ప్రజాశక్తి–కడప అర్బన్: ఇంద్రజాల ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నామని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు, మెజీషియన్ సమీర్ బాషా తెలిపారు. ఆదివారం కడప నగరంలోని ప్రకాశ్‌నగర్‌లో ఉన్న బీసీ హాస్టల్‌లో జన విజ్ఞాన వేదిక, బాలోత్సవ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇంద్రజాల ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా సమీర్ బాషా మాట్లాడుతూ ప్రతి విషయాన్ని శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించాలని విద్యార్థులకు సూచించారు. ఇంద్రజాల ప్రదర్శనలో కనిపించే అద్భుతాలను శాస్త్రీయ పద్ధతుల్లో వివరిస్తూ, వాటి వెనుక ఉన్న మర్మాలను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. మంత్రాలు, మహిమలు, అతీంద్రియ శక్తుల పేరుతో ప్రజలను మోసం చేసే విధానాలను ఇంద్రజాల ప్రదర్శనల ద్వారా వివరించారు. అద్భుతాలను చూసి భయపడకుండా వాటి వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడమే శాస్త్రీయ దృక్పథమని తెలిపారు. విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకుని, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర సభ్యులు, మెజీషియన్ బాల బయన్న వివిధ ఇంద్రజాల ప్రదర్శనలు నిర్వహించి, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ సూత్రాలను వివరించారు. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సీనియర్ నాయకులు వెంకటేశ్వర్లు, హాస్టల్ అకౌంటెంట్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.






కామెంట్‌లు (0)