తమిళనాడు : '' మహిళను అవమానిస్తున్నారంటే.. మీరు ఎంత బలహీనంగా ఉన్నారో అర్థమవుతోంది `` అని బిజెపి నాయకురాలు ఖుష్బూ అన్నారు. సినీనటి త్రిషపై డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ఉదయనిధి వ్యాఖ్యలపై ప్రముఖ సినీనటి, బిజెపి నాయకురాలు ఖుష్బూ మరోసారి మండిపడ్డారు. ధైర్యముంటే మహిళలను తిట్టకుండా రాజకీయం చేయాలంటూ సవాల్ విసిరారు.
తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశంతో పాటు త్రిషతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. ఉదయనిధి వ్యాఖ్యలు మహిళలపై ఆయనకు ఉన్న ద్వేషాన్ని తెలియచేస్తున్నాయని ఖుష్బూ అన్నారు. ఒక నాయకుడిగా ఆయన దీనికి సిగ్గుపడాలని విమర్శించారు. ‘‘ ఒక బహిరంగ వేదికపై మహిళను దూషించే జన్మ హక్కు మీకు ఎవరు ఇచ్చారు ? ఇది కేవలం ఉదయనిధి స్టాలిన్ విషయంలోనే కాదు.. ఇతర రాజకీయ పార్టీలలోనూ జరుగుతోంది. మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఇంకెన్నాళ్లు మహిళలను నిందిస్తారు ? మీ స్వార్థ ప్రయోజనాల కోసం మహిళను అడ్డుపెట్టుకుని ప్రగల్భాలు పలుకుతూ ఆమెను అవమానిస్తున్నారంటే.. మీరు ఎంత బలహీనంగా ఉన్నారో అర్థమవుతోంది. మిమ్మల్ని మీరు బలమైన నాయకుడని చెప్పే అర్హత కోల్పోయారు. మీకు ధైర్యముంటే, నిజమైన నాయకుడిగా కొనసాగాలంటే.. ఏ మహిళనూ దూషించకుండా రాజకీయాల్లో నిలబడి చూపించండి. అది చేయగలరో లేదో చూద్దాం ’’ అని ఖుష్భూ సవాలు విసిరారు.
మహిళలను నిందించే సంస్కృతి డిఎంకె పార్టీ వారసత్వంలోనే ఉందని ఖుష్బూ విమర్శించారు. మహిళలు రాజకీయాల్లో పావులు కారని స్పష్టం చేశారు. ‘‘ నేను ఇలాంటి మాటలు, లింగవివక్ష వ్యాఖ్యలను గతంలోనూ చూశాను. డిఎంకె లో మహిళలపై వేధింపులు జరగడం కూడా చూశాను. కానీ, ఉదయనిధి స్టాలిన్ నుంచి ఇలాంటి మాటలు ఊహించలేదు. ఆయన యువ నాయకుడు, హుందాగా ప్రతిపక్షంలో ఉంటారని భావించాను. కానీ ఆయన కూడా ఇలాంటి అసభ్యకరమైన, నీచమైన వ్యాఖ్యలు చేయడం దిగ్భ్రాంతి కలిగించింది. ఆయనలో ఇప్పటికీ పశ్చాత్తాపం లేకపోవడం మరింత విచారకరం ’’ అని ఖుష్బూ అన్నారు.
నా కుటుంబంలో త్రిష కూడా ఒక సభ్యురాలే : ఖుష్బు
త్రిషతో తనకున్న అనుబంధాన్ని ఖుష్బూ ఈ సందర్భంగా పంచుకున్నారు. ‘‘త్రిష చాలా మంచి వ్యక్తి. సినీ పరిశ్రమలోకి రాకముందు నుంచి ఆమె నాకు తెలుసు. నా కుటుంబంలో ఆమె కూడా ఒక సభ్యురాలే. మా పిల్లలకూ ఆమె ఎంతో దగ్గరైంది. మా కుమార్తె పెళ్లికి నాలుగు రోజులు మా ఇంట్లోనే ఉండి అన్ని పనులు దగ్గరుండి చూసుకుంది’’ అని ఖుష్బూ వివరించారు.








కామెంట్‌లు (0)