ముంబయి : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు ఆయన భార్య ట్వింకిల్ ఖన్నా ఫోన్‌లోనే చీవాట్లు పెట్టారు. ‘కాఫీ విత్ కరణ్’ షోలో జరిగిన ఈ సరదా సంఘటన ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమానికి అక్షయ్ కుమార్, భోజ్‌పురి నటుడు రవికిషన్ హాజరయ్యారు. హోస్ట్ కరణ్ అడిగిన ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానాలిస్తూ సందడి చేశారు. ఈ క్రమంలో అక్షయ్ తన భార్య ట్వింకిల్ ఖన్నాకు ప్రాంక్ కాల్ చేశారు.
ఫోన్ ఎత్తగానే ట్వింకిల్ అక్షయ్‌పై సరదాగా విరుచుకుపడ్డారు. “రాత్రి సరిగ్గా నిద్రపోలేదు. అయినా ఉదయం ఆరు గంటలకే నన్ను నిద్రలేపావు. తెల్లవారుజామునే భజన పాటలు ఎవరు పెడతారు ? అది చాలదన్నట్టు గట్టిగా పాటలు పాడుతున్నావు. బాత్రూమ్ డోర్ అయినా సరిగ్గా వేసుకోమని ఎన్నిసార్లు చెప్పాలి?” అంటూ అక్షయ్‌ను ఆటపట్టించారు. ఆ తర్వాత అక్షయ్ ఎక్కడ ఉన్నారని ట్వింకిల్ అడగ్గా, తాను కరణ్ షోలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇటీవలే తాను కూడా కరణ్‌తో మాట్లాడానని, ర్యాపిడ్ ఫైర్ రౌండ్‌కు న్యాయనిర్ణేతగా రావాలని ఆహ్వానించినట్లు ట్వింకిల్ చెప్పారు. అయితే, ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు అక్షయ్ ఎలాంటి పారితోషికం తీసుకోలేదని తెలిసి ఆమె ఆశ్చర్యపోయారు. “మీరు ఈ షో ఉచితంగా చేస్తున్నారా? నాకు షాకింగ్‌గా ఉంది” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవికిషన్ తనకు గుర్తింపు తెచ్చిన వైరల్ హుక్ స్టెప్‌ను అక్షయ్ కుమార్‌కు నేర్పించారు. దీంతో షోలో మరింత సందడి నెలకొంది.








కామెంట్‌లు (0)