చెన్నై : స్థలం మోసం కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఎదుట సినీనటి గౌతమి బుధవారం హాజరై వివరణ ఇచ్చారు. గౌతమికి చెందిన స్థలాలను విక్రయించి నగదు మోసానికి పాల్పడిన ఆమె అసిస్టెంట్ అళగప్పన్, అతని భార్య నాచియమ్మాళ్, తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ నగదు బదిలీ జరిగి ఉంటుందని భావించి ఈడి అధికారులు అళగప్పన్‌కి చెందిన ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. గౌతమికి సమన్లు జారీ చేయగా ఆమె ఈరోజు చెన్నై ఈడి కార్యాలయానికి వచ్చారు.
ప్రముఖ సినీ నటి గౌతమికి చెందిన రూ.25 కోట్ల విలువైన ఆస్తుల వ్యవహారంలో మోసగించారనే ఆరోపణలను ఆమె అసిస్టెంట్ అళగప్పన్, అతని భార్య నాచియమ్మాళ్, తదితరులు ఎదుర్కొంటున్నారు. అక్రమ నగదు బట్వాడాల నిరోధక చట్టం ప్రకారం ఈ కేసుపై విచారణ జరుపుతున్న ఈడి అధికారులు చెన్నై, మదురై నగరాల్లో ఒకే సమయంలో వారందరి ఇండ్లలో గత బుధవారం సోదాలు జరిపారు. నటి గౌతమి వద్ద సి.అళగప్పన్ అనే వ్యక్తి మేనేజర్ గా పని చేస్తుండేవారు. ఆయనకు భార్య ఏ ఎల్ నాచ్చల్, కుమారుడు శివ, కుమార్తె హారతి ఉన్నారు. గౌతమి సినీ నటిగా సంపాదించిన స్థిరాస్తులు ప్రత్యేకించి భూములు విక్రయించేందుకు మేనేజర్ అళగప్పన్ కు 'పవర్ ఆఫ్ అటార్నీ' ఇచ్చారు. ఈ అధికారాన్ని అళగప్పన్ దుర్వినియోగపరచి నకిలీ దస్తావేజులతో గౌతమికి చెందిన రూ.25 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను తన పేరున, భార్య పిల్లల పేరున రాసుకుని మోసగించినట్లు ఆరోపణలున్నాయి. ఈ మేరకు గౌతమి గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సెంట్రల్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న అళగప్పన్, ఆయన కుటుంబ సభ్యులను కేరళలో అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇదిలా ఉండగా .... ఈ మోసం కేసులో భారీ స్థాయిలో నగదు బట్వాడా జరిగినట్టు తెలియటంతో ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు ఈడి చేపట్టింది. చెన్నై, మధురై నగరాలలో అళగప్పన్ కు చెందిన నివాస గృహం, కార్యాలయాలు సహా ఆరు చోట్ల ఒకే సమయంలో ఈడి గత బుధవారం సోదాలు చేపట్టింది. గౌతమికి చెందిన స్థిరాస్తులను విక్రయించడం ద్వారా వచ్చిన నగదును అళగప్పన్ స్వదేశీ, విదేశీ సంస్థలలో పెట్టుబడులు పెట్టినట్టు ఆరోపణలు ఉండటంతో ఈడి రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో .... మరిన్ని వివరాల కోసం నటి గౌతమికి అధికారులు సమన్లు జారీ చేయగా ఆమె ఈరోజు ఈడి ముందు హాజరై వివరణ ఇచ్చారు.








కామెంట్‌లు (0)