చంచల్‌గూడ జైలుకు తరలింపు
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో : ట్రైనీ ఐపిఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఉప్పరపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆగస్టు 11 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. బుధవారం ఉదయం సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం ఉదయ్‌ను పోలీసులు అశోక్‌నగర్ తీసుకెళ్లారు. ఆయన ఉంటున్న గదిని అత్తాపూర్ సిఐ సీతయ్య పరిశీలించారు. అనంతరం వైద్యపరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. మహిళా ట్రైనీ ఐపిఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో ఉదయ్ కృష్ణారెడ్డిని మంగళవారం రాత్రి హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నెల 18న తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపిఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో అత్తాపూర్ పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిపై కేసు నమోదు చేశారు. డిసిపి లావణ్యనాయక్ జాదవ్ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ జ్యోత్స్న దర్యాప్తు చేపట్టారు. జాతీయ పోలీసు అకాడమీలో బాధితురాలి నుంచి వాంగ్మూలం సేకరించారు. ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించగా మెడ, గొంతు నులిమినట్లు ఆనవాళ్లు.. చెంప భాగంలో కమిలిన గాయాలు, ఎడమ కాలిపై దెబ్బలున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)