సోమవారం, 05 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆటబొమ్మగా చూడొద్దు.. చూపొద్దు..!

2 గంటల క్రితం

ఆటబొమ్మగా చూడొద్దు.. చూపొద్దు..! image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 05, 2026, 06:15 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం

కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో నటీనటుల ముఖాలను మార్చడం, వారు నటించని సన్నివేశాలను సృష్టించడం ఇటీవల ఒక ధోరణిగా మారింది. ఇది మహిళల ఆత్మగౌరవానికి తీవ్రమైన ముప్పుగా పరిణమిస్తోంది. ఒకవైపు ఏఐతో నటీమణుల ముఖాలను మార్ఫింగ్‌ చేసి అసభ్యకరమైన వీడియోలు సృష్టిస్తుంటే, మరోవైపు సినిమాల్లో స్త్రీలను కేవలం శరీరాలుగా, వినోద వస్తువులుగా చూపించే ధోరణి కొనసాగుతోంది. సాంకేతికత దుర్వినియోగమైనా, కళాత్మక స్వేచ్ఛ పేరుతో స్త్రీల గౌరవం విస్మరణకు గురైనా నష్టపోయేది మహిళలే. ఈ రెండు కోణాలనూ కలిపి పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ఇటీవల జూనియర్‌ ఎన్టీఆర్‌, జాన్వీ కపూర్‌ నటించిన ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లె’ పాటను ఏఐ సాయంతో మార్ఫింగ్‌ చేసి, అభ్యంతరకరమైన రీతిలో రూపొందించిన వీడియో తీవ్ర వివాదానికి దారితీసింది. దీనిపై జూనియర్‌ ఎన్టీఆర్‌ తీవ్రంగా స్పందించారు. మహిళలను కించపరిచేలా ఇలాంటి వీడియోలు రూపొందించడం, ప్రచారం చేయడం సహించరాని చర్యగా పేర్కొంటూ చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి చర్యలు క్రూరమైనవని పేర్కొంటూ, బాధితులకు అండగా నిలిచేందుకు, అభ్యంతరకర వీడియోలను తొలగించేందుకు, బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థ అవసరమని సూచించారు. నటుడు విజయ్‌ దేవరకొండ కూడా మహిళ గౌరవాన్ని సాంకేతికత సాయంతో ఉల్లంఘించడం డిజిటల్‌ రూపంలో జరిగిన లైంగిక దాడితో సమానమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సీనియర్‌ నటి ఖుష్బూ సహా పలువురు ప్రముఖులు ఈ దుర్మార్గపు చర్యలను ఖండించారు.

ఏఐ దుర్వినియోగం

ఏఐతో నటీమణుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి అసభ్యకరమైన దృశ్యాలు సృష్టించడం ఇప్పుడే మొదలైన సమస్య కాదు. 2023లో నటి రష్మిక మందన్న ముఖాన్ని మరో మహిళ శరీరంపై అమర్చి రూపొందించిన డీప్‌ఫేక్‌ వీడియో కలకలం సృష్టించింది. ఆ తరువాత కాజోల్‌ తదితర ప్రముఖుల పేర్లతోనూ ఇలాంటి వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి వీడియోలు సామాజిక మాధ్యమాల ద్వారా క్షణాల్లో లక్షలాది మందికి చేరతాయి. ఒకసారి ఇంటర్నెట్‌లోకి వెళ్లిన కంటెంట్‌ను పూర్తిగా తొలగించడం అసాధ్యంగా మారుతుంది. వీడియోను రూపొందించిన వ్యక్తితోపాటు, దాని స్వభావం తెలిసి కూడా ప్రచారం చేసేవారూ బాధితురాలికి జరిగిన నష్టంలో భాగస్వాములవుతున్నారు. ఖండన పేరుతోనైనా ఆ వీడియోను మళ్లీ మళ్లీ ప్రస్తావించడం, పంచుకోవడం వల్ల దాని వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉంది.

ఈ వివాదంపై దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ చేసిన వ్యాఖ్యలు ఈ కోణంలోనే చర్చకు వచ్చాయి. అభ్యంతరకరమైన వీడియోను ఖండిస్తూ ప్రముఖులు సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలు చేయడం వల్ల దానికి మరింత ప్రచారం లభించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నేరాన్ని ఖండించాలనే ఉద్దేశంతో దాని వివరాలను పదేపదే ప్రస్తావించడం వల్ల వీడియో వ్యాప్తికి దోహదపడినట్లవుతుందన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం. ఇందులో ఆలోచించాల్సిన అంశం ఉంది. బాధితురాలికి జరిగిన అవమానాన్ని మళ్లీ మళ్లీ బహిరంగ చర్చలోకి తీసుకురావడం ఆమెకు మరింత ఇబ్బందికరంగా మారవచ్చు. నేరాన్ని ఖండించడం కంటే బాధితురాలికి న్యాయం జరగడం, వీడియో తొలగింపు, నేరస్థుల గుర్తింపు వంటి పరిణామాలే అసలు ప్రాధాన్యం పొందాలి.

తెరపై స్త్రీల చిత్రణ మారాలి!

సినిమాల్లో స్త్రీల చిత్రణపై కూడా చాలాకాలంగా చర్చ నడుస్తోంది. ముఖ్యంగా సినిమాల్లో కథానాయిక పట్ల హీరో ప్రవర్తన అభ్యంతరకరంగా సాగడం ఆక్షేపణీయం. అంగీకారం లేని స్పర్శను, వేధింపులను ప్రేమగా, వీరోచిత చర్యగా చూపించే ధోరణి దారుణమైనది. రామ్‌చరణ్‌ నటించిన ‘పెద్ది’లో జాన్వీ కపూర్‌ పోషించిన అచ్చియమ్మ పాత్ర పరిచయం, ఆమెతో కథానాయకుడు వ్యవహరించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. స్త్రీ పాత్ర వ్యక్తిత్వం కంటే ఆమె శరీరానికి ప్రాధాన్యం ఇచ్చారని, అంగీకారం లేని స్పర్శను ప్రేమ వ్యక్తీకరణగా చూపించారని విమర్శలు వచ్చాయి. దీనిపై దర్శకుడు బుచ్చిబాబు సానా స్పందించి క్షమాపణ చెప్పారు. తాజాగా ‘ది ప్యారడైజ్‌’లో హీరోయిన్‌ పాత్రను ఉద్దేశించి ఉపయోగించిన ‘సింగిల్‌ షాట్‌ యాక్ట్రెస్‌’ అనే సంభాషణ కూడా వివాదానికి కారణమైంది. హాస్యం పేరుతో స్త్రీలను కించపరిచే మాటలకు సినిమాలో చోటివ్వడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్‌’లో కథానాయకుడి హింసాత్మక ప్రవర్తన, భార్యతో వ్యవహరించే తీరు, స్త్రీల పట్ల అతని ఆధిపత్య ధోరణి తీవ్ర చర్చకు దారితీశాయి. యశ్‌ నటిస్తున్న ‘టాక్సిక్‌’ టీజర్‌, పాటల్లోని కొన్ని దృశ్యాలపైనా స్త్రీ శరీరాన్ని వాణిజ్య ఆకర్షణగా ఉపయోగిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇవన్నీ తెరపై మహిళల ఉనికి, పాత్రల స్వతంత్రత, గౌరవం వంటి అంశాలను మరోసారి ముందుకు తెచ్చాయి. కథానాయికకు కథలో ఎంత స్థానం ఉంది? ఆమెకు సొంత ఆలోచనలు, నిర్ణయాలు, భావోద్వేగాలు ఉన్నాయా? లేక కథానాయకుడి జీవితంలో ఒక అలంకార పాత్రగానే మిగిలిపోతుందా? అనే ప్రశ్నలు ప్రేక్షకుల నుంచి వినిపిస్తున్నాయి. ఇక్కడ చర్చ కళాత్మక స్వేచ్ఛకు పరిమితులు విధించాలన్నది కాదు. ఒక పాత్ర ప్రతికూలంగా ఉండవచ్చు, హింసాత్మకంగా ప్రవర్తించవచ్చు. అయితే ఆ ప్రవర్తనను సినిమా ఏ దృష్టితో చూపిస్తోందన్నది ముఖ్యం. అంగీకారం లేని స్పర్శను ప్రేమగా, వేధింపులను సరదాగా, అవమానకరమైన మాటలను వినోదంగా చిత్రీకరించినప్పుడు వాటి వెనుక ఉన్న సామాజిక భావజాలం కూడా చర్చకు వస్తుంది. సినిమా కేవలం కథను చెప్పే మాధ్యమం మాత్రమే కాదు. అది సమాజంలోని అభిప్రాయాలను ప్రతిబింబించడంతోపాటు, వాటిని ప్రభావితం చేసే శక్తినీ కలిగి ఉంది. అందువల్ల తెరపై స్త్రీ పాత్రల చిత్రణను కేవలం వినోదం, వ్యాపారం కోణాల్లోనే చూడలేం.

చౌకబారు ప్రచార వ్యూహాలు

సినిమా ప్రచారంలోనూ ఈ ధోరణి కనిపిస్తోంది. వివాదాస్పద దృశ్యాలు, ద్వంద్వార్థ సంభాషణలు, స్త్రీల శరీరాన్ని కేంద్రీకరించిన పోస్టర్లు, టీజర్ల ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలనే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. కొన్నిసార్లు విమర్శలే సినిమాకు అదనపు ప్రచారాన్ని తెచ్చిపెడుతున్నాయి. వివాదాన్ని సృష్టించి, దానిని వ్యాపార ప్రయోజనాలకు ఉపయోగించుకునే ధోరణి కూడా ఇందులో భాగమే. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే అంశాలను ప్రచార వ్యూహాలుగా మార్చడం మరింత ఆందోళనకరం. సంచలనం సృష్టించడం, ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం మాత్రమే లక్ష్యంగా మారినప్పుడు సృజనాత్మకత, సామాజిక బాధ్యత వెనుకబడిపోతాయి.

ఏఐతో రూపొందించే నకిలీ వీడియోలైనా, సినిమాలో స్త్రీల చిత్రణైనా, ప్రచారంలో ఉపయోగించే దృశ్యాలైనా... వీటి వెనుక స్త్రీని స్వతంత్ర వ్యక్తిగా కాకుండా ఒక వస్తువుగా చూసే భావజాలం కనిపిస్తోంది. మహిళల వ్యక్తిగత గౌరవం, సమ్మతి, గోప్యత, సమానత్వం వంటి విలువలను సినిమా పరిశ్రమ తన సృజనాత్మక ప్రక్రియలో అంతర్భాగం చేసుకోవాలి. ఏఐ దుర్వినియోగంపై వేగంగా స్పందించే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయడం, బాధితులకు న్యాయపరమైన సహాయం అందించడం, అభ్యంతరకర కంటెంట్‌ తొలగింపునకు సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకోవడం అవసరం. అదే సమయంలో సినిమా కథల్లో మహిళలకు స్వతంత్ర వ్యక్తిత్వం, గౌరవప్రదమైన స్థానం కల్పించాలి. నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, సాంకేతిక నిపుణులు ఈ బాధ్యతను పంచుకోవాలి. తెరపై స్త్రీని గౌరవించలేని సినిమా పరిశ్రమ, నిజజీవితంలో మహిళల గౌరవం గురించి మాట్లాడితే ఆ మాటలకు విశ్వసనీయత ఎలా వస్తుంది?

- ప్రజాశక్తి సినిమా డెస్క్‌

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్