బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

దేశంలో మొదటిసారి తగ్గిన డిగ్రీ విద్యార్థుల నమోదు

22 జులై, 2026

undergraduate
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 01:03 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

ఎఐఎస్‌హెచ్‌ఇ నివేదికలో ఆందోళనకర ధోరణి

న్యూఢిల్లీ : కాక్రోచ్‌ జనతా పార్టీ (సిజెపి), పర్యావరణ కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌ నేతృత్వంలో కొనసాగుతున్న నిరసనలతో దేశవ్యాప్తంగా విద్యా సంబంధిత అంశాలు ప్రధానంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే డిగ్రీ (అండర్‌గ్రాడ్యుయేట్) కోర్సుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య మొదటిసారి తగ్గినట్లు నివేదిక స్పష్టం చేసింది. దేశంలో ఉన్నత విద్యలో మొత్తం విద్యార్థుల నమోదు స్వల్పంగా పెరిగినప్పటికీ, డిగ్రీ కోర్సుల్లో చేరేవారి సంఖ్య తగ్గడం గమనార్హం. కేంద్ర విద్యాశాఖ (ఎంఒఇ) ఇటీవల విడుదల చేసిన 2022-23, 2023-24 అఖిల భారత ఉన్నత విద్యా సర్వే (ఎఐఎస్‌హెచ్‌ఇ) నివేదికలు ఈ ఆందోళనకర ధోరణిని వెలుగులోకి తెచ్చాయి. 2011 నుంచి ఎఐఎస్‌హెచ్‌ఇ నివేదికలు విడుదలవుతున్నప్పటి నుంచి డిగ్రీ కోర్సుల నమోదులో తగ్గుదల నమోదవడం ఇదే మొదటిసారి. అయితే ఎంఒఇ ఈ నివేదిక విడుదలలో తీవ్ర జాప్యం చేసింది. 2021-22 సంవత్సరానికి సంబంధించిన ఎఐఎస్‌హెచ్‌ఇ నివేదిక 2024 జనవరిలో ఆలస్యంగా విడుదలైంది. అనంతరం రెండేళ్లకు పైగా గడిచిన తర్వాత 2022-23, 2024సంవత్సరాల నివేదికలను ఈ నెల ప్రారంభంలో ఎటువంటి హడావుడి లేకుండా ఎంఒఇ ఒకే విడుదల చేసింది.

స్వల్పంగా పెరిగిన మొత్తం నమోదు

2022-23తో పోలిస్తే 2023-24 విద్యా సంవత్సరంలో ఉన్నత విద్యలో మొత్తం నమోదు 3.7 లక్షలు (0.8 శాతం) పెరిగింది. ఇందులో డిగ్రీ, పీజీ, డిప్లొమా, పీహెచ్‌డీ కోర్సులన్నీ ఉన్నాయి. అయితే ఇది ఇప్పటివరకు నమోదైన అత్యల్ప వార్షిక వృద్ధిగా నివేదిక పేర్కొంది.

తగ్గిన డిగ్రీ అడ్మిషన్లు

మొత్తం ఉన్నత విద్యలో 75 శాతానికి పైగా వాటా కలిగిన అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సుల్లో మాత్రం విద్యార్థుల నమోదు 93 వేల మేర (0.27 శాతం) తగ్గింది. అర్హత వయస్సు గల యువ జనాభా పెరగడంతో పాటు, ఎఐఎస్‌హెచ్ఇలో పాల్గొన్న ఉన్నత విద్యాసంస్థల (హెచ్‌ఇఐఎస్‌) సంఖ్య 56,180 నుంచి 59,533కు పెరిగినప్పటికీ ఈ తగ్గుదల నమోదైంది. స్థూల నమోదు నిష్పత్తి (జిఇఆర్‌) 29.5 నుండి 30కి స్వల్పంగా పెరిగిన అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించిన 2023-24 నివేదిక, ఎస్‌టిఇఎం కోర్సుల్లో మహిళా విద్యార్థుల నమోదు పెరిగిందని తెలిపింది.

పురుష విద్యార్థుల నమోదులోనే క్షీణత

డిగ్రీ కోర్సుల్లో నమోదైన తగ్గుదల ప్రధానంగా పురుష విద్యార్థుల్లో మాత్రమే కనిపించింది. 2022-23తో పోలిస్తే పురుషుల నమోదు 2.2 శాతం తగ్గగా, మహిళల నమోదు 1.8 శాతం పెరిగింది. అయినప్పటికీ మొత్తం సంఖ్యలో పురుష విద్యార్థుల తగ్గుదల ప్రభావం ఎక్కువగా ఉండటంతో అండర్‌గ్రాడ్యుయేట్ నమోదు క్షీణించింది.

కొన్ని రాష్ట్రాల్లో భారీ తగ్గుదల

పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో డిగ్రీ కోర్సుల్లో చేరికలు అత్యధికంగా తగ్గాయి. పశ్చిమబెంగాల్‌, మహారాష్ట్ర (-6శాతం), ఉత్తరప్రదేశ్‌లో (-3శాతం) గ్గుదల నమోదైంది. కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ, జమ్మూ–కాశ్మీర్‌లోనూ గణనీయమైన క్షీణత కనిపించింది. విద్యా రంగానికి ప్రధాన కేంద్రంగా ఉన్న ఢిల్లీలోనే డిగ్రీ విద్యార్థుల నమోదు 6 శాతం తగ్గింది. నమోదుల సంఖ్యలో, తగ్గుదల నమోదైన రాష్ట్రాల్లో మొత్తం ఆరు లక్ష‍లకు పైగా తగ్గుదల కనిపించింది. కొన్ని రాష్ట్రాల్లో నమోదైన తగ్గుదలను తమిళనాడు, బీహార్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల్లో పెరిగిన నమోదు కొంత మేర భర్తీ చేసింది. ముఖ్యంగా తమిళనాడులో 1.6 లక్షల అదనపు నమోదు నమోదైంది. ఇది ఉత్తరప్రదేశ్‌లో నమోదైన 1.53 లక్షల తగ్గుదల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.

ఆర్ట్స్, కామర్స్ కోర్సులపై ప్రభావం

కోర్సుల వారీగా పరిశీలిస్తే ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విభాగాల్లో ఈతగ్గుదల కనిపించింది. 2022-23తో పోలిస్తే 2023-24లో ఆర్ట్స్ కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య 6 లక్షలకు పైగా తగ్గింది. ఇది సుమారు 5శాతం తగ్గుదల. ఇదే సమయంలో కామర్స్‌ విభాగంలో చేరికలు కూడా గణనీయంగా తగ్గి, సుమారు 2.3 లక్షల తగ్గుదల నమోదైంది. ఈ ధోరణి సంప్రదాయ డిగ్రీ కోర్సులపై విద్యార్థుల ఆసక్తి తగ్గుతున్న సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో భిన్న ధోరణి

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్‌లో భిన్నమైన ధోరణి కనిపించింది. ఉత్తరప్రదేశ్‌లో డిగ్రీ కోర్సుల్లో చేరికలు గణనీయంగా తగ్గగా, డిప్లొమా కోర్సుల్లో చేరికలు సుమారు అదేస్థాయిలో పెరిగాయి. డిగ్రీ కోర్సుల్లో చేరిన విద్యార్తుల సంఖ్య 1.53 లక్షలు తగ్గగా, డిప్లొమా కోర్సుల్లో చేరిన వారి సంఖ్య 1.38 లక్ష‍ల మేర గణనీయంగా పెరిగింది.

స్పందించని కేంద్ర ప్రభుత్వం

2023-24 నివేదికలో స్థూల నమోదు నిష్పత్తి (జిఇఆర్‌) 29.5 నుంచి 30కు పెరిగిందని, మహిళల ఎస్‌టిఇఎం (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్) కోర్సుల నమోదు పెరిగిందని కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించినప్పటికీ, డిగ్రీ కోర్సుల్లో నమోదైన ఈ తగ్గుదలపై మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కేంద్ర విద్యాశాఖ గాని, ధర్మేంద్ర ప్రధాన్‌ గాని ఈ నివేదికపై స్పందించలేదు. నివేదికల విడుదలలోనూ కేంద్ర విద్యాశాఖ గణనీయమైన ఆలస్యం చేసిందని విద్యారంగ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్