకాణం పూర్తిగా దగ్ధమైంది. దుకాణంలో ఉన్న సుమారు రూ.50 లక్షల పైగా విలువైన సామాన్లు కాలిపోయినట్లు బాధితులు తెలిపారు. తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో దుకాణంలో మంటలు చెలరేగడాన్ని ఇంటి యజమాని గెలివి జయలక్ష్మి, గెలివి నాగేంద్ర గుర్తించి వెంటనే బయటకు వచ్చి చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రాజంపేట అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అయితే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో పరిస్థితి అదుపులోకి రాలేదు. ఫైర్ ఇంజన్‌లోని నీరు పూర్తిగా అయిపోవడంతో మరోసారి నీటిని నింపేందుకు వెళ్లాల్సి వచ్చిందని, ఆ సమయంలో మంటలు మరింతగా చెలరేగడంతో దుకాణంలోని సామగ్రి మొత్తం కాలిపోయిందని బాధితులు వాపోయారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అదనపు ఫైర్ ఇంజన్ కోసం అగ్నిమాపక అధికారులను స్థానికులు కోరారు. అయితే రాజంపేటలో ఒక్క ఫైర్ ఇంజన్ మాత్రమే ఉందని, కడప నుంచి మరో వాహనం రావాలంటే సమయం పడుతుందని అధికారులు తెలిపినట్లు బాధితులు పేర్కొన్నారు. సకాలంలో అదనపు అగ్నిమాపక వాహనం అందుబాటులోకి వచ్చి ఉంటే నష్టం కొంతవరకు తగ్గేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 4.10 గంటల నుంచి 8 గంటల వరకు మంటలు కొనసాగడంతో దుకాణం పూర్తిగా దగ్ధమైంది.








కామెంట్‌లు (0)