శనివారం, 17 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సీఆర్పీఎఫ్‌ లో పాత హోదాల పునరుద్ధరణకు ప్రతిపాదన

1 గంట క్రితం

Proposal to restore old designations in the CRPF
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 17, 2026, 03:34 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : సీఆర్పీఎఫ్‌ సిబ్బందికి పదోన్నతుల్లో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించేందుకు ఉన్నతాధికారులు కొత్త ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. గతంలో రద్దు చేసిన లాన్స్‌ నాయక్‌, నాయక్‌ హోదాలను తిరిగి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. ఈ అంశంపై సిబ్బంది అభిప్రాయాలను సేకరించాలని సీఆర్పీఎఫ్‌ ప్రధాన కార్యాలయం దేశవ్యాప్తంగా ఉన్న విభాగాలను ఆదేశించింది. రెండు రోజుల్లో సైనిక్‌ సమ్మేళనాలు నిర్వహించి అభిప్రాయాలు తెలియజేయాలని సూచించింది. 1997లో కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు లాన్స్‌ నాయక్‌, నాయక్‌ హోదాలను రద్దు చేసి, వాటిని కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ హోదాల్లో విలీనం చేశారు. అయితే భారత సైన్యంలో ఈ హోదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సుమారు 3.25 లక్షల మంది సిబ్బంది ఉన్న సీఆర్పీఎఫ్‌లో కానిస్టేబుళ్లకు తొలి పదోన్నతి పొందేందుకు సగటున 22 నుంచి 25 ఏళ్లు పడుతోంది. ప్రతిపాదిత హోదాలను పునరుద్ధరిస్తే హెడ్‌ కానిస్టేబుల్‌ స్థాయికి చేరకముందే సిబ్బందికి మరో రెండు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. మరోవైపు, సైన్యంలో నాలుగేళ్ల సేవ పూర్తి చేసుకున్న అగ్నివీరుల తొలి బ్యాచ్‌ ఈ ఏడాది చివర్లో పదవీ విరమణ చేయనుంది. వీరు కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో చేరేందుకు అర్హులు. అయితే పదోన్నతులను నిర్ణీత కాలవ్యవధిలో కల్పించినప్పుడే కొత్త హోదాల ప్రతిపాదన ప్రయోజనకరంగా ఉంటుందని మాజీ పారామిలటరీ సిబ్బంది సంఘం ప్రధాన కార్యదర్శి రణ్‌బీర్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. కొత్త హోదాల అమలుతో బెటాలియన్లలో క్రమశిక్షణకు, విధుల నిర్వహణకు ఆటంకాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఓ సీనియర్‌ కమాండెంట్‌ సూచించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్