ఎపి టెట్ 2026 ప్రత్యేకం
సరైన ప్రణాళిక..ప్రామాణిక పాఠ్యపుస్తకాలు కీలకం
డీఎస్సీలో విజయాన్ని లక్ష్యంగా పెట్టుకున్న అభ్యర్థులు ముందుగా టెట్‌లో మంచి మార్కులు సాధించాలి. సరైన ప్రణాళికతో చదువుతూ,ప్రామాణిక పాఠ్యపుస్తకాలను ఎంపిక చేసుకోవడం అవసరం. టెట్ పరీక్షలో ఫిజికల్ సైన్స్ ప్రశ్నలు ప్రధానంగా ప్రాథమిక శాస్త్రీయ భావనలు, నియమాలు, సూత్రాలు,వాటి అనువర్తనాలపై ఆధారపడి ఉంటాయి.ప్రతి యూనిట్‌లోని ముఖ్యాంశాలను సంక్షిప్తంగా అధ్యయనం చేయడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విషయాలను పునశ్చరణ చేసుకోవచ్చు. ఫిజికల్ సైన్స్‌లో విజయం సాధించాలంటే కాన్సెప్ట్‌లపై పట్టు, నిరంతర రివిజన్ అనే రెండు అంశాలు అత్యంత కీలకం. కాన్సెప్ట్ అర్థమైతే ప్రశ్నలు సులభం – రివిజన్ చేస్తే విజయం ఖాయం.
1.కొలతలు(Measurement) : మన దైనందిన జీవితంలో ప్రతి పనిలోనూ కొలతలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మనం నడిచే దూరం, కొనుగోలు చేసే వస్తువుల పరిమాణం,ఇంటి విస్తీర్ణం, ప్రయాణ సమయం వంటి అనేక విషయాలను తెలుసుకోవడానికి కొలతలు అవసరం. ప్రాచీన కాలంలో మనుషులు అడుగు,మూర,చేతివేళ్లు వంటి అప్రామాణిక (Non-standard)యూనిట్లను ఉపయోగించి పొడవులను కొలిచేవారు.అయితే వ్యక్తి నుండి వ్యక్తికి ఈ కొలతలు మారిపోవడం వల్ల ఖచ్చితత్వం ఉండేది కాదు.నాగరికత అభివృద్ధి చెందడంతో,ముఖ్యంగా రవాణా (Transport), వాణిజ్యం,నిర్మాణ రంగాలు అభివృద్ధి చెందడంతో ఒకే విధమైన, ఖచ్చితమైన కొలతల అవసరం ఏర్పడింది.ప్రపంచవ్యాప్తంగా ఆమోదించబడిన ప్రామాణిక యూనిట్లు (Standard Units)రూపొందించబడ్డాయి.ప్రస్తుతం అంతర్జాతీయంగా SI (International System of Units) పద్ధతిని ఉపయోగిస్తున్నారు. కొలతల అధ్యాయంలో పొడవు (Length),వైశాల్యం(Area), ఘనపరిమాణం(Volume), కాలం(Time) వంటి భౌతిక పరిమాణాలను కొలిచే విధానాలు, వాటి యూనిట్లు, వక్రరేఖల పొడవు కొలవడం, CGS, SI పద్ధతుల మధ్య యూనిట్ మార్పిడులు వంటి అంశాలను అధ్యయనం చేస్తాము.
ఒక చిన్న ఆలోచన..."కొలవలేనిది అంచనా మాత్రమే; కొలవగలిగితే అది శాస్త్రం." అందుకే శాస్త్ర అధ్యయనానికి కొలతలు పునాది వంటివి. "TET, DSC, ఇతర పోటీ పరీక్షల్లో ఈ యూనిట్ నుండి ప్రమాణాలు, కొలతల పద్ధతులు, ప్రమాణ మార్పిడులపై ప్రశ్నలు తరచుగా అడుగుతారు.
2. చలనం(Motion) : మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ప్రతి క్షణం చలనం కనిపిస్తుంది. రోడ్డుపై ప్రయాణించే వాహనాలు, ఆకాశంలో ఎగిరే పక్షులు, భూమి చుట్టూ తిరిగే చంద్రుడు, గడియారంలోని లోలకం (Pendulum) – ఇవన్నీ చలనానికి ఉదాహరణలు. ఒక వస్తువు కాలానికి అనుగుణంగా తన స్థానాన్ని మార్చుకుంటే దానిని చలనం (Motion) అంటారు. స్థాన మార్పు జరగకపోతే దానిని విశ్రాంతి (Rest) అంటారు. చలనాన్ని అధ్యయనం చేయడానికి దూరం(Distance), స్థానభ్రంశం (Displacement), స్పీడ్(Speed), వేగం(Velocity), త్వరణం(Acceleration) వంటి భౌతిక రాసులను ఉపయోగిస్తారు. చలనాన్ని గ్రాఫ్‌ల ద్వారా కూడా సూచించచొచ్చు. అంతేకాకుండా వస్తువులపై పనిచేసే బలాల ప్రభావాన్ని వివరించే న్యూటన్ చలన నియమాలు (Newton’s Laws of Motion) భౌతిక శాస్త్రానికి పునాది వంటివి. ఈ అధ్యాయం ద్వారా అభ్యర్థులు చలన రకాలు, బలాలు, జడత్వం, ద్రవ్యరాశి, ద్రవ్యవేగం, చలన నియమాల గురించి అవగాహన పొందుతారు. "చలనం లేని ప్రపంచాన్నిఊహించలేం."ఈ యూనిట్ నుండి చలన భావనలు,గ్రాఫ్‌లు, న్యూటన్ చలన నియమాలపై ప్రశ్నలు తరచుగా అడుగుతారు.
3. బలం,ఘర్షణ, పీడనం (Force, Friction and Pressure) : మన దైనందిన జీవితంలో వస్తువులను నెట్టడం, లాగడం, ఎత్తడం వంటి చర్యలన్నీ బలం (Force) వల్లనే జరుగుతాయి. బలం అనేది నెట్టడం (Push) లేదా లాగడం (Pull). బలం ప్రభావంతో వస్తువు చలన స్థితి, వేగం, దిశ లేదా ఆకారం మారొచ్చు. వస్తువుల మధ్య పరస్పర స్పర్శ వల్ల ఏర్పడే ప్రతిఘటనను ఘర్షణ(Friction) అంటారు. మనం నడవడం నుంచి వాహనాలను సురక్షితంగా ఆపడం వరకు అనేక దైనందిన చర్యలు ఘర్షణ పైనే ఆధారపడి ఉంటాయి.అయితే అధిక ఘర్షణ శక్తి నష్టానికి కూడా కారణమవుతుంది. అందుకే ఘర్షణను "అవసరమైన చెడు" (Necessary Evil) అని అంటారు. ఒక ఉపరితలంపై యూనిట్ వైశాల్యానికి లంబంగా పనిచేసే బలాన్ని పీడనం(Pressure) అంటారు. ద్రవాలు, వాయువులు అన్ని దిశల్లో పీడనాన్ని కలిగిస్తాయి. లోతు పెరిగే కొద్దీ ద్రవ పీడనం కూడా పెరుగుతుంది. భూమిని చుట్టుముట్టిన వాతావరణం కలిగించే పీడనాన్ని వాతావరణ పీడనం (Atmospheric Pressure) అంటారు. ఈ అధ్యాయం ద్వారా పరీక్ష రాసే అభ్యర్థులు బలాల రకాలు, ఘర్షణ ప్రభావాలు, పీడనం, వాటి అనువర్తనాల గురించి అవగాహన పొందుతారు. "ప్రతి మార్పు వెనుక ఒక బలం ఉంటుంది."ఈ భాగం నుండి బలాల ప్రభావాలు,ఘర్షణ అనువర్తనాలు, పీడన భావనలపై ప్రశ్నలు తరచుగా కనిపిస్తాయి.
4.గురుత్వాకర్షణ(Gravitation): చెట్టుపై నుంచి పండు నేలపై పడటం, వర్షపు చినుకులు భూమివైపు రావడం,గ్రహాలు సూర్యుని చుట్టూ తిరగడం వంటి అనేక సహజ సంఘటనలకు కారణం గురుత్వాకర్షణ (Gravitation). విశ్వంలోని ప్రతి వస్తువు మరో వస్తువును ఆకర్షించే స్వభావాన్ని గురుత్వాకర్షణ అంటారు.భూమి తన గురుత్వాకర్షణ శక్తి వల్ల వస్తువులను తన కేంద్రం వైపు లాగుతుంది. ఈ కారణంగానే వస్తువులు భూమిపై నిలిచి ఉంటాయి మరియు పైకి విసిరిన వస్తువులు తిరిగి క్రిందకు వస్తాయి. ఈ అధ్యాయంలో సార్వత్రిక గురుత్వాకర్షణ నియమం,స్వేచ్ఛా పతనం (Free Fall), గురుత్వ త్వరణం (g), ద్రవ్యరాశి(Mass), బరువు(Weight), తేలడం–మునగడం,ఉత్ప్లవనం(Buoyancy), ఆర్కిమిడీస్ సూత్రం వంటి ముఖ్యమైన భావనలను అధ్యయనం చేస్తాము. భూమిపై నిలబెట్టేది గురుత్వాకర్షణ."ఇందులో గురుత్వాకర్షణ,బరువు–ద్రవ్యరాశి,ఉత్ప్లవనం, ఆర్కిమిడీస్ సూత్రాలపై ప్రశ్నలను తరచుగా అడుగుతారు.
5. పని – శక్తి (Work and Energy): మన దైనందిన జీవితంలో నడవడం,బరువులు ఎత్తడం, సైకిల్ తొక్కడం, మోటార్లు, యంత్రాలు పనిచేయడం వంటి ప్రతి చర్య వెనుక పని(Work) మరియు శక్తి (Energy) అనే భావనలు దాగి ఉంటాయి. ఒక పని జరగడానికి శక్తి అవసరం.ఈ శక్తి వివిధ రూపాల్లో ఉండి,అవసరాన్ని బట్టి ఒక రూపం నుండి మరొక రూపానికి మారుతుంది.విద్యుత్ ఉత్పత్తి, రవాణా,క్రీడలు,గృహోపకరణాల పని తీరు వంటి అనేక రంగాలలో పని–శక్తి సూత్రాలు ఉపయోగపడతాయి.ఈ యూనిట్‌లో పని, శక్తి,గతిశక్తి,స్థితిశక్తి,శక్తి రూపాంతరాలు, శక్తి నిత్యత్వ నియమం మరియు పవర్ వంటి అంశాలను తెలుసుకుంటాం.ఇవి TET, DSC, ఇతర పోటీ పరీక్షల్లో తరచుగా అడిగే ముఖ్యమైన భావనలు. "శక్తి ఎలా పని చేస్తుంది? పని చేయడానికి ఎంత శక్తి అవసరం?శక్తి ఎలా రూపాంతరం చెందుతుంది?"వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ యూనిట్‌లో లభిస్తాయి. శక్తి రూపం మారుతుంది; పరిమాణం కాదు. టెట్ లాంటి పరీక్షలలో పని,శక్తి రూపాంతరాలు, శక్తి నిత్యత్వ నియమం, పవర్‌పై ప్రశ్నలు తరచుగా అడుగుతారు.
6. శబ్దం(Sound): మన దైనందిన జీవితంలో మాట్లాడటం,సంగీతం వినడం, ఫోన్‌లో సంభాషించడం, వాహనాల హారన్‌లు వినిపించడం వంటి అనేక చర్యలు శబ్దంతో ముడిపడి ఉంటాయి. శబ్దం ఒక శక్తి రూపం. ఇది ఒక మాధ్యమం ద్వారా తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది.శబ్ద తరంగాల లక్షణాలు, వాటి వ్యాప్తి మరియు వినికిడి ప్రక్రియలను అర్థం చేసుకోవడం ద్వారా మనం అనేక సహజ, సాంకేతిక అనువర్తనాలను తెలుసుకోవచ్చు. ఈ యూనిట్‌లో శబ్ద ఉత్పత్తి, మానవ చెవి పని తీరు, ప్రతిధ్వని(Echo), అల్ట్రాసౌండ్, శబ్ద కాలుష్యం వంటి అంశాలను అధ్యయనం చేస్తాము. వైద్యరంగంలో స్కానింగ్, సముద్ర లోతుల కొలత, సంగీత పరికరాల నిర్మాణం, ఆడిటోరియంల రూపకల్పన వంటి అనేక రంగాల్లో శబ్ద సూత్రాలు విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. "శబ్దం సంభాషణకు వారధి”. శబ్దం ఎలా ప్రయాణిస్తుంది? ప్రతిధ్వని ఎలా ఏర్పడుతుంది?అల్ట్రాసౌండ్ ఎక్కడ ఉపయోగిస్తారు?"వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ యూనిట్‌లో తెలుసుకోవచ్చు.
7. ఉష్ణం(Heat): మన దైనందిన జీవితంలో వంట చేయడం,నీటిని వేడి చేయడం, బట్టలు ఆరడం, చెమట ఆవిరై శరీరం చల్లబడడం వంటి అనేక ప్రక్రియలు ఉష్ణానికి సంబంధించినవే. ఉష్ణం(Heat), ఉష్ణోగ్రత (Temperature) అనే భావనలు పదార్థాల ప్రవర్తనను అర్థం చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఉష్ణం ప్రసరణ వాహకత్వం (Conduction), సంవహనం(Convection), వికిరణం (Radiation) ద్వారా జరుగుతుంది. ఈ యూనిట్‌లో ఉష్ణోగ్రత కొలత, థర్మామీటర్ల పని విధానం, బాష్పీభవనం, ఘనీభవనం, ద్రవీభవనం, గడ్డకట్టడం వంటి దశ మార్పులు, వాటి అనువర్తనాలను అధ్యయనం చేస్తాము. శీతలీకరణ పరికరాలు, వాతావరణ మార్పులు, వస్త్రాల ఎంపిక, పరిశ్రమలు, గృహ అవసరాలలో ఉష్ణ సూత్రాలు విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. ”ఉష్ణం పదార్థాల స్వభావాన్ని మార్చగలదు.” వేసవిలో లేత రంగు దుస్తులు ఎందుకు ధరిస్తాం? చెమట వల్ల శరీరం ఎందుకు చల్లబడుతుంది?మంచు కరిగేటప్పుడు ఏమి జరుగుతుంది?"వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ యూనిట్‌లో తెలుసుకోవచ్చు.
8. కాంతి(Light): కాంతి మనకు పరిసర ప్రపంచాన్ని చూడగలిగే సామర్థ్యాన్ని కల్పించే ఒక ముఖ్యమైన శక్తి రూపం. అద్దంలో ప్రతిబింబం కనిపించడం, నీటిలో వస్తువులు వంగినట్లు కనిపించడం, ఇంద్రధనుస్సు ఏర్పడడం, కళ్లద్దాల ద్వారా స్పష్టంగా చూడగలగడం వంటి అనేక సహజ, దైనందిన సంఘటనలు కాంతి లక్షణాల వల్లే జరుగుతాయి. ఈ యూనిట్‌లో కాంతి సరళరేఖా ప్రసారం, పరావర్తనం(Reflection), వక్రీభవనం(Refraction), అద్దాలు, లెన్సులు, మానవ కన్ను, దృష్టి లోపాలు, పట్టకం ద్వారా కాంతి విక్షేపణ (Dispersion), సంపూర్ణాoతర పరావర్తనం (Total Internal Reflection) వంటి ముఖ్యమైన భావనలను అధ్యయనం చేస్తాము. కెమెరాలు, పెరిస్కోప్‌లు, సూక్ష్మదర్శినులు, దూరదర్శినులు, ఆప్టికల్ ఫైబర్లు, కళ్లద్దాలు వంటి అనేక పరికరాల పనితీరు ఈ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. కాంతి విజ్ఞానానికి మార్గదర్శి."అద్దంలో ప్రతిబింబం ఎలా ఏర్పడుతుంది?కళ్లద్దాలు దృష్టి లోపాలను ఎలా సరిచేస్తాయి? ఇంద్రధనుస్సు ఎందుకు ఏర్పడుతుంది?"వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ యూనిట్‌లో తెలుసుకోవచ్చు.
9. విద్యుత్(Electricity): విద్యుత్ ఆధునిక జీవితానికి మూలాధారం. ఇళ్లలో వెలుగులు, ఫ్యాన్లు, టీవీలు, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, అనేక విద్యుత్ పరికరాల పనితీరు విద్యుత్‌పై ఆధారపడి ఉంటుంది. విద్యుత్ ప్రవాహం, విద్యుత్ వలయాలు, నిరోధం, శక్తి వినియోగం వంటి భావనలు మన దైనందిన జీవితంలో ప్రత్యక్షంగా కనిపిస్తాయి. ఈ విభాగంలో విద్యుత్ వలయాల నిర్మాణం, వాహకాలు, అవాహకాలు, మొబైల్ ల పని విధానం, శ్రేణి, సమాంతర సంధానాలు, విద్యుత్ ఉష్ణ, రసాయన, అయస్కాంత ప్రభావాలు, ఓమ్ నియమం, నిరోధం,విద్యుత్ శక్తి, విద్యుత్ వినియోగం వంటి అంశాలను అధ్యయనం చేస్తాము. ఎలక్ట్రోప్లేటింగ్, విద్యుత్ గంట (Electric Bell), ఎలక్ట్రోమాగ్నెట్, ఫ్యూజ్, MCB వంటి పరికరాల పనితీరు కూడా ఈ సూత్రాలపైనే ఆధారపడి ఉంటుంది. విద్యుత్ ఆధునిక నాగరికతకు ప్రాణశక్తి. "ఫ్యూజ్ ఎందుకు కరుగుతుంది? MCB ఎలా రక్షిస్తుంది? ఎలక్ట్రిక్ బెల్ ఎలా పనిచేస్తుంది? విద్యుత్ బిల్లు ఎలా లెక్కిస్తారు? "వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ యూనిట్‌లో తెలుసుకోవచ్చు.
10. అయస్కాంతత్వం, విద్యుదయస్కాం తత్వం(Magnetism and Electromagnetism): అయస్కాంతత్వం ప్రకృతిలో కనిపించే ఒక ఆసక్తికరమైన భౌతిక దృగ్విషయం.దిక్సూచి(Compass) ఉత్తర దిశను చూపడం, ఫ్రిజ్ తలుపుకు అయస్కాంతం అతుక్కోవడం, విద్యుత్ గంటలు, మోటార్లు పనిచేయడం వంటి అనేక సంఘటనలు అయస్కాంతత్వం, విద్యుదయస్కాంతత్వానికి సంబంధించినవే. కొన్ని పదార్థాలు అయస్కాంతాలకు ఆకర్షితమవుతాయి, మరికొన్ని కావు. ఈ లక్షణాల ఆధారంగా అనేక పరికరాలు రూపొందించబడ్డాయి. ఈ భాగంలో అయస్కాంతాల లక్షణాలు, అయస్కాంత క్షేత్రం, భూమి ఒక పెద్ద అయస్కాంతంగా పనిచేయడం, విద్యుత్ ప్రవాహం వల్ల ఏర్పడే అయస్కాంత ప్రభావం, అయర్ స్టడ్ ప్రయోగం, సోలెనాయిడ్, విద్యుదయస్కాంతం వంటి అంశాలను అధ్యయనం చేస్తాము. మోటార్లు, జనరేటర్లు, స్పీకర్లు, విద్యుత్ గంటలు, దిక్సూచిల పనితీరు ఈ సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. అయస్కాంతం కనిపించని బలానికి ప్రతీక. "దిక్సూచి ఎందుకు ఉత్తర దిశను చూపుతుంది? విద్యుత్ ప్రవాహం వల్ల అయస్కాంత క్షేత్రం ఎలా ఏర్పడుతుంది?విద్యుదయస్కాంతాలు ఎక్కడ ఉపయోగిస్తారు? "వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ యూనిట్‌లో తెలుసుకోవచ్చు. "TET, DSC, ఇతర పోటీ పరీక్షల్లో ఈ యూనిట్ నుండి భావనాత్మక, అనువర్తన ఆధారిత, సమస్యాపూరణ ప్రశ్నలు తరచుగా అడుగుతారు. ముఖ్య భావనలు, సూత్రాలు, దైనందిన జీవిత అనువర్తనాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

డాక్టర్. పల్లె.సూర్యనాగి రెడ్డి
భౌతికశాస్త్ర అధ్యాపకులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల- కల్యాణదుర్గo
అనంతపురం(జిల్లా)
మొబైల్ నo: 9491155894 మెయిల్:suryassbn19@gmail.com







కామెంట్‌లు (0)