‘హీరో అంటే తెరపై కనిపించాలి. తన పాత్రతో ప్రేక్షకులను నవ్వించాలి. ఏడిపించాలి. పోరాటాలతో ఉర్రూతలూగించాలి’ అన్న ధోరణి ప్రస్తుత సినిమా రంగంలో క్రమంగా మారుతుంది. ఇప్పుడు హీరోలే కథలు రాస్తున్నారు. మెగాఫోన్ పట్టుకుంటున్నారు. తెలుగు సినిమా రంగంలో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ మార్పు ఆసక్తికరమైన చర్చకు తెరతీస్తోంది.
తెలుగు సినిమాకు ఈ ప్రయోగాలు ఇప్పుడే మొదటిసారి పరిచయం కావడం లేదు. ఎన్టీ రామారావు, కృష్ణ వంటి అగ్రనటులు చాలా ఏళ్ల క్రితమే దర్శకత్వ బాధ్యతలు చేపట్టి తమ అభిరుచికి అనుగుణంగా సినిమాలు రూపొందించారు. ఈ దారిలో ఒకప్పుడు పవన్ కల్యాణ్ ‘జానీ’ (2003)తో దర్శకుడిగా తన ఆలోచనలను తెరపై ఆవిష్కరించారు. ఇప్పుడు ఈ మార్గంలో కొత్త తరం హీరోలు కూడా వస్తున్నారు. నటనతోపాటు కథా రచన, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో ముందుకు వెళుతున్నారు. అయితే గతంలో మాదిరి ఈ మార్పు కేవలం ఒకరిద్దరు హీరోలకు పరిమితం కాకపోవడమే ప్రస్తుతం కనిపిస్తోంది.

హీరోగా ఒక కథను ఎంచుకోవడం వేరు. ఆ కథను తెరపైకి తీసుకొచ్చే బాధ్యతను స్వీకరించడం వేరు. నటుడిగా తన పాత్ర పరిధిలో నటనను ప్రదర్శిస్తే సరిపోతుంది. కానీ దర్శకుడిగా మారితే కథలోని ప్రతి పాత్ర, సన్నివేశాల కూర్పు, నటీనటుల నుంచి రాబట్టాల్సిన అభినయం, సాంకేతిక విభాగాల సమన్వయం.. ఇలా ఎన్నో అంశాలపై దృష్టి పెట్టాలి. ఈ సమయంలో సృజనాత్మక స్వేచ్ఛతోపాటు బాధ్యత, ఒత్తిడి కూడా పెరుగుతాయి. తెరపై హీరోగా కనిపిస్తూనే తెరవెనుక దర్శకుడిగా మొత్తం బృందాన్ని నడిపించడం అంత సులభమైన పని కాదు.
విశ్వక్ సేన్.. రెండు బాధ్యతలు!
నటుడిగా వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటున్న విశ్వక్ సేన్ దర్శకత్వంలో ‘ఫలక్‌నుమా దాస్’ (2019), ‘దాస్ కా ధమ్కీ’ (2023) చిత్రాలను తెరకెక్కించారు. ‘ఫలక్‌నుమా దాస్’లో హైదరాబాద్ పాతబస్తీ వాతావరణం, అక్కడి యువత జీవనశైలి, స్థానిక భాషను విశ్వక్ తన కథనంలో భాగం చేశారు.
అడివి శేష్.. కథే బలం!
అడివి శేష్ ‘కర్మ’ (2010), ‘కిస్’ (2013) చిత్రాలతో నటుడిగా, దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నటనతోపాటు కథా రచనపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దర్శకుడిగా కొనసాగడమే కాకుండా కథను నిర్మించే బాధ్యతను కూడా స్వీకరించడం ద్వారా ఒక నటుడు సినిమా రూపకల్పనలో ఎన్ని విభాగాలతో మమేకం కావచ్చో ఆయన ప్రయాణం సూచిస్తుంది. ‘దర్శకుడిగా తీసిన తొలి సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, ఆ అనుభవాలు తనకు సినిమా పాఠశాలలా ఉపయోగపడ్డాయ’ని శేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
కొత్త అడుగులు..
తాజాగా ఈ జాబితాలోకి రామ్ పోతినేని, కిరణ్ అబ్బవరం వంటి యువ హీరోలు కూడా వచ్చారు. రామ్ తన 23వ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానుండగా, కిరణ్ అబ్బవరం తొలి దర్శకత్వ ప్రాజెక్టును ప్రారంభించినట్లు ప్రకటించారు. రామ్ ప్రాజెక్టును సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రచారం చేస్తుండగా, కిరణ్ తన కథను తానే తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో హీరోగా నటించడంతోపాటు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా కిరణ్ తీసుకుంటున్నారు. ‘ఆర్‌ఎక్స్ 100’తో గుర్తింపు తెచ్చుకున్న కార్తికేయ 2026 సెప్టెంబర్ 21న తన కొత్త సినిమాను ప్రకటించారు. ‘కమ్‌బ్యాక్’ పేరుతో రూపొందనున్న ఈ చిత్రంలో ఆయనే హీరో, దర్శకుడు. బాక్సింగ్ నేపథ్యంలో కథ సాగనున్నట్లు సినిమా నుంచి విడుదల చేసిన గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది.

నటనకు మించి కథ చెప్పాలనే తపన
విభిన్న పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ప్రకాష్ రాజ్ దర్శకుడిగానూ పలు చిత్రాలు రూపొందించారు. 2010లో కన్నడ చిత్రం ‘నాను నన్న కనసు’తో దర్శకత్వం ప్రారంభించి, ‘ధోని’ (2012), ‘ఉలవచారు బిర్యానీ’ (2014), ‘మన ఊరి రామాయణం’ (2016) వంటి చిత్రాలను తెరకెక్కించారు. ‘ఉలవచారు బిర్యానీ’ని తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో రూపొందించడం ప్రకాష్ రాజ్ దర్శకత్వ ప్రయాణంలో ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రేమ, కుటుంబ సంబంధాలు, మానవ భావోద్వేగాల చుట్టూ కథలను నడిపించడంలో ప్రేక్షకులను ఆయన మెప్పించారు. నటుడిగా, రచయితగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ అవసరాల ‘ఊహలు గుసగుసలాడే’ (2014), ‘జ్యో అచ్యుతానంద’ (2016) చిత్రాలకు దర్శకత్వం వహించారు.
నటుడి ఇమేజ్ సినిమాకు ప్రేక్షకులను తీసుకురావచ్చు. కానీ కథలో కొత్తదనం, పాత్రల సహజత్వం, సన్నివేశాల బలం, కథనం ప్రేక్షకుడిని సినిమా చివరి వరకు కూర్చోబెట్టడమే సినిమాకు అసలైన విజయం. నటులే దర్శకులవుతున్న ప్రస్తుత పరిణామం తెలుగు సినిమాకు కొత్త అవకాశాలను తెరుస్తోంది. ఒకే వ్యక్తి నటన, రచన, దర్శకత్వం వంటి విభాగాల్లో పనిచేయడం వల్ల కొన్ని కథలు మరింత వ్యక్తిగతమైన దృక్పథంతో తెరపైకి రావాలని ఆశిద్దాం.







కామెంట్‌లు (0)