ఆదివారం, 16 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

జల విషాదాలు

1 గంట క్రితం

accident
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 17, 2026, 12:36 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- వేర్వేరు ఘటనల్లో ఏడుగురు దుర్మరణం

- మృతుల్లో ఆరుగురు ఇంజనీరింగ్‌ విద్యార్థులు, ఒక మత్స్యకారుడు

- మరో ఇంజనీరింగ్‌ ‌విద్యార్థి గల్లంతు

ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్రంలో ఆదివారం జల విషాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృతి చెందారు. వారిలో ఆరుగురు ఇంజనీరింగ్‌ ‌విద్యార్థులు, ఒక మత్స్యకారుడు ఉన్నారు. మరో ఇంజనీరింగ్‌ ‌విద్యార్థి గల్లంతయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్‌ ‌కళాశాలలో సెకండియర్‌ ‌చదువుతున్న స్నేహితులు ఆరుగురు ఒక కారులో తూర్పుగోదావరి జిల్లా పెరవలిలో స్నేహితుని బంధువు వివాహానికి శనివారం రాత్రి హాజరయ్యారు. అనంతరం వారు ఇరగవరం మండలం ఓగిడి వెళ్లారు. అక్కడ నుంచి ఆదివారం తెల్లవారుజామున తిరిగి నరసాపురం వెళ్లేందుకు కారులో బయల్దేరారు. పశ్చిమగోదావరి జిల్లా_ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల వద్ద_కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు నుంచి బయటపడిన మట్టా సంతోష్‌ సమీపంలోని చెట్టుకొమ్మను పట్టుకుని వేలాడుతుండగా స్థానికులు రక్షించారు. ‌మిగిలిన ఐదుగురు కాల్వ ప్రవాహ ఉధృతికి గల్లంతయ్యారు. తాడేపల్లిగూడెం డిఎస్‌‌పి రవిచంద్ర, తణుకు టౌన్, రూరల్‌ సిఐ‌లు రమణ, వెంకటేశ్వరరావు తన సిబ్బందితో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అంబేద్కర్‌ ‌కోనసీమ జిల్లా మలికిపురం మండలం మోరి గ్రామానికి చెందిన పోతుల లక్ష్మీభాను వికాస్ అభిరామ్ (18), నాగిరెడ్డి దుష్యంత్ (18), పాలకొల్లు మండలం చింతపర్రుకు చెందిన వీరమల్లు సాయికిరణ్ (19), పెనుమంట్ర మండలం సత్యవరం గ్రామానికి చెందిన నాగాబత్తుల తేజ సాయి సూర్య (19) మృతదేహాలు సాయంత్రం లభ్యమయ్యాయి. అంబేద్కర్‌ ‌కోనసీమ జిల్లా మలికిపురం మండలం మోరి గ్రామానికి చెందిన రాజారాం చరణ్ (18) కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలాన్ని తణుకు ఎంఎల్‌ఎ ఆరిమిల్లి రాధాకృష్ణ పరిశీలించారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ఎస్‌ఆర్‌‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నలుగురు పాలకోడేరు మండలం వేండ్ర గ్రామం వద్ద జిఅండ్‌‌వి కెనాల్‌‌ వద్దకు ద్విచక్ర వాహనాలపై వచ్చారు. ఒక విద్యార్థి గట్టుపైనే ఉండిపోగా లాకుల మీద నుంచి ఉప కెనాల్లోకి మిగిలిన ముగ్గురూ ఈత కొట్టేందుకు దిగారు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో భీమవరం శివారు గునుపూడికి చెందిన పెరుమాళ్ల సత్యభాస్కర విఘ్నేష్ (22), విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన శ్రీష్టి రాహుల్ (21) కొట్టుకుపోయి గల్లంతయ్యారు. మరో విద్యార్థి సురక్షితంగా గట్టుకు చేరారు. భీమవరం అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు. లాకులు దిగువన కొద్ది దూరంలో ఇద్దరి విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిద్దరూ సిఎస్ బిఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు.

అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం వెంకటనగరం గ్రామానికి చెందిన ఆరుగురు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వేట ముగించుకుని తిరిగి వెంకటనగరం సముద్రతీరానికి వస్తుండగా తీరం దగ్గరలో అలల ఉధృతికి వారి బోటు బోల్తా పడింది. దానికింద చిక్కుకుపోయిన ఉప్పాడ బాబ్జి (38) అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్