బుధవారం, 30 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మిస్సింగ్ కేసులో మహిళ ఆచూకీ గుర్తించిన వల్లంపూడి పోలీసులు

1 గంట క్రితం

vzm
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 30, 2026, 04:19 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్తరాఖండ్‌లో గుర్తింపు.. కుటుంబ సభ్యులకు అప్పగింత

ప్రజాశక్తి - వేపాడ : వేపాడ మండలం వల్లంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మహిళ మిస్సింగ్ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉత్తరాఖండ్‌లో ఉన్న మహిళ ఆచూకీని గుర్తించి, ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

వివరాల్లోకి వెళితే.. విజయనగరం జిల్లా వేపాడ మండలం సోంపురం గ్రామానికి చెందిన మల్లా రాము భార్య ఆళ్ల భార్గవి ఈ నెల 10వ తేదీ రాత్రి సమయంలో ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 19వ తేదీన వల్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ ఎస్. సుదర్శన్ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఎస్ఐ ఎస్. సుదర్శన్ త్వరితగతిన దర్యాప్తు చేపట్టారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఫోన్ ద్వారా మహిళ ఆచూకీని గుర్తించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌లోని రైల్వే స్టేషన్ సమీపంలో ఆమె ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అక్కడి స్థానిక పోలీసులను సంప్రదించి, వారి సహకారంతో మహిళ ఆచూకీని నిర్ధారించారు. అనంతరం మహిళ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేసి, ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించేలా చర్యలు తీసుకున్నారు. తమ కుటుంబ సభ్యురాలి ఆచూకీని త్వరితగతిన గుర్తించి, ఆమెను తిరిగి తమకు చేరువ చేసిన వల్లంపూడి పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తన వ్యక్తిగత జీవితంపై అసహనంతో అందరినీ వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని, ఎవరికీ సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు ఆళ్ల భార్గవి పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఈ కేసులో వేగంగా స్పందించి మహిళ ఆచూకీని గుర్తించిన పోలీసులపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్