పీహెచ్సీల వైద్యాధికారులు డాక్టర్ లక్ష్మీ స్నేహ, డాక్టర్ సాయి కిషోర్
ప్రజాశక్తి - ఆలమూరు (కోనసీమ) : నులిపురుగుల నివారణ చర్యలకు ఆల్బెండజోల్ మాత్రలు దోహద పడతాయని పీహెచ్సీల వైద్యాధికారులు డాక్టర్ ఎన్.లక్ష్మీ స్నేహ, డాక్టర్ డి.సాయి కిషోర్ లు అన్నారు. మండలంలోని చొప్పెల్ల, పెదపల్ల పిహెచ్సిల ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్, కాలేజీలు, అంగన్వాడీల కేంద్రాలలో ఉన్న మొత్తం విద్యార్థులకు సోమవారం ఉదయం నుంచి ఆల్బెండజోల్ మాత్రలు వేయు ప్రక్రియ వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలతో చొప్పెల్ల పిహెచ్సి పరిధిలో 6,568 మంది, పెదపల్ల పిహెచ్సి పరిధిలో 5179 మంది ఉన్నారన్నారు. దీంతో మొత్తం మండల పరిధిలో 11,747 మంది పిల్లల ఆరోగ్య రక్ష కోసం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు రెండు పీహెచ్సీల పరిధిలో 97 శాతంతో 11,395 మందికి ఆల్బెండజోల్ మాత్రల ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిపారు. మిగిలిన వారికి నులిపురుగుల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనంత రామకృష్ణ, డాక్టర్ ఎం.సుదీప్తి, వైద్యశాఖ అధికారులు కె.జ్యోతి కుమార్, అంగన్వాడీలు, వైద్యశాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)