మంగళవారం, 20 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

‘వారణాసి’ ఓ అందమైన ప్రేమకథ : రాజమౌళి

14 గంటల క్రితం

‘Varanasi’ is a beautiful love story: Rajamouli
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 20, 2026, 12:30 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

హైదరాబాద్ : సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘వారణాసి’. దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్నారు. సినిమా ప్రకటన వెలువడినప్పటి నుంచి కథాంశంపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ సినిమా కథ, అందులోని భావోద్వేగాల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.


‘వారణాసి’ టైమ్‌ ట్రావెల్‌ నేపథ్యంలో సాగే చిత్రమని ఇప్పటికే వెల్లడైంది. అయితే ఇందులో కేవలం సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలకే పరిమితం కాకుండా, పౌరాణిక నేపథ్యం, భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేసినట్లు రాజమౌళి వివరించారు. తండ్రీకొడుకుల మధ్య అనుబంధంతో పాటు యువతీయువకుల మధ్య సాగే అందమైన ప్రేమకథ కూడా ఇందులో ఉంటుందని తెలిపారు.


ఆరు లేదా ఏడు విభిన్న చిత్రాల కథాంశాలను ఒకే సినిమాలో మేళవించిన అనుభూతి ‘వారణాసి’ని చూస్తున్నప్పుడు కలుగుతుందని రాజమౌళి పేర్కొన్నారు. భిన్నమైన అంశాలన్నింటినీ సమన్వయం చేసి ఒకే కథగా మలచడం ఈ సినిమా నిర్మాణంలో అతిపెద్ద సవాలుగా నిలిచిందని చెప్పారు.


మరోవైపు, చిత్రీకరణకు ఇంకా పది రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని రాజమౌళి వెల్లడించారు. దీంతో అక్టోబరు నాటికి షూటింగ్‌ పూర్తయ్యే అవకాశముంది. నవంబరు నుంచి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో పాటు సినిమా ప్రచార కార్యక్రమాలపైనా దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.


మహేశ్‌ నటనపై రాజమౌళి ప్రశంసలు ....

ఈ చిత్రంలో మహేశ్ ‌బాబు నటన తన అంచనాలను మించిపోయిందని రాజమౌళి ప్రశంసించారు. మహేశ్‌ ప్రతిభపై తనకు ముందే నమ్మకం ఉన్నప్పటికీ, ఆయనతో కలిసి పనిచేయడం ప్రారంభించాక ఆ నమ్మకం మరింత పెరిగిందని చెప్పారు. తాను ఊహించిన దానికంటే రెండింతలు మెరుగైన నటనను మహేశ్‌ ప్రదర్శించారని, తన పాత్రలో పూర్తిగా లీనమై దానికి జీవం పోశారని కొనియాడారు. మహేశ్‌తో కలిసి పనిచేయడం ఎప్పటికీ గుర్తుండిపోయే అనుభవమని పేర్కొన్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ‘వారణాసి’ ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. టైమ్‌ ట్రావెల్‌, పౌరాణిక అంశాలు, కుటుంబ అనుబంధాలు, ప్రేమకథ కలగలిసిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.














ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్