- అమ్మ దగ్గరకు వెళ్లిపోవాలని సెల్ఫీ వీడియో
- మృతులిద్దరూ వికలాంగులే
ప్రజాశక్తి - రాజానగరం (తూర్పు గోదావరి) : భార్యను చంపి భర్త బలవన్మరణానికి పాల్పడిన ఘటన తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం పాత తుంగపాడులో ఆదివారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... పాత తుంగపాడుకు చెరందిన కిమిడి లక్ష్మణరావు (32) పుట్టుకతో వికలాంగుడు. ఏడాది క్రితం మానసిక వికలాంగురాలు శ్యామల (30)తో ఆయనకు వివాహం జరిగింది. వీరు జగనన్న కాలనీలో నివాసం ఉంటున్నారు. గతంలో వలంటీర్‌గా పనిచేసిన లక్ష్మణరావు ప్రస్తుతం మందుల దుకాణం నిర్వహిస్తున్నారు. శ్యామల బంధువు కమిడి రాంబాబు కూడా అదే గ్రామంలో ఉంటుండగా శనివారం రాత్రి లక్ష్మణరావు, శ్యామల దంపతులు రాంబాబు ఇంటికి భోజనానికి వెళ్లారు. అనంతరం వారు జగనన్న కాలనీలోని తమ ఇంటికి చేరుకున్నారు. ఆదివారం ఉదయం రాంబాబు లక్ష్మణరావుకు ఫోన్ చేయగా ఎంతకూ తీయకపోవడంతో ఇంటికి వెళ్లి స్థానికులతో కలిసి తలుపులు పగులకొట్టి చూశారు. చేతికి గాయాలతో రక్తపు మడుగులో శ్యామల, ఉరివేసుకుని లక్ష్మణరావు కనిపించారు. సమాచారం అందుకున్న సిఐ ప్రసన్న వీరయ్య గౌడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అమ్మను చూడాలని ఉంది.... లక్ష్మణరావు ఫోన్‌లో సెల్ఫీ వీడియో...
ఘటనా ప్రాంతంలో లక్ష్మణరావు ఫోన్‌లో సెల్ఫీ వీడియోను పోలీసులు గుర్తించారు. ఇటీవల తన తల్లి మృతి చెందిందని, తల్లిని చూడాలని ఉందని, తల్లి వద్దకు వెళ్లిపోవాలని ఉందని లక్ష్మణరావు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. తాను చనిపోతే తన భార్య అనాథ అవుతుందని, అందుకే ఆమెను చంపి, తరువాత తానూ ఉరి వేసుకుంటున్నానని సెల్ఫీ వీడియోలో పేర్కొన్నారు. భార్యకు ముందుగా నిద్రమాత్రలు వేసి అనంతరం ఆమె చేతి నరాలు కట్ చేసి ఉండొచ్చని, తరువాత స్లాబ్‌కు ఉన్న మేకుకు లక్ష్మణరావు చున్నీతో ఉరివేసుకుని ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.







కామెంట్‌లు (0)