శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పస్తులతో గడిపిన రోజులు : ఇళయరాజా

2 గంటల క్రితం

Days Spent in Hunger: Ilaiyaraaja
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 01:27 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

హైదరాబాద్ : సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ఇళయరాజా .. నేడు కోట్లాదిమంది సంగీతాభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన జీవితంలో ఎన్నో విజయాలు, ఘనతలు ఉన్నాయి. అయితే, ఈ సంగీత దిగ్గజం ప్రస్థానం వెనుక పేదరికంతో కూడిన పోరాటం ఉందనే విషయం చాలామందికి తెలియదు. ముఖ్యంగా నేటి జెన్‌ జీ తరానికి ఆయన ఎదుర్కొన్న కష్టాలు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు.


ఒకప్పుడు హార్మోనియం పెట్టెను భుజాన వేసుకుని గ్రామాల్లో పాటలు పాడుతూ జీవనం సాగించిన ఇళయరాజా.. చెన్నైకి చేరుకున్న తర్వాత కూడా కనీసం కడుపు నింపుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన జీవితంలోని అలాంటి చేదు అనుభవాలను ఆయనే స్వయంగా వెల్లడించారు. శుక్రవారం మీడియాకు విడుదల చేసిన వీడియోలో తన గతాన్ని గుర్తుచేసుకున్నారు.


‘‘1958 ప్రాంతంలో నేను చెన్నైకి వచ్చినప్పుడు నవరాత్రి ఉత్సవాల సమయంలో తినడానికి కూడా ఎంతో ఇబ్బంది పడేవాళ్లం. నేను, నా సోదరుడు భాస్కర్‌, దర్శకుడు భారతీరాజా కలిసి మూడు రాత్రులు పస్తులున్నాం. ఆ సమయంలో వడపళనిలోని ఆలయం ఎదురుగా ఉన్న దుకాణాల వద్ద పూజల అనంతరం అటుకులు, మరమరాలు, పప్పు బెల్లాలు పంచేవారు. మేము ముగ్గురం ఒక్కో దుకాణం ముందు వరుసలో నిలబడి వాటిని తీసుకునేవాళ్లం. అలా సేకరించినవన్నీ మా గదికి తీసుకెళ్లి, ఒక కాగితంపై పోసుకుని తింటూ రోజులు గడిపాం’’ అని ఆనాటి పరిస్థితులను ఇళయరాజా వివరించారు.


తాను ఎదుర్కొన్న ఆకలి బాధలను ఆ తర్వాత భార్యతో పంచుకున్నానని ఆయన తెలిపారు. అప్పటి నుంచి నవరాత్రుల సమయంలో ఆమె పలువురిని ఇంటికి పిలిచి పులిహోర, పెరుగు అన్నం పొట్లాలను పంపిణీ చేసేవారని చెప్పారు. అనంతరం సంగీత కచేరీలు నిర్వహించే సందర్భాల్లో కళాకారులకు భోజనాలు అందించడం కూడా ఒక ఆనవాయితీగా మారిందని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమాల వెనుక ప్రచారం పొందాలనే ఉద్దేశం లేదని, తాము ఎదుర్కొన్న ఆకలి బాధలను మరెవరూ అనుభవించకూడదనే ఆలోచనే ప్రధాన కారణమని ఇళయరాజా స్పష్టం చేశారు. నవరాత్రి ఉత్సవాల వేళ ఎవరూ ఆకలితో పస్తులుండకూడదనే మానవీయ ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు చేపట్టామని ఆయన వెల్లడించారు. ఒకప్పుడు ఆకలితో అలమటించిన అనుభవాలే.. నేడు ఇతరుల ఆకలిని తీర్చాలనే సంకల్పానికి కారణమయ్యాయి. ఇళయరాజా జీవితంలోని ఈ అనుభవం ఆయన సంగీత ప్రతిభతో పాటు మానవీయ కోణాన్ని కూడా ఆవిష్కరిస్తోంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్