దక్షిణ భారత సినీ సంగీతానికి తన మధుర గాత్రంతో విశిష్ట సేవలందించిన ప్రముఖ నేపథ్య గాయని జమునారాణి (88) గురువారం (జూలై 30) బెంగళూరులో వయోభారంతో కన్నుమూశారు. నాలుగేళ్ల వయసులోనే సినీ గాయనిగా ప్రస్థానం ప్రారంభించిన ఆమె, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, సింహళం భాషల్లో దాదాపు ఆరు వేల పాటలు ఆలపించి చెరగని ముద్ర వేశారు. 'నాగమల్లి కోనలోన.. నక్కింది లేడి కూన..', 'మావ మావ.. మావ..', 'ఓ వన్నెల వయ్యారి..', 'ఎంత టక్కరివాడు నా రాజు..' వంటి పాటలతో పాటు 'అందాన్ని నేనూ.. ఆనందానికి నేనూ..' వంటి ప్రత్యేక గీతాలతోనూ సంగీతాభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
తెలుగు సినిమా ప్రస్థానం ప్రారంభమైన తర్వాత 1950ల నాటికి సినీ సంగీతం కొత్త పుంతలు తొక్కింది. భక్తి గీతాలు, ప్రణయ గీతాలు, హాస్య గీతాలు, జానపద గీతాలతో చిత్రపరిశ్రమ కళకళలాడిన రోజులు అవి. ఎందరో గాయనీగాయకులు తమ మధుర గాత్రంతో ప్రత్యేక ముద్ర వేశారు. వారిలో జమునారాణి ఒకరు. చిన్న వయసులోనే తన గాత్రంలోని ప్రత్యేకతతో సంగీత దర్శకుల దృష్టిని ఆకర్షించిన ఆమె, అతి తక్కువ కాలంలోనే అగ్రగాయనులతో సమానమైన గుర్తింపు సంపాదించారు.
1938లో చెన్నైలో జన్మించిన జమునారాణికి సంగీతం ఇంటి నుంచే అలవడింది. ఆమె తల్లి వీణ విద్వాంసురాలు. తల్లి ప్రోత్సాహంతోనే సినిమాల్లో పాటలు పాడడం ప్రారంభించారు. అలనాటి మేటి నటి భానుమతి రామకృష్ణ వివాహ సందర్భంగా నిర్వహించిన కచేరిలో 'మధురా నగరిలో చల్లనమ్మబోతు.. దారి విడువుము కృష్ణా..' అంటూ ఆలపించిన గీతం సినీ ప్రపంచం దృష్టిని ఆమెవైపు తిప్పింది. అనంతరం 'త్యాగయ్య' చిత్రంతో బాలగాయనిగా పరిచయమై, తక్కువ కాలంలోనే ప్రముఖ గాయనీగాయకులతో సమానమైన కీర్తిని సంపాదించారు. పి. సుశీల, పి. లీల, జిక్కితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, 'కాలేజీలో ఫ్రెండ్స్‌లా ఉండేవాళ్లం. గర్వం, అహంకారం లేకుండా జీవించాం. ఆ రోజులు ఎంతో గొప్పవి' అని ఏ ఇంటర్వ్యూలోనైనా ఆప్యాయంగా చెప్పేవారు.
వివాహం చేసుకోకుండా ఉండిపోయిన జమునారాణి ఆ నిర్ణయం వెనుక కారణాన్ని ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేవారు. 'పెళ్లి చేసుకున్న నా తోటి గాయనీమణులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎవరో ఒకరికి మాత్రమే ఆ బంధం అందంగా ఉండేది. చాలామంది గృహహింసకు గురయ్యారు. పాటలు పాడకుండా ఇంటికే పరిమితమైన వాళ్లు ఎంత బాధ అనుభవించారో నేను చూశాను' అని ఒక ఇంటర్వ్యూలో అన్నారు. 'ఆడపిల్లలు బయటకు రావడమే గొప్పగా భావించిన రోజుల్లో సినిమాల్లో పాటలు పాడడం, నటించడం, డ్యాన్సులు చేయడాన్ని తప్పుగా చూసేవారు. అలాంటి వాతావరణంలో పెరిగిన నాకు పెళ్లిపై సదభిప్రాయం కలగలేదు' అని స్పష్టంగా చెప్పారు. తనతోటి గాయనీమణుల జీవితాలను గుర్తు చేసుకుంటూ, 'వాళ్ల గాత్రాన్ని చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నవాళ్లే, వారికి పేరుప్రఖ్యాతులు వస్తుంటే ఓర్వలేకపోయారు. ఏదో ఒక పేరుతో హింసించారు. అన్ని కష్టాలు పెట్టడం ఎందుకు?' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ బంధాలకు ఎంతో విలువ ఇచ్చిన జమునారాణి, తన సోదరుడి గురించి ఎంతో ప్రేమగా మాట్లాడేవారు. 'నా అన్నలాంటి వాడు ఏ ఆడపిల్లకూ దొరకడు' అని చెప్పిన ఆమెకు, అన్నయ్య కుటుంబమంటే అమితమైన అభిమానం.
లతా మంగేష్కర్‌ను ఆదర్శంగా భావించిన జమునారాణి, ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వచ్చిన 'నాయకుడు' చిత్రంలోని 'నా నవ్వే దీపావళి.. నా పలుకే గీతాంజలి..' పాటతో కొత్త తరానికీ చేరువయ్యారు. సింహళం భాషలో అత్యధిక పాటలు పాడిన భారతీయ గాయకురాలిగా ఆమె ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆ కృషికి గుర్తింపుగా 2005లో శ్రీలంక ప్రభుత్వం ఆమెను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. తెలుగు సినీ సంగీతంతో పాటు దక్షిణ భారత సంగీత ప్రపంచానికి విశిష్ట సేవలందించిన జమునారాణి మరణం సంగీతాభిమానులకు తీరని లోటు. ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆలపించిన పాటలు తరతరాల పాటు సంగీతప్రియుల హృదయాల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఆ గీతాలే ఆమెను చిరస్మరణీయంగా నిలబెడతాయి.








కామెంట్‌లు (0)