ప్రజాశక్తి - రాజంపేట : రాయలసీమ దశ, దిశను మార్చేలా కూటమి ప్రభుత్వం బృహత్తర ప్రణాళికతో ముందుకు సాగుతోందని, రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా ప్రభుత్వం కృషి చేస్తుందని సబ్ కలెక్టర్ హెచ్.ఎస్ భావన, రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి చమర్తి జగన్ మోహన్ రాజు అన్నారు. బుధవారం రాజంపేట పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద "ప్రపంచ ఉద్యాన కేంద్రంగా రాయలసీమ" అంశంపై హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజంపేట సబ్ కలెక్టర్ భావన (ఐఏఎస్ ), జగన్మోహన్ రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అనంతరం రైతుల భారీ ట్రాక్టర్ ర్యాలీని సబ్ కలెక్టర్‌తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మరియు చమర్తి జగన్ మోహన్ రాజు మాట్లాడుతూ.. ప్రధాని మోడీ సహకారం, కూటమి ప్రభుత్వం దూరదృష్టితో రాయలసీమ సహా 10 జిల్లాలను కలిపి రూ 1 లక్ష కోట్లతో ప్రపంచ స్థాయి 'హార్టికల్చర్ హబ్'గా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. కేంద్రం రూ 10 వేల కోట్లు, రాష్ట్రం రూ 30 వేల కోట్లు కేటాయించగా, ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా రూ 60 వేల కోట్లు సమీకరిస్తున్నారని చెప్పారు. రాజంపేట డివిజన్‌ను 3 క్లస్టర్లుగా విభజించారని, స్థానిక ఉద్యాన అభివృద్ధికి రూ 200 కోట్లు, అలాగే అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ 788 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. దీని ద్వారా సాగు విస్తీర్ణం 3,453 హెక్టార్ల నుంచి 6,620 హెక్టార్లకు విస్తరించి, అన్నదాతల వార్షిక ఆదాయం రూ 423 కోట్ల నుంచి రూ 811 కోట్లకు రెట్టింపు కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాళ్లసీమగా పిలవబడ్డ సీమ గడ్డ.. ప్రపంచానికే ఆహార బుట్టగా మారబోతున్న తరుణంలో అక్టోబర్ 2న ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టుకు రైతాంగం మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం కమిటీ చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఉద్యాన శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)