తిరువనంతపురం:
కేరళ కార్మిక వర్గ ఉద్యమ చరిత్రతో ముడిపడిన సీనియర్ సీపీఐ(ఎం) నాయకుడు, మాజీ మంత్రి పి కే గురుదాసన్ పోరాటాల జీవితం ఇప్పుడు డాక్యుమెంటరీ రూపంలో రాబోతోంది. 'సమరసఖావు పి కే గురుదాసన్' (పోరాట యోధుడు పి కే గురుదాసన్) పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బిజు నెట్టర దర్శకత్వం వహిస్తున్నారు.
కాయిర్ (పీచు) కార్మిక ఉద్యమం ద్వారా రాజకీయాల్లోకి వచ్చి, కేరళ రాజకీయాల్లో నిరాడంబరతకు, రాజీలేని పోరాట పటిమకు ప్రతీకగా నిలిచిన గొప్ప నాయకుడు పి కే గురుదాసన్. ఎమర్జెన్సీ కాలంలో ఎదుర్కొన్న ఘోరమైన చిత్రహింసలు, సుదీర్ఘ అజ్ఞాతవాసం, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీతో పాటు సీపీఐ(ఎం)లో నిర్వహించిన కీలక బాధ్యతలు, అలాగే కార్మిక-ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఆయన చూపిన అత్యుత్తమ పాలనాదక్షతను ఈ డాక్యుమెంటరీలో సమగ్రంగా చిత్రీకరించారు.
కేరళ సామాజిక-రాజకీయ మార్పులను ప్రతిబింబించే అరుదైన ఛాయాచిత్రాలు, నాటి రాజకీయ పరిణామాలకు ప్రత్యక్ష సాక్షులుగా నిలిచిన సీనియర్ నాయకులు, సహచరుల జ్ఞాపకాలు ఈ డాక్యుమెంటరీకి ప్రధాన బలంగా నిలవనున్నాయి. భావి తరాలకు అందించాల్సిన కమ్యూనిస్ట్ విలువలు, రాజీలేని పోరాటాలకు ఈ చిత్రం ప్రతిరూపంగా ఉంటుందని దర్శకుడు బిజు నెట్టర తెలిపారు. ఈ డాక్యుమెంటరీ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే ప్రజల ముందుకు తీసుకువస్తామని చిత్ర బృందం పేర్కొంది.
సాంకేతిక నిపుణులు & చిత్ర బృందం :
ఈ డాక్యుమెంటరీని నెట్టర మీడియా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై పి ఎ సమద్ కరుణాగపల్లి, సుధీర్ మంగలత్, విల్సన్ పెరేరా నిర్మిస్తుండగా, టి వి బాలన్ కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. బిజు నెట్టర స్క్రిప్ట్ మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అభిలాష్ బాలచంద్రన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. రారీష్, గౌరి బిజు ఛాయాగ్రహణం అందించగా, ప్రొఫెసర్ అలియార్ వ్యాఖ్యానం (నరేషన్) ఇచ్చారు. నందకుమార్ కడప్పాల్ కామెంట్ రీడింగ్ రైటర్‌గా పని చేయగా, దినేష్ పవిత్రేశ్వరం సౌండ్ మిక్సింగ్ & డిజైన్, మోహన్‌కుమార్ (చిత్రాంజలి) సింక్ సౌండ్ బాధ్యతలను చూసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ చీఫ్ కో-ఆర్డినేటర్‌గా కె సేతుమాధవన్, అసోసియేట్ డైరెక్టర్‌గా పతి కె నాయర్, ప్రొడక్షన్ మేనేజర్‌గా జయచంద్రన్ నెడుంగోలం వ్యవహరించారు. తిరువనంతపురానికి చెందిన ఐమన్ డిజిటల్ స్టూడియో సాంకేతిక సహకారం అందించగా, జె వి కురుప్, గోపన్ వి ఎస్ లోకేషన్ మేనేజర్లుగా పనిచేశారు. అలాగే సిగ్ని దేవరాజ్, మురళీదాసన్ స్కెచ్‌లను, శ్రీరంజ్ గ్రాఫిక్స్ బ్రోషర్‌ను రూపొందించారు. జిజో ఎస్ పరవూర్, జోష్ తంబురు, సంతోష్ తట్టామల స్టిల్స్ అందించగా, అజయ్ తుండత్తిల్ పి.ఆర్.ఓ (PRO)గా వ్యవహరిస్తున్నారు.








కామెంట్‌లు (0)