రామాయణం టీమ్‌పై అమిత్ షా ప్రశంసల జల్లు.. ఇతిహాసంపై ఆయనకున్న పట్టు చూసి ఆశ్చర్యపోయిన మేకర్స్ !
న్యూఢిల్లీ : ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణం: పార్ట్ 1’ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే భారీ వసూళ్లతో సంచలనం సృష్టిస్తున్న ఈ చిత్రం ఆస్కార్ నామినేషన్లలోనూ పేరు వినిపిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా ఈ సినిమాకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి ప్రశంసలు లభించాయి. చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా కలిసిన ఆయన.. సినిమా విజయంపై అభినందనలు తెలిపారు. అయితే ఈ భేటీలో రామాయణ ఇతిహాసంపై అమిత్ షాకు ఉన్న అపారమైన పరిజ్ఞానం చిత్ర బృందాన్ని మరింతగా ఆకట్టుకుందట.
దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కించిన ఈ భారీ చిత్రాన్ని నమిత్ మల్హోత్రా, రాకింగ్ స్టార్ యశ్ సంయుక్తంగా నిర్మించారు. నవంబర్ 5, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్, యశ్, సాయిపల్లవి, రవి దూబే కీలక పాత్రల్లో నటించారు. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, భావోద్వేగాలతో కూడిన కథనం, సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
రామాయణంపై అమిత్ షా అవగాహనకు ఫిదా !
ఈ ప్రత్యేక సమావేశంలో నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేశ్ తివారీ, హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ సాయిపల్లవితో పాటు సహ నిర్మాత నిరజ్ సంఘాయ్ పాల్గొన్నారు. భారతీయ సంస్కృతిలో విశిష్ట స్థానం కలిగిన రామాయణ ఇతిహాసాన్ని ఇంత భారీ స్థాయిలో వెండితెరపైకి తీసుకొచ్చినందుకు అమిత్ షా చిత్ర బృందాన్ని అభినందించారు. అయితే ఈ భేటీలో అందరినీ ఆశ్చర్యపరిచిన అంశం రామాయణం పై అమిత్ షాకు ఉన్న లోతైన అవగాహన. ఇతిహాసంలోని చారిత్రక అంశాలు, సాంస్కృతిక ప్రాధాన్యత, భారతీయ సంప్రదాయాల్లో దాని విశిష్ట స్థానం గురించి ఆయన వివరించిన తీరు చిత్ర బృందాన్ని ఆకట్టుకుందట. సినిమా నిర్మాణం కోసం మేకర్స్ చేసిన కృషిని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
అంతర్జాతీయ స్థాయిలోనూ ‘రామాయణం’కు ఆదరణ
విడుదలైనప్పటి నుంచి ‘రామాయణం: పార్ట్ 1’ దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోనూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. భారీ విజువల్స్, అద్భుతమైన నిర్మాణ విలువలు, భావోద్వేగాలతో కూడిన కథనం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా ఎఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ అందించిన సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఎన్నో ఏళ్ల ప్రణాళిక, కఠినమైన శ్రమ, ఎంతోమంది ప్రతిభావంతుల సమిష్టి కృషితో ‘రామాయణం’ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. ఈ క్రమంలో దేశ హోం మంత్రి అమిత్ షా నుంచి ప్రశంసలు అందుకోవడం నిర్మాత నమిత్ మల్హోత్రాకు మరో కీలక మైలురాయిగా నిలిచింది. ఇప్పటికే భారీ అంచనాలు, ప్రేక్షకుల ఆదరణతో దూసుకుపోతున్న ఈ చిత్రం.. తాజా ప్రశంసలతో మరోసారి సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.







కామెంట్లు (0)