సోమవారం, 06 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

శిశు వికాసం... బాల్య దశ నిర్మాణాలే కీలకం...

1 గంట క్రితం

ap tet
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 06, 2026, 05:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

ఎపి టెట్ 2026 ప్రత్యేకం

వ్యక్తి జీవితంలో బాల్య దశ కీలకమైంది.ఈ దశలో పొందిన అనుభవాలు వారి మూర్తిమత్వ వికాసంపై ప్రభావం చూపుతాయి. ఫిలిప్‌ ఏలిస్‌ రచించిన Centuries of Childhoodలో బాల్యం అనేది సహజ సిద్ధం కాదని సమాజం ఏర్పరిచిన భావంగా గుర్తించారు.జాన్‌ లాక్‌ అనే తత్వవేత్త బాల్యంలో పిల్లల మనసు ఏమిరాయని నల్లబల్ల ట్యాబ్యులా రసా (Tabula Rasa) వంటిది అని పేర్కొన్నారు.1989లో ఐక్యరాజ్యసమితి బాలల హక్కులను ప్రకటించేటపుడు 18సంవత్సరాల్లోపు ఉన్నవారిని బాలలుగా గుర్తించింది. ప్రస్తుత జనాభా గణనలో 14సంవత్సరాల్లోపు వయస్సు ఉన్నవారిని బాలలుగా ప్రకటించారు. Care and Protection of Children Act-2000, Juval Justice ప్రకారం18 సంవత్సరాల్లోపు వయస్సు గల వారిని బాలలుగా పేర్కొన్నారు. భారతదేశ రాజ్యాంగం ప్రకారం 6-14సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఉచిత నిర్భంధ విద్య అందించాలి.బడిబయట ఉన్న పిల్లలందరూ బాల కార్మికులే. ది మైనింగ్‌ యాక్ట్‌ ఆఫ్‌ 1952లో18సంవత్సరాల్లోపు కన్నా తక్కువ వయస్సు ఉన్న పిల్లలు గనుల్లో పనిచేయడాన్ని నిషేదించింది.ది ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌ యాక్ట్‌( POCSO)ని2012లో ప్రవేశపెట్టి,చైల్ట్‌లైన్‌ పేరుతో 1098 టోల్‌ఫ్రీ నెంబరు ద్వారా వారి రక్షణ చర్యలు చేపట్టింది.

పిల్లలు తమ జీవితంలో తటస్దపడే మొదటి వ్యక్తులు వారి తల్లిదండ్రులు.వారు ఎదుర్కొనే మొదటి సాంఘిక సంస్ధ కుటుంబం.కుటుంబం పిల్లలకు వాత్సల్యాన్ని ఇవ్వడం, సాంఘిక విలువలను, సమాజంతో తదాత్మ్యన్ని కల్పించడం వంటి మూడు ముఖ్యకార్యాలను నిర్వహిస్తుందని విట్‌మర్‌ హెచ్‌, కోటిన్‌స్కీఆర్‌లు పేర్కొన్నారు.విభిన్న మనస్తత్వాలు గల తల్లిదండ్రుల వలన శిశువు ప్రవర్తన ఏ విధంగా ఉంటుందనే అంశంపై రాడ్కే పరిశీలన చేశారు.ఆర్ధిక లేమితో తల్లిదండ్రుల ఆత్రుత,పోషణ లేకపోవడం వంటి కారకాలు వ్యక్తులలో మానసిక గాయాలు రేపుతాయని టాగార్టెన్‌ (1946) అభిప్రాయపడ్డారు.కుటుంబ సాంఘిక హోదా కూడా చాలా వరకు ఆర్ధిక హోదాపై ఆధారపడి ఉంటుంది. కుటుంబం, సంస్కృతిని ఒక తరం నుంచి మరొక తరానికి అందించేందుకు దోహదం చేసే ఒక సామాజిక సంస్ధ. సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ పిల్లల పెంపకం, తల్లిదండ్రుల ప్రవర్తన పిల్లల మూర్తిమత్తంపై ప్రభావాన్ని చూపుతాయని తన మనోలైంగిక సిద్దాంతంలో పేర్కొన్నారు. స్పెరా ననుసరించి పెంపక విధానం పిలల్ల సామాజికీకరణకు ఉపయోగించే నిర్ధిష్ట ప్రవర్తనలను సూచిస్తే, పెంపక శైలి పిల్లలకు కల్పించే ఉద్వేగ వాతావరణాన్ని సూచిస్తుంది.బామ్‌రిండ్‌,బ్లాక్‌లు పిల్లల పెంపక శైలుల ప్రభావాన్ని ప్రభావితం చేసే 3అంశాలను ప్రతిపాదించారు. పిల్లల పెంపక శైలులును 4రకాలుగా వర్గీకరించారు.

1.సాధికారతత్వ పిల్లల పెంపక శైలి (Authoritative Parenting Style)

2.నిరంకుతత్వ పెంపక శైలి (Authoritatrain Parenting Style)

3.అంగీకరతత్వ పెంపక శైలి (Permissive Parenting Style)

4.జోక్యరహిత పిల్లల పెంపక శైలి (Uninvolved Parenting Style)

రూబిన్‌,బకౌస్కీ,పార్కర్‌ ల ప్రకారం బాలలు మొదట తమకు సామీప్యంలో ఉన్నవారితో సమవయస్క బృందాలుగా (Peer Groups) ఏర్పడతారు.పాఠశాలలో వైయక్తిక, సహకార సంబంధమైన సంస్కృతులు ఉంటాయని పుల్లన్‌,హరగ్రీవెన్‌ తెలిపారు. పాఠశాల సంస్కృతి అనే భావనను విల్లార్డ్‌ వాలర్‌ అనే సామాజికవేత్త1932లో రచించిన (The Socialogy nof Teaching) అనే పుస్తకంలో తెలియజేశారు.ఉపాధ్యాయుని అంచనాలు విద్యార్థుల సాధనను ఎంతో ప్రభావితం చేస్తాయనే అంశంపై రోసెంధాల్‌,జాకబ్‌సన్‌లు పరిశోధనలు చేసి పిగ్మేలియన్‌ ఇన్‌ క్లాస్‌రూమ్‌ ( Pygmallion in Classroom ) అనే పుస్తకంలో ప్రచురించారు.వీరి ఫలితాల్లో ఉన్నత అంచనాలు విద్యార్ధుల పనితీరు పెంచడానికి దారితీసింది.ఇలా ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శన కు దారితీయటాన్ని పిగ్మేలియన్‌ ఫలితం అంటారు.

శిశు వికాస అధ్యయన పద్ధతులు:

1.పరిశీలనా పద్ధతి: ఏదైనా ఒక విషయాన్ని నిశితంగా,స్ఫష్టంగా, సన్నద్ధతో గమనించడాన్నే పరిశీలన అంటారు.దీనిని పరిశీలించే సందర్బాన్ని బట్టి

ఎ.సహజ పరిశీలన( అనియంత్రిత పరిశీలన)

బి.కృత్రిమ లేక ప్రయోగ పరిశీలన (నియంత్రిత పరిశీలన )గా

పరిశీలకుడు పాల్గొనే పరిశీలనను బట్టి

ఎ.సహభాగి లేదా సంచరిత పరిశీలన

బి.సహభాగేతర లేదా అసంచరిత పరిశీలనగా విభజించారు.

బాలల వికాసాన్ని అధ్యయనం చేయడానికి అమెరికా కు చెందిన గెస్సల్‌ అబ్జర్వేషన్‌ డన్‌ అనే పరికరాన్ని రూపొందించారు.

2.అంతరీక్షణ పద్ధతి: ఈ పద్ధతిని సంరచనాత్మక వాది సెయింట్‌ అగష్టీన్‌ పెంపొందిచారు.ఈ పద్ధతిని ఆత్మావలోకనం లేదా స్వయం పరిశీలన అంటారు.అంత:పరీక్షణ కనుగొనడానికి ఉపయోగించేది సంరచనాత్మక వాదం.ఇందులో వ్యక్తి నిష్టత ఎక్కవ.ప్రయోక్త,ప్రయోజ్యుడు ఒకరే.

3.పరిపృచ్ఛా పద్ధతి : దీనిని ఇంటర్యూ పద్ధతి అంటారు.మెకాబే నిర్వచనం ప్రకారం ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ముఖాముఖి సంభాషించి, వారి నుంచి సమాచారాన్ని రాబట్టి,నమోదు చేసి,విశ్లేషించి వ్యాఖ్యానించే పద్ధతినే పరిపృచ్ఛ పద్ధతి అంటారు.ప్రశ్నలు అడిగే వ్యక్తి పరిపృచ్ఛకుడు,సమాధానాలు ఇచ్చే వ్యక్తి పరిపృచ్ఛితుడు.దీనిని సంచరిత పరిపృచ్ఛ మరియు అసంచరిత పరపృచ్ఛ అని రెండు రకాలుగా చెప్పొచ్చు.

ఎ.సంచరిత పరిపృచ్ఛ: ఇది ప్రణాళికా బద్దమైన పరిపృచ్ఛ.కావల్సిన సమాచారాన్ని రాబట్టడానికి సరిపోయే ప్రశ్నలు ముందుగానే తయారు చేసుకొని జవాబులు రాబట్టి విశ్లేషిస్తారు.

బి.అసంచరిత పరిపృచ్ఛ: దానిని ప్రవేశపెట్టిన వారు కార్ల్‌రోజర్స్‌.ఇది ప్రణాళికా రహిత పరిపృచ్ఛ.సందర్భానుసారం ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టి విశ్లేషిస్తారు.

4. ప్రయోగ పద్ధతి :నియంత్రిత పరిస్థితులలో ప్రవర్తనను అధ్యయనం చేయడమే ప్రయోగ పద్ధతి.దీనిని అభివృద్ధి చేసింది ప్రవర్తనా వాదులు. ఈ పద్ధతి అత్యంత వస్తునిష్ఠత,శాస్త్రీయత,విశ్వసనీయత గలది. కారణం- ఫలితాన్ని ప్రత్యక్షంగా గుర్తించ గల పద్ధతి. దీనిని మళ్లీ రిపీట్‌ చేయొచ్చు.

ఈ పద్ధతిలో చరాలు

ఎ.స్వతంత్ర చరం: ప్రయోక్త ఆధీనంలో ఉంటుంది.

బి.పరతంత్ర చరం: ఇది స్వతంత్రచర ప్రభావానికి లోనయ్యేది.

సి.జోక్యచరం:స్వతంత్ర,పరతంత్ర చరానికి మధ్యలో వచ్చి ఫలితాలను తారుమారు చేసేది.

జోక్యచరాల నియంత్రణ పద్ధతులు:

ఎ.సమజోడి పద్ధతి: సమాన ప్రజ్ఞ గల వారిని ఒక్కొక్కరిని ఒక సమూహానికి ఇవ్వడం.

బి.సమసమూహ పద్ధతి: సమాన ప్రజ్ఞ గలవారిని రెండు సమూహాలుగా ఎంపిక చేయడం.

సి.యాదృచ్ఛిక పద్ధతి:యాదృచ్ఛికంగా వ్యక్తులను ఎంపిక చేయడం.

సమూహాలు:

ఎ.నియంత్రిత సమూహం: ప్రయోగానికి గురికాని సమూహం ఉద్దీపనలు లేని సమూహం.

బి.ప్రయోగ సమూహం: ప్రయోగానికి గురి అయ్యేది ఉద్దీపనలు ప్రవేశపెట్టే సమూహం.

నమూనాలు:

ఎ.ఏక సమూహ నమూనా: ఒకే సమూహం ఒకసారి నియంత్రిత విధానం,ఒకసారి ప్రయోగంగా వ్యవహరిస్తుంది.

బి.సమాంతర సమూహ నమూనా: ఒకే విధంగా రెండు సమూహాలలో ఒకదానిపి ప్రయోగ సమూహంగా,మరొక దానిని నియంత్రణ సమూహంగా ప్రయోగం చేస్తారు.

సి. భ్రమణ నమూనా: ఇది రెండు అంచెలలో జరుగుతుంది.మొదటి అంచెలో ఒక సమూహం నియంత్రిత సమూహంగానూ,రెండవ సమూహం ప్రయోగాత్మకం సమూహంగాను పాల్గొంటారు.రెండవ అంచెలో నియంత్రిత సమూహం ప్రయోగాత్మక సమూహంగానూ,ప్రయోగాత్మక సమూహం నియంత్రిత సమూహంగాను వ్యవహరిస్తుంది.

5.బహుళ సమూహ పద్ధతి: దీనిలో రెండు కంటే ఎక్కువ సమూహాలు ఉంటాయి.వీటిలో ఒక సమూహం నియంత్రిత సమూహంగాను,మిగిలిని ప్రయోగ సమూహంగాను వ్యవహరిస్తాయి.

6.వ్యక్తి అధ్యయన పద్ధతి (కేస్‌ స్టడీ): ఒక వ్యక్తిని నిశితంగా పరిశీలించి,లోతుగా పరిశీలించి ,అవసరమైన సమాచరం రాబట్టి,నమోదు చేసి విశ్లేషించి వ్యాఖ్యానించే పద్ధతిని వ్యక్తి అధ్యయన పద్ధతి అంటారు.దీనిని చికిత్సా పద్ధతి (క్లినికల్‌ మెథడ్‌) అనికూడా అంటారు.బోని,హిలపిల్‌మాన్‌ నిర్వచనం ప్రకారం సమస్యాపూరిత విద్యార్థికి సంబంధిచి సమగ్ర విచారణ జరిపి,ఆవ్యక్తి సమస్యను నివారించేదుకు ఉపయోగపడే పద్ధతినే వ్యక్తి చరిత్ర పద్ధతి అంటారు.ఈ పద్ధతిలో రెండు దశలుంటాయి.

ఎ.సమస్య నిర్ధారణ దశ

బి.సమస్య నివారణ దశ.

ప్రశ్నలు

1.సెంచరీస్‌ ఆఫ్‌ చైల్డ్‌హుడ్‌ పుస్తక రచయిత ఎవరు?

ఎ)మొకాబే బి)హర్లాక్‌ సి) ఫిలిప్‌ ఏరిస్‌ డి)భౌమ్రండ్‌

2.పిల్లల మనసు ఏమిరాయని నల్లబల్లగా తన రచనలలో పేర్కొన్న వారు?

ఎ)జాన్‌ లాక్‌ బి) ఎరిక్‌ ఎరిక్‌్‌ సి)ఆరిస్టాటిల్‌ డి) స్కిన్నర్‌

3.బాగా విజయవంతమైన పిల్లల పెంపక శైలి?

ఎ)సాధికార తత్వశైలి బి)నిరంకుశ తత్వశైలి సి)అంగీకార తత్వశైలి డి)జోక్యరహిత శైలి

4.కార్యకారణ సంబంధం గల పద్ధతి?

ఎ)అంతరీక్షణ పద్ధతి బి)పరిశీలనా పద్ధతి సి) ప్రయోగ పద్ధతి డి)పరిపృచ్ఛ పద్ధతి

5.నీలోనికి నీవు తొంగి చూసుకో అని ఏ పద్ధతిని పిలుస్తారు?

ఎ)పరిశీలనా పద్ధతి బి) ప్రయాగ పద్ధతి సి) వ్యక్తి అధ్యయన పద్ధతి డి)అంత:రీక్షణ పద్ధతి

సమాధానాలు: 1 సి 2.ఎ3.ఎ4.సి5.డి


- ఎస్‌పి మనోహర్‌కుమార్‌

స్కూల్‌ అసిస్టెంట్‌ ఇంగ్లీష్‌,

జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఉర్దూ,

ఉయ్యూరు,కృష్ణాజిల్లా.సెల్‌: 9490762412

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్