పుణె : పుణె కటక్ మండలంలో రూ. 5 లక్షల కోసం ఒక రిటైర్డ్ వైద్య అధికారిపై దాడి చేసిన ఆరోపణలపై సినీ నటి దివ్య షిండేను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె సహచరులపై కూడా కేసు నమోదు చేశారు. దివ్యను సెప్టెంబర్ 30 వరకు పోలీసు కస్టడీకి అప్పగించారు.
పోలీసుల కథనం ప్రకారం .... పుణె కటక్ మండలానికి చెందిన ఒక విశ్రాంత ముఖ్య వైద్య అధికారి కాలేపడల్ పోలీస్ స్టేషన్‌లో దివ్య షిండే పై ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుదారుడు 2021లో పదవీ విరమణ చేశారు. ఆయన ఒక ఎన్జీవోలో సభ్యుడుగా ఉన్నారు. ఈ సంస్థ సెప్టెంబర్ 1 నుండి 3 వరకు ఒక కళా ప్రదర్శన ఉత్సవాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సంబంధిత సంస్థ షిండే ను అధికారికంగా ఆహ్వానించలేదు. ఈ కార్యక్రమం సోషల్ మీడియాలో ప్రచారం చేయబడిందని చెబుతూ ... షిండే ఫిర్యాదుదారుడి మొబైల్ నంబర్‌కు ఫోన్ చేసి డబ్బు డిమాండ్ చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 17న, షిండే, ఆమె అనుచరులు ఫిర్యాదుదారుడి నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన అక్కడ లేరు. అప్పుడు షిండే, ఆమె అనుచరులు కలిసి ఫిర్యాదుదారుడి భార్య, బిడ్డ పై దాడి చేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 23న, వారు ఫిర్యాదుదారుడి మొబైల్ నంబర్‌కు ఫోన్ చేశారు. లష్కర్ ప్రాంతంలోని ఒక ప్రముఖ హోటల్‌కు అతడిని పిలిచారు. అక్కడ వారు అతడిని బెదిరించి ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 24 రాత్రి, ఫిర్యాదుదారుడు ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయంలో, షిండే, అతని అనుచరులు అక్కడికి వచ్చారు. వారు ఇంట్లోకి ప్రవేశించి ఫిర్యాదుదారుడిని కొట్టారు. ఈ ఘటనపై అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అమిత్ షెటే దర్యాప్తు చేపట్టారు. కాగా.. దివ్య షిండే బిగ్ బాస్ మరాఠీ సీజన్- 6లో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. బిగ్‌బాస్ షోలో పాల్గొన్న తర్వాతే ఆమెకు ఒక్కసారిగా ఫేమ్ వచ్చింది. ఆ తర్వాతే ఆమెకు ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 1.1 మిలియన్లకు పైగా చేరింది. దీంతో ప్రమోషన్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. అలా డాక్టర్ విద్యాధర్ గైక్వాడ్ ఆయన ఎన్జీవో ఈవెంట్‌ను దివ్య సోషల్ మీడియాలో ప్రచారం చేసినందుకు రూ. 5 లక్షలు డిమాండ్ చేసింది. ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో వైద్యునిపై దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆయన ఫిర్యాదు చేయడం వల్లే దివ్య షిండేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.








కామెంట్‌లు (0)