నితేశ్ తివారీ దర్శకత్వంలో రూపొందిన ‘రామాయణం’ సినిమా మరోసారి రామాయణ కథనాలపై చర్చకు తెరలేపింది. రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందింది. మొదటి భాగం 2026 నవంబరు 5న హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైంది. సుమారు రూ.4,000 కోట్ల వ్యయంతో రెండు భాగాలుగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్, హాలీవుడ్ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ సంగీతం అందించారు. నటీనటుల ఎంపిక నుంచి పాత్రల స్వభావం, దుస్తులు, సంగీతం వరకు అనేక అంశాలపై కొందరు మొదటి నుంచీ వివాదాలు సృష్టించడం మొదలుపెట్టారు.
శ్రీ రామ్లీలా మహాసంఘ్ అధ్యక్షుడు అర్జున్ కుమార్ సింగ్ దర్శకుడు నితేశ్ తివారీకి, నిర్మాతలకు లేఖ రాస్తూ సినిమా విడుదలకు ముందే తమ ప్రతినిధులకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని కోరారు. తమకు అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉంటే సరిదిద్దాలని, లేకపోతే థియేటర్ల వద్ద నిరసనలు చేపడతామని హెచ్చరించారు. రణబీర్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు మటన్, బీఫ్ ఇష్టమని చెప్పిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, రాముడి పాత్రకు అతడు తగడని అభ్యంతరం తెలిపారు. సాయిపల్లవి సీతగా ఎంపిక కావడంపైనా ఉత్తరాది, దక్షిణాది భేదాలను ముందుకు తెచ్చారు. ఆమె రూపం, ముఖంపై మచ్చలు, జుట్టు, మేకప్, హిందీ ఉచ్చారణను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేశారు. కైకేయిగా నటించిన లారా దత్తా దుస్తులు, జుట్టు అలంకరణ త్రేతాయుగానికి తగినట్లుగా లేవని విమర్శించారు. సినిమా పాటలు విడుదలైన తర్వాత సంగీతంపైనా వివాదం మొదలైంది. ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ రూపొందించిన ‘మంగళ్ రంగ్’ పాటలో సూఫీ సంగీత ఛాయలు, ఖవ్వాలీ తరహా స్వరాలు ఉన్నాయని కొందరు విమర్శించారు. సీతను యోధురాలిగా చూపించడంపైనా కొందరు సనాతనవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సినిమాలో సీత రాక్షసులతో పోరాడే సన్నివేశాలున్నాయని ట్రైలర్, సమీక్షల ద్వారా తెలుసుకున్న నటుడు ముఖేష్ ఖన్నా తీవ్రంగా స్పందించారు. వాల్మీకి రామాయణంలో సీత ఎక్కడా యుద్ధం చేయలేదని, ఆమెను ఝాన్సీ లక్ష్మీబాయిలా కత్తి పట్టి పోరాడే వ్యక్తిగా చూపించడం సరికాదని అన్నారు. ఇలా చాలామంది సినిమాను ఒక సృజనాత్మక ప్రక్రియగా చూడకుండా తమ తమ నమ్మకాలు, అభిప్రాయాల గీటురాళ్లపై నిలబెట్టి విమర్శలు చేస్తున్నారు.
రామాయణంలో భిన్న కథనాలు
దేశంలో 300కు పైగా రామాయణ కథనాలు ఉన్నాయి. జానపద కథల్లో ఆయా ప్రాంతాల ప్రజలు తమ దైనందిన జీవితాలకు అన్వయించుకుంటూ రామాయణ కథలను తమదైన రీతిలో ప్రచారం చేసుకున్నారు. అలా వైవిధ్యభరితంగా మారుతూ వెళ్లడం వల్లే పాత్రలు సజీవంగా నిలిచాయి. అద్భుత రామాయణంలో వెయ్యి తలల రావణుడిని సంహరించడానికి సీత మహాకాళి రూపం ధరించినట్లు కథనం ఉంది. శాక్త సంప్రదాయంలో ఆమె ఆదిపరాశక్తి స్వరూపిణిగా కనిపిస్తుంది. సీత బాల్యంలో బంతాట ఆడుకుంటూ అవలీలగా శివధనుస్సు దాచిన పెట్టెను ఎత్తిందని, అది చూసి ఆమె ఎంత బలశాలో జనకుడు గ్రహించాడనే జానపద కథనాలు కూడా విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఇలాంటి నేపథ్యాల నుంచి కథను ఎలా చెప్పాలన్న స్వేచ్ఛ దర్శకుడికి ఉండాలి. తాము చెప్పినట్టే కథ తీయాలని, లేకపోతే దాడులు చేస్తామని హెచ్చరిస్తే పురాణ కథలు తెరపైకి రావడమే కష్టమవుతుంది.
వాల్మీకి రామాయణం ప్రాచీనమైన, అత్యంత ప్రభావశీలమైన రూపం అయినప్పటికీ, దాని ఆధారంగా వందలాది భాషల్లో, ప్రాంతాల్లో కొత్త కథనాలు వెలిశాయి. తమిళంలో కంబ రామాయణం, అవధీలో తులసీదాస్ రామచరితమానస్, బెంగాలీలో కృత్తివాస రామాయణం, ఒడియాలో దండి రామాయణం, అస్సామీలో మాధవ కందలి రామాయణం, జైన సంప్రదాయంలోని రామాయణాలు తమదైన కథనాలతో ప్రసిద్ధి చెందాయి. బౌద్ధ రామాయణ సంప్రదాయాలు కూడా ఉన్నాయి. కొన్ని రచనల్లో రాముడు విష్ణువు అవతారంగా కనిపిస్తే, వాల్మీకి రామాయణంలోని తొలి కథనంలో మానవుడిగా ఆయన వ్యక్తిత్వానికి ప్రాధాన్యం ఉంటుంది. కొన్ని రూపాల్లో రావణుడి పాత్రకు భిన్నమైన నేపథ్యం, ప్రాధాన్యం కనిపిస్తాయి. సీత పాత్ర ఒక కథనంలో సహనశీలి, పతివ్రతగా ప్రధానంగా చిత్రితమైతే, మరికొన్ని సంప్రదాయాల్లో శక్తి స్వరూపిణిగా, స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే వ్యక్తిగా కనిపిస్తుంది. ప్రముఖ పరిశోధకురాలు మాండక్రాంత బోస్ సంపాదకత్వంలో వెలువడిన ‘ది రామాయణ రివిజిటెడ్’, పౌలా రిచ్మన్ సంపాదకత్వంలోని ‘మ్యానీ రామాయణాస్’ వంటి అధ్యయనాలు ఈ బహుళత్వాన్ని వివరించాయి. రామాయణం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించిన ప్రతిసారీ అక్కడి భాష, సంస్కృతి, సామాజిక ఆలోచనలు దానిలో కలిశాయి. ఈ పరిణామమే రామాయణాన్ని శతాబ్దాలుగా సజీవంగా ఉంచింది.
ఎన్టీ రామారావు పోషించిన రాముడు, కృష్ణుడు పాత్రలు తెలుగు ప్రజల ఊహల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. ‘మాయాబజార్’లో కృష్ణుడిగా, ‘లవకుశ’లో రాముడిగా ఎన్టీఆర్ నటన చిరస్మరణీయంగా నిలిచింది. 1963లో విడుదలైన ‘లవకుశ’లో అంజలీదేవి సీతగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఆ తర్వాత బాపు దర్శకత్వంలోని ‘సీతాకల్యాణం’లో జయప్రద, ‘శ్రీరామరాజ్యం’లో నయనతార సీత పాత్రలు పోషించారు. హిందీ ప్రేక్షకులకు రామానంద్ సాగర్ టెలివిజన్ రామాయణంలోని అరుణ్ గోవిల్ రాముడిగా, దీపికా చిఖలియా సీతగా గుర్తింపు పొందారు. ఇలా ప్రతి భాషా సమాజం తమకు పరిచయమైన నటీనటుల రూపాల్లో రామాయణ పాత్రలను ఆరాధించింది. ఒక తెలుగు ప్రేక్షకుడికి ఎన్టీఆర్ రాముడే అసలైన రాముడిగా అనిపించవచ్చు. అంజలీదేవి సీతను మించిన రూపం లేదని భావించవచ్చు. హిందీ ప్రేక్షకుడికి అరుణ్ గోవిల్, దీపికా చిఖలియా రూపాలే ఆత్మీయంగా ఉండవచ్చు. అంతమాత్రాన ఇతర భాషల్లోని నటులు పోషించిన సీతారాములను తిరస్కరించాలా? మనకు అలవాటైన రూపమే శాశ్వతం, మిగతావన్నీ తప్పు అనే భావనకు అర్థం లేదు.
భక్తి, విశ్వాసం పేరుతో ఒక నిర్దిష్టమైన రూపాన్ని మాత్రమే అంగీకరించాలని పట్టుబట్టడం వల్ల భారతీయ సాహిత్యంలోని వైవిధ్యం కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. సినిమా రూపకర్తలు కూడా ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని ఎలాంటి మార్పులు చేసినా వాటికి తగిన సాహిత్య, కళాత్మక సమర్థన ఇవ్వాల్సిందే. విమర్శించే హక్కు ప్రేక్షకులకు ఉంది. కానీ ఒక సంస్థకు నచ్చలేదని సినిమా ముందుగానే చూపించాలని, తమ అభ్యంతరాలకు అనుగుణంగా సన్నివేశాలు మార్చాలని డిమాండ్ చేయడం సృజనాత్మక స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు వంటిది. రామాయణం తరతరాలుగా విస్తరించడానికి కారణం భిన్నమైన కథనాలను తనలో ఇముడ్చుకోవడమే. ఆ బహుళత్వాన్ని నిరాకరిస్తూ ఒకే రూపాన్ని శాశ్వతంగా నిర్దేశించాలనుకోవడం రామాయణ సంప్రదాయాన్ని సంకుచితం చేయడమే అవుతుంది.
- ప్రజాశక్తి సినిమా డెస్క్








కామెంట్లు (0)