- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎపి పారా మిలిటరీ విశ్రాంత సైనికుల ఆగ్రహం
ప్రజాశక్తి - మంగళగిరి (గుంటూరు జిల్లా) : విశ్రాంత సైనికుల సమస్యల పరిష్కారంలో పాలకులు విఫలమయ్యారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారా మిలిటరీ విశ్రాంత సైనికుల సంక్షేమ సంఘం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ చంద్రకుమార్ విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఆదివారం సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి చంద్రకుమార్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ విశ్రాంత సైనికుల సమస్యలను పరిష్కరిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాకు అర్ధ సైనిక భవనాలను ఏర్పాటు చేయాలని కోరారు. విశ్రాంత సైనికుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులను కేటాయించాలన్నారు. ఆర్మీతో సమానంగా తామూ విధులు నిర్వహిస్తున్నా తమకు ఏ విధమైన సంక్షేమమూ లేదని వాపోయారు. ఏదైనా కష్టం వస్తే ఢిల్లీ వెళ్లాల్సి వస్తోందని, అదే స్థానికంగా కార్యాలయం ఉంటే ఇబ్బంది ఉండదన్నారు. ఇంటి పన్నులు మినహాయిస్తామంటూ ఆపరేషన్ సిందూర్ సమయంలో హామీనిచ్చిన పవన్ కల్యాణ్ తరువాత మర్చిపోయారని, అలాంటప్పుడు మాట ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. ఎపిలో రిటైరైన వారికి ఉద్యోగాలు లేవని, ఉద్యోగ విరమణ చేసినవారు తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తోందని, కొందరైతే ఇక్కడే ఆఫీసర్ల వద్ద గాడ్స్‌గా డ్యూటీ చేసుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రీ ఎంప్లాయిమెంట్ అర్హత కలిగిన మాజీ సిఎపిఎఫ్ సిబ్బందికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్‌గా అవకాశం కల్పించాలని కోరారు. ఇన్‌స్పెక్టర్ కెవి ఆర్ మూర్తి మాట్లాడుతూ దేశ రక్షణలో సిఆర్‌పిఎఫ్ బలగాలు విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోతున్నా వారి కుటుంబాలకు ప్రభుత్వాలు అండగా నిలవడంలేదన్నారు. దశాబ్ద కాలంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ సమస్యలను పట్టించుకోవడంలేదని, మాజీ సైనిక ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఉచితవైద్య సదుపాయాన్ని కల్పించాలన్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం సత్వరం స్పందించాలన్నారు. కార్యక్రమంలో సంఘం వైస్ ప్రెసిడెంట్ భరత్‌రెడ్డి, ట్రెజరర్ కెఎంకె ప్రసాద్, జాయింట్ సెక్రెటరీ సిహెచ్ రామారావు, అడ్వైజర్ హరిబాబు, మాజీ అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరావు, రిటైర్డ్ బిఎస్ఎఫ్ జవానుబి శివప్రసాద్ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)