- పలుచోట్ల సభలు, ప్రదర్శనల్లో వక్తల పిలుపు
ప్రజాశక్తి- యంత్రాంగం : ఆదివాసీల హక్కులు, చట్టాలను తుంగలో తొక్కేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పన్నుతున్నాయని, ఈ నేపథ్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ స్ఫూర్తితో గిరిజనులంతా పోరాటాలకు సిద్ధం కావాలని నేతలు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యాన అల్లూరి, పోలవరం, పార్వతీపురం మన్యం, ఏలూరు జిల్లాల్లో ఆదివారం ప్రదర్శనలు, సభలు నిర్వహించారు. వీటిలో ఆదివాసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అల్లూరి జిల్లా అనంతగిరిలో హరిత హిల్ రిసార్టు వద్ద నిర్వహించిన సభలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ ఏజెన్సీలో ఆదివాసీలకు వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్ కల్పించే జిఒ 3ని పునరుద్ధరించాలని లేదా ప్రత్యామ్నాయంగా జిఒ తీసుకొచ్చి చట్టబద్ధతకు ఆర్డినెన్సు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1/70 చట్టం పరిరక్షణకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని, కమిటీల పేరుతో కాలయాపన చేయడం తగదన్నారు. సభకు ముందు కొత్తవలస బాలుర పాఠశాల వద్ద ప్రారంభమైన ర్యాలీ థింసా నృత్యంతో ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో సిపిఎం జెడ్‌పిటిసి సభ్యులు దీసరి గంగరాజు, ఎంపిపి తడబరికి మెత్తుల తదితరులు పాల్గొన్నారు. పాడేరులోని ఎపిటిఎఫ్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు పి.అప్పలనర్స మాట్లాడుతూ ఆదివాసీల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో అడవులను కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తోందన్నారు. గత ఎన్నికల సమయంలో ఆదివాసీలకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 2026 అక్టోబర్‌లో నిర్వహించే డిఎస్‌సిలో ఆదివాసీ యువతకు శతశాతం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఆదివాసీ మహిళా ఉద్యమ నేత కాంగు శుభ, గిరిజన సమాఖ్య జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ పాల్గొన్నారు. పోలవరం జిల్లా రాజవొమ్మంగిలో ఆదివాసీ గిరిజన సంఘం, గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గిరిజనులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అల్లూరి జంక్షన్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. గిరిజనుల హక్కులు, చట్టాలు, ఐక్యతపై నినదించారు. ఆట, పాటలు, నృత్యాలతో అలరించారు. ఆర్అండ్‌బి అతిథి గృహం వద్ద ఆదివాసీ జెండాను నేతలు ఆవిష్కరించారు. అనంతరం బహిరంగ సభలో ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల పరిరక్షణతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివాసీ సంప్రదాయాలను ప్రతిబింబించే రేలా నృత్యాలు, విల్లంబుల ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలోజు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ, శ్రామిక మహిళా నాయకురాలు మొడియం నాగమణి తదితరులు మాట్లాడారు.
పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో గిరిజన సంప్రదాయ వాయిద్యాలతో హెలిప్యాడ్ (హెచ్) గ్రౌండ్ నుంచి ఆర్టిసి కాంప్లెక్స్ వరకు ఆదివాసీలు భారీ ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు, కళలకు, నృత్యాలకు వేదికగా ఈ ర్యాలీ నిలిచింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి గిరిజనుడు చట్టాలు, హక్కులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోలక లక్ష్మణమూర్తి, ఎంపిపి దీనమయ్య, సర్పంచుల సంఘం మండల మాజీ అధ్యక్షులు బొత్తాడ గౌరీ శంకర్రావు, గిరిజన సంఘాల నాయకులు, ఆదివాసీలు పాల్గొన్నారు. కొమరాడ మండలంలోని పెద్దశాఖ గ్రామంలో ఆదివాసీ గిరిజన సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి.ఇందిర, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కొల్లి సాంబమూర్తి, గిరిజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. సీతంపేటలో ఆదివాసీ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతంపేట ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు బిడ్డిక శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆదివాసీ ప్రజల మనోభావాలను పాలకులు గౌరవించాలని కోరారు.







కామెంట్‌లు (0)