ప్రజాశక్తి - మైదుకూరు : రైతులు పామ్ ఆయిల్ సాగు పెంపకంతో అధిక లాభాలు సాధించవచ్చని మైదుకూరు ఉద్యానశాఖ అధికారి సి.రామకృష్ణ తెలిపారు. బుధవారం మైదుకూరు మండలం నంద్యాలం పేట రైతు సేవా కేంద్రంలో ఉద్యాన శాఖ, సువెన్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సంయుక్త ఆధ్వర్యంలో పామ్ ఆయిల్ సాగుపై రైతు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎకరాకు 50 మొక్కలు చొప్పున నాటుకోవాలని, రైతులకు ఉచితంగా మొక్కలు సువెన్ ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ సరఫరా చేస్తుందన్నారు. అలాగే మొక్కల నిర్వహణకు, ఆంతర పంటల సాగు చేసుకునేందుకు హెక్టారుకు రూ.10500 నాలుగు సంవత్సరాల పాటు ఇవ్వడం జరుగుతుందన్నారు. జాతీయ వెదురు మిషన్ కింద హెక్టార్ కు 400 మొక్కలు చొప్పున వెదురు నాటుకున్నట్లయితే మొదటి సంవత్సరం రూ. 36వేలు, రెండవ సంవత్సరం రూ. 24వేలు రాయితీ ఇవ్వడం జరుగుతుందన్నారు. సువెన్ ఆగ్రో ఇండస్ట్రీస్ జిఎం కొండారెడ్డి మాట్లాడుతూ సంవత్సరం పొడుగునా 2 ఇంచుల నీరు ఉన్నట్లయితే పామ్ ఆయిల్ పంటను 5 ఎకరాలలో నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చన్నారు. మొక్కలను 9 మీటర్ల దూరంలో నాటుకోవాలని తెలియజేశారు. నాటుకున్న 3 సంవత్సరాల తరువాత పంట దిగుబడి రావడం ప్రారంభమవుతుందని, ఎకరానికి 4వ సంవత్సరంలో 4 టన్నుల దిగుబడి వరకు వస్తుందన్నారు. అలాగే పామాయిల్ పంట సాగులో పాటించవలసిన యాజమాన్య పద్ధతులను వివరించారు. ప్రస్తుతం పామాయిల్ ధర టన్నుకు రూ.23,770 ఉందని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉద్యాన రైతు సేవా కేంద్ర అధికారి మధుసూదన్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
పామ్ ఆయిల్ సాగు లాభదాయకం
08 జులై, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 08, 2026, 01:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)