చేతులెత్తి నమస్కరిస్తున్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి
రాజ్యాంగాన్ని పరిరక్షించండి...
- ఇప్పటికైనా ప్రజల్లో భయాందోళన తొలగించండి..
- ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడండి : సీనియర్ న్యాయవాది, కడప బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి.వి. రాఘవరెడ్డి
ప్రజాశక్తి - కడప : చేతులెత్తి నమస్కరిస్తున్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, భారత రాజ్యాంగాన్ని పరిరక్షించండి, నవంబర్ 1వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జరిగే పోలింగ్ లో ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల అధికారులు, ముఖ్యంగా పోలీసు అధికారులు, సిబ్బంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తమ విధులు సమర్థవంతంగా నిర్వర్తించి పోలింగ్ ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా చూడాలని సీనియర్ న్యాయవాది, కడప బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి.వి. రాఘవరెడ్డి సూచించారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ న్యాయవాది, కడప బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి.వి. రాఘవరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదన్నారు. అసలు ఎన్నికల షెడ్యూల్ సరైన పద్ధతిలో విడుదల చేయలేదని అన్నారు. నామినేషన్ల ప్రక్రియను చూస్తే పౌర సమాజం సిగ్గుతో తలదించుకొనేలా ఉందన్నారు. కడపలో దశాబ్దాల కాలం నుంచి శాంతియుతంగా జీవించే ప్రజలు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను చూసి దిగ్భ్రాంతికి గురయ్యారన్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార, ప్రతిపక్ష, స్వాతంత్ర అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు రావడం సహజమన్నారు. అయితే అధికార పక్షానికి చెందిన వారు ప్రత్యర్థులను నామినేషన్ వేయకుండా అడ్డుకునేందుకు ఒక్కో నామినేషన్ కేంద్రం వద్ద 200 నుంచి 300 మంది వరకు మారునాయుధాలతో మొహరింప చేశారన్నారు. పోలీసు అధికారులు సిబ్బంది కూడా వారికి సహకరించడం సిగ్గుచేటు అన్నారు. దీంతో సామాన్యుడు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవ చేయాలన్నది లేకుండా పోయిందన్నారు. స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ప్రజల మనుగడ ఉంటుందన్నారు. ఆరాకూర నామినేషన్లు వేసిన స్థానాల్లో కూడా స్కూటీనీలో ఎన్నికల అధికారులు దుర్మార్గంగా వ్యవహరించి ప్రత్యర్థుల నామినేషన్లను తిరస్కరించడంతో అధికార పార్టీ అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నిక చేశారన్నారు. దీన్ని చూసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులు తమ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జబ్బలు తరుచుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇది ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు అన్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసింది, అయితే నవంబర్ 1వ తేదీన నిర్వహించే పోలింగ్ లో ఓట్లు స్వచ్ఛందంగా ఎలా వేయాలి అన్న భయంతో ప్రజలు ఉన్నారన్నారు. ప్రజలకు రక్షణ లేకుండా పోయింది ఎందుకంటే అధికార పక్షానికి ఎన్నికల అధికారులు, పోలీసులే అండగా ఉండి ప్రజలు స్వచ్ఛందంగా ఓటు వేసేందుకు రానివ్వకుండా ఉండేలా చూస్తున్నారన్నారు. స్వచ్ఛందంగా మేము ఎలా ఓటు వేయాలి అని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఇవాళ నెలకొందన్నారు. మీడియా ముఖంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకో ఎలా చూడాలని ఎన్నికల కమిషన్ ను, జిల్లా ఎన్నికల అధికారిని, పోలింగ్ లో విధులు నిర్వర్తించే అధికారులను, ముఖ్యంగా జిల్లా ఎస్పీ, పోలీసు అధికారులు, సిబ్బందిని కోరుతున్నానని చెప్పారు. నిర్భయంగా పోలింగ్ కేంద్రాల వద్దకు ప్రజలు వచ్చి తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్ సరళితోపాటు, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లను కౌంటింగ్ కేంద్రానికి పంపించేంతవరకు సీసీ ఫుటేజ్ చిత్రీకరణ ఉండాలని అన్నారు.








కామెంట్లు (0)