మలయాళ సినిమా నేడు అనేక ప్రయోగాలకు వేదికగా నిలుస్తోంది. జీవితాన్ని, జీవితంలోని వైరుధ్యాలను, వైవిధ్యాన్ని సహజంగా, నిజాయితీగా తెరపై ఆవిష్కరిస్తూ ప్రేక్షకుల ఆదరణను చూరగొంటోంది. అందుకే నేడు సినీ విమర్శకులు, ప్రేక్షకులు, ఓటీటీ వేదికలు ఎక్కువగా చర్చిస్తున్న చిత్రసీమగా మలయాళ సినిమా మారింది. ఈ విజయానికి కారణం వందల కోట్ల బడ్జెట్‌లు కాదు; కోట్ల రూపాయల ప్రచారం కాదు; పాన్ ఇండియా హడావుడి అంతకన్నా కాదు. ఒక బలమైన కథ, సహజమైన పాత్రలు, జీవితానికి దగ్గరైన సంఘటనలే ఆ చిత్రాల విజయ రహస్యం.
మలయాళ చిత్రసీమలో సినిమా నిర్మాణం రచయితతో ప్రారంభమవుతుంది. ముందుగా కథ సిద్ధమవుతుంది. తరువాత దానికి సరిపోయే నటీనటులను ఎంపిక చేస్తారు. పాత్రకు ఎవరు సరిపోతారో వారినే ఎంచుకుంటారు. అందుకే అక్కడ ఒక పోలీసు నిజమైన పోలీసులా, ఉపాధ్యాయుడు నిజమైన ఉపాధ్యాయుడిలా, రైతు నిజమైన రైతులా కనిపిస్తారు. ప్రేక్షకులు తెరపై ఒక కల్పిత ప్రపంచాన్ని కాదు, తమ చుట్టూ ఉన్న జీవితాన్నే చూస్తారు. 2024లో విడుదలైన 'ఆట్టం' దీనికి గొప్ప ఉదాహరణ. ఒక నాటక బృందంలో జరిగిన లైంగిక వేధింపుల ఆరోపణ చుట్టూ తిరిగే ఈ చిత్రంలో పెద్ద స్టార్ లేడు. భారీ యాక్షన్ లేదు. అయినప్పటికీ ప్రజాస్వామ్యం, నైతికత, అధికార సంబంధాలపై తీవ్రమైన చర్చకు దారితీసింది. జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ చిత్రంగా నిలిచి, మంచి సినిమా విలువను చాటిచెప్పింది. అదే ఏడాది వచ్చిన 'కిష్కింధా కాండం' దాదాపు ₹7 కోట్ల బడ్జెట్‌తో రూపొంది ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹75 కోట్లకు పైగా వసూలు చేసింది. జ్ఞాపకశక్తి కోల్పోయిన ఒక వృద్ధుడు, అదృశ్యమైన బాలుడు, ఒక కుటుంబం చుట్టూ అల్లుకున్న ఈ కథ ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠలో ఉంచింది. 'ప్రేమలు' హైదరాబాద్ నేపథ్యంగా యువత జీవితం, ఉద్యోగాల ఒత్తిడి, ప్రేమ, స్నేహాన్ని సహజంగా ఆవిష్కరించి దాదాపు ₹9 కోట్ల వ్యయంతో నిర్మితమై ₹130 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 'మంజుమ్మెల్ బాయ్స్' సుమారు ₹20 కోట్ల వ్యయంతో రూపొంది ₹240 కోట్లకు పైగా వసూలు చేసి మలయాళ సినిమా చరిత్రలోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా నిలిచింది.
చిన్న బడ్జెట్... పెద్ద ఆలోచన
మలయాళ చిత్రసీమలో నిర్మాతలు స్టార్ ఇమేజ్ కంటే కథపై పెట్టుబడి పెడతారు. ప్రేక్షకులూ హీరోకంటే కథనే ఎంచుకుంటున్నారు. అందుకే చిన్న బడ్జెట్‌తో వచ్చిన సినిమాలే భారీ విజయాలు సాధిస్తున్నాయి. ఓటీటీ వేదికలు ఈ మార్పును మరింత వేగవంతం చేశాయి. కేరళలో విడుదలైన సినిమా కొద్ది వారాల్లోనే తెలుగు ప్రేక్షకుల మొబైల్‌లోకి చేరుతోంది. భాష తెలియకపోయినా సబ్‌టైటిల్స్‌తో చూస్తున్నారు. ఫలితంగా ప్రతి చిత్రసీమ మరొక చిత్రసీమతో నేరుగా పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం సృజనాత్మక విజయమే కాదు; ఆర్థికంగా కూడా ఆలోచించాల్సిన నమూనా. నేడు తెలుగు చిత్రసీమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో నిర్మాణ వ్యయం పెరగడం ఒకటి. కొద్ది మంది స్టార్‌ల పారితోషికాలకే బడ్జెట్‌లో పెద్ద భాగం వెచ్చించాల్సి వస్తోంది. దాంతో సినిమా విజయవంతం కాకపోతే నిర్మాతలు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో చిన్న బడ్జెట్‌తో, బలమైన కథలతో సినిమాలు నిర్మించడం పరిశ్రమకు ఒక స్థిరమైన ప్రత్యామ్నాయంగా మారవచ్చు. అలాంటి చిత్రాల్లో పెట్టుబడి తక్కువగా ఉంటుంది; ప్రమాదం తక్కువగా ఉంటుంది; విజయం సాధిస్తే లాభాలు మాత్రం గణనీయంగా ఉంటాయి. అందువల్ల చిన్న సినిమా కేవలం ఒక కళాత్మక ప్రయోగం మాత్రమే కాదు; నేడు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభానికి ఒక ఆచరణాత్మక పరిష్కారంగా కూడా కనిపిస్తోంది.
తమిళ సినిమాల్లో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. వెట్రిమారన్, మారి సెల్వరాజ్, పా. రంజిత్ వంటి దర్శకులు వినోదంతో పాటు సమాజంలోని అసమానతలు, కుల సంబంధాలు, అధికార దుర్వినియోగం వంటి అంశాలను కథల్లో భాగం చేస్తున్నారు. 'విడుదలై' సిరీస్‌లో ఆదివాసీల జీవితం, రాష్ట్ర హింసను ప్రశ్నిస్తే, 'కొట్టుక్కాళి' మహిళా స్వేచ్ఛ, కుటుంబ నియంత్రణలపై గంభీరమైన వ్యాఖ్య చేసింది. 'లబ్బర్ పందు' గ్రామీణ క్రికెట్ నేపథ్యాన్ని తీసుకున్నప్పటికీ, అంతర్లీనంగా సామాజిక గౌరవం, తరాల మధ్య విభేదాల గురించే మాట్లాడింది. ఈ చిత్రాలు విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వేదికల్లోనూ గుర్తింపు పొందాయి. ఈ విజయాల వెనుక మరో ముఖ్యమైన కారణం రచయితలకు ఇచ్చే గౌరవం. కథను మార్చమని, ఫైట్‌లు పెంచమని, పాటలు జోడించమని ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అందుకే పాత్రలు నిజమైన మనుషుల్లా కనిపిస్తాయి. వారు తప్పులు చేస్తారు, ఓడిపోతారు, మళ్లీ లేస్తారు. ప్రేక్షకులు ఆ పాత్రల్లో తమను తాము చూసుకుంటారు. అదే సినిమాను చిరస్థాయిగా నిలబెడుతుంది.
తెలుగు సినిమా నేర్వాల్సిన పాఠం
తెలుగు సినిమాకు ప్రతిభ, సృజనాత్మకత కొరవడలేదు. కానీ కథలకు, కొత్త రచయితలకు, కొత్త దర్శకులకు మరింత విస్తృతమైన అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది. మన సమాజం, మన గ్రామాలు, రైతులు, కార్మికులు, ఉపాధ్యాయులు, మధ్యతరగతి కుటుంబాల జీవితం, యువత ఎదుర్కొంటున్న సమస్యలు, మారుతున్న సామాజిక సంబంధాలు వంటి ఎన్నో కథలు ఇంకా తెరపైకి రావాల్సి ఉంది. అలాంటి ప్రయత్నాలు తెలుగు చిత్రసీమలో లేవని కాదు. 'సి/ఓ కంచరపాలెం' కొత్త నటులతోనే జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. 'మల్లేశం' ఒక చేనేత కార్మికుడి ఆవిష్కరణను హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించింది. 'బలగం' తెలంగాణ గ్రామీణ జీవితాన్ని అంత నిజాయితీగా చూపించింది కాబట్టి, అనేక గ్రామాల్లో ప్రజలే ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించారు. '35 – చిన్న కథ కాదు' విద్యా వ్యవస్థలోని ఒత్తిళ్లను సున్నితంగా విశ్లేషించింది. ఈ చిత్రాలన్నీ ప్రేక్షకుల ఆదరణను పొందాయి.
నేడు ప్రేక్షకులు ప్రపంచ సినిమాను చూస్తున్నారు. కొరియన్ సినిమాలు, స్పానిష్ వెబ్ సిరీస్‌లు, మలయాళ చిత్రాలు ఆసక్తిగా వీక్షిస్తున్నారు. భాష కాదు, మంచి కథే వారిని థియేటర్‌కైనా, ఓటీటీకైనా తీసుకెళ్తోంది. అందుకే తెలుగు చిత్రసీమ కూడా కథలకే కేంద్రస్థానం కల్పించాలి. చిన్న బడ్జెట్‌లో గొప్ప కథలు చెప్పే దర్శకులకు, కొత్త రచయితలకు, కొత్త నటులకు మరింత ప్రోత్సాహం అవసరం. మంచి సినిమా అంటే భారీ ఖర్చు కాదు; జీవితాన్ని నిజాయితీగా చెప్పే కథ.
- ప్రజాశక్తి సినిమా విభాగం








కామెంట్‌లు (0)