కాస్టింగ్ కౌచ్ పై సినీనటి ఖుషీ ముఖర్జీ సంచలన వ్యాఖ్యలు
అవకాశాల పేరుతో అనైతిక డిమాండ్లు చేశారంటూ ఆరోపణలు
హైదరాబాద్ : నటన రంగంలో అవకాశాల కోసం ప్రయత్నించే మహిళలకు కాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురవుతున్నాయనే ఆరోపణలు తరచూ వినిపిస్తుంటాయి. తాజాగా సినీనటి, మోడల్ ఖుషీ ముఖర్జీ కూడా తనకు ఎదురైన ఇలాంటి చేదు అనుభవాలను ఓ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. అవకాశాలు ఇస్తామని చెప్పి కొందరు దర్శకులు, పరిశ్రమకు చెందిన వ్యక్తులు అనైతిక ప్రతిపాదనలు చేశారని ఆమె ఆరోపించారు. టీవీ రియాలిటీ షో లు, దక్షిణాది సినిమాలు, హిందీ వెబ్ సిరీస్‌ల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఖుషీ ముఖర్జీ.. తన ముక్కుసూటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా కాస్టింగ్ కౌచ్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.
పని కావాలంటే తమతో రాజీ పడాలని చెప్పడం ఏమాత్రం సమర్థనీయం కాదని ఖుషీ అన్నారు. ఒక సినీనటికి ప్రతిభ, కష్టపడే సామర్థ్యం కాకుండా వ్యక్తిగత సంబంధాలను అవకాశాలకు షరతుగా పెట్టడం పూర్తిగా తప్పు అని స్పష్టం చేశారు. తనకు కూడా పాత్రలు ఇస్తామని చెప్పి ఇలాంటి ప్రతిపాదనలు చేసిన సందర్భాలు ఉన్నాయని ఆమె వెల్లడించారు. అలాంటి పరిస్థితుల్లో తాను భయపడకుండా వారికి గట్టిగానే సమాధానం ఇచ్చేదానినని ఖుషీ చెప్పారు. తనపై వ్యక్తిగతంగా ఆసక్తి చూపిన వారికి వ్యంగ్యంగా సమాధానం ఇచ్చిన సందర్భాలను కూడా ఆమె వెల్లడించారు. మహిళలను కేవలం వ్యక్తిగత కోరికలు తీర్చే వస్తువులుగా చూడటం అవమానకరమని వ్యాఖ్యానించారు. అవకాశాల కోసం పరిశ్రమలోకి వచ్చే యువ నటీమణుల బలహీనతలను ఆసరాగా చేసుకుని వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని ప్రయత్నించడం నైతికంగా తప్పని ఖుషీ అన్నారు. తమను తాము పరిశ్రమలో పెద్దవారిగా చూపించుకుంటూ కొత్తగా వచ్చే నటీనటులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని పేర్కొన్నారు.
ఇదే సందర్భంలో హైదరాబాద్‌లో ఒక దర్శకుడు తనను మోసం చేసి, ఒక రాత్రి కోసం నిర్మాతకు రూ.1 లక్షకు అప్పగించే ప్రయత్నం చేశాడని ఖుషీ మరో ఆరోపణ చేశారు. అవకాశాల పేరుతో మహిళలను ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని ఆమె స్పష్టం చేశారు. 0సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్‌పై ఇప్పటికే పలువురు నటీమణులు తమ అనుభవాలను వెల్లడించిన నేపథ్యంలో ఖుషీ ముఖర్జీ వ్యాఖ్యలు మరోసారి ఈ అంశాన్ని చర్చలోకి తీసుకొచ్చాయి. అవకాశాల పేరుతో ఎవరైనా అనైతిక డిమాండ్లు చేస్తే వాటిని అంగీకరించాల్సిన అవసరం లేదని, అలాంటి పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కోవాలని ఆమె సూచించారు.








కామెంట్‌లు (0)