లెక్కల్లో సున్నా గురించి ప్రశ్నించిన ఆ చిన్నారి... ఇప్పుడు జాతీయ అవార్డుతో వందకు వంద మార్కులు కొట్టేశాడు. '35 చిన్న కథ కాదు'లో అరుణ్ శర్మ పాత్రలో జీవించిన పోతుల అరుణ్‌దేవ్, 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ బాలనటుడిగా నిలిచాడు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అనంతరం ఈ గౌరవాన్ని అందుకున్న తెలుగు బాలనటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందాడు. నటనలో ప్రత్యేక శిక్షణా గురువు ఎవరూ లేకపోయినా, తల్లి నేర్పిన మెళకువలు, తన స్వయంకృషితో దేశంలోని అత్యున్నత సినీ పురస్కారాన్ని సొంతం చేసుకున్న ఈ పదకొండేళ్ల చిన్నారి ప్రయాణం ఎందరో పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.
విశాఖపట్నంలోని నాయుడుతోటకు చెందిన అరుణ్‌దేవ్ తల్లిదండ్రులు సత్యవాణి, సురేష్ కుమార్. చెల్లెలు బాల త్రిపురసుందరి. చిన్నప్పటి నుంచే సినిమా అతనికి వినోదం కాదు... గురువు. టెలివిజన్‌లో వచ్చే పాత సినిమాలే అతని నటనా పాఠశాల. నటీనటుల హావభావాలు, మాటతీరు, శరీర భాషను గమనిస్తూ తనంతట తానే అభినయాన్ని అలవర్చుకున్నాడు. కరోనా సమయంలో తనకు నచ్చిన సినిమాల డైలాగులు చెబుతూ వీడియోలు రూపొందించడం అతని అభిరుచిగా మారింది.
ఆ అభిరుచే ఆడిషన్ల దారి చూపింది. '35 చిన్న కథ కాదు' చిత్రానికి ముందు జీ తెలుగులో ప్రసారమైన పిల్లల కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 'మాయా ద్వీపం' కార్యక్రమం కోసం వెళ్లిన సందర్భంలో ఈ సినిమా ఆడిషన్‌లో పాల్గొనగా, పది రోజులకే 'అరుణ్ శర్మ' పాత్రకు ఎంపికైనట్లు సమాచారం అందింది. అంతకుముందు 'డ్రామా జూనియర్స్–5'లో రన్నరప్‌గా నిలిచాడు. 'మాయాబజార్' వెబ్‌సిరీస్, రెండు టెలివిజన్ సీరియళ్లు, 'కీడా కోలా' చిత్రంలోనూ నటించాడు. '35 చిన్న కథ కాదు' తర్వాత 'ఆంధ్రా కింగ్' చిత్రంలో హీరో రామ్ చిన్ననాటి పాత్రను పోషించాడు. 'సమ్మర్ హాలిడేస్' చిత్రంలోనూ నటించాడు.
మూవీ షూటింగ్ ఎలా?
'35 చిన్న కథ కాదు' చిత్రంలో నివేదా థామస్, విశ్వదేవ్ రాచకొండ తన తల్లిదండ్రుల పాత్రల్లో నటించారు. వారితో కలిసి నటించే ప్రతి సన్నివేశాన్ని ముందుగానే ఇంట్లో తల్లిదండ్రులతో సాధన చేయడం వల్ల సెట్లో ఎలాంటి భయం అనిపించలేదని చెబుతున్నాడు. పాఠశాలలో ఎలా ఉంటానో, షూటింగ్ స్పాట్‌లో కూడా అలానే ఉండేవాడినని, దర్శకుడు నందకిషోర్ ప్రతి సన్నివేశంలోని భావాన్ని ఎంతో ఓర్పుతో వివరించి చెప్పేవారని గుర్తు చేసుకున్నాడు. నివేదా థామస్ తనను 'అమ్మ' అని పిలవమని చెప్పేదని, అలా పిలవడం వల్ల పాత్రలో మరింత సహజత్వం వచ్చేదని తెలిపాడు. సినిమాలో లెక్కల్లో మార్కులు తక్కువ రావడంతో ఇంటి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుని రైలెక్కే సన్నివేశం మాత్రం చాలా కష్టంగా అనిపించిందని, చుట్టూ పెద్ద సంఖ్యలో జనాలు ఉండటంతో కొంత భయపడినా చివరకు దర్శకుడు కోరుకున్నట్లే ఆ సన్నివేశాన్ని పూర్తి చేశానని చెప్పాడు. తనకు జాతీయ అవార్డు వచ్చిందని తల్లి చెప్పగానే ఆనందంతో కన్నీళ్లు వచ్చాయని, ఆ పురస్కారాన్ని మొదటగా అమ్మకే అంకితం చేస్తున్నానని తెలిపాడు. 'నాకు నటన నేర్పింది, ధైర్యం చెప్పింది, ప్రతి అడుగులోనూ తోడుగా నిలిచింది అమ్మే' అని భావోద్వేగంగా చెప్పాడు.
చదువు... నటన రెండూ
సినిమాల్లో నటిస్తున్నా చదువును మాత్రం ఎప్పుడూ నిర్లక్ష్యం చేయనని అరుణ్‌దేవ్ చెబుతున్నాడు. ప్రతి పరీక్షలో 80లో 60కి పైగా మార్కులు సాధిస్తానని, షూటింగ్‌ల సమయంలో స్నేహితులు క్లాస్ నోట్స్ అందిస్తారని తెలిపాడు. 'పరీక్షల సమయంలో మాత్రం తప్పకుండా పాఠశాలకు వెళ్లి పరీక్షలు రాస్తాను. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, స్నేహితుల ప్రోత్సాహమే నాకు పెద్ద బలం' అని చెప్పాడు. నటనతో పాటు వేణువు, సంగీతం కూడా నేర్చుకుంటున్నానని, భవిష్యత్తులో నటుడిగానే కాకుండా దర్శకుడిగా కూడా రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని తెలిపాడు. మరో రెండు మూడు చిత్రాల్లో నటించిన తర్వాత కొంతకాలం చదువుపైనే దృష్టి సారించి డిగ్రీ పూర్తయ్యాక మళ్లీ సినిమాల్లోకి రావాలనుకుంటున్నట్లు చెప్పాడు. తన అభిమాన కథానాయకుడు ప్రభాస్ అని, ఆయన సినిమా ఒక్కటీ మిస్ కాకుండా చూస్తానని తెలిపాడు.
అభినందనల వెల్లువ
జాతీయ అవార్డుకు ముందే అరుణ్ ప్రతిభకు పలు గుర్తింపులు వచ్చాయి. తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల్లో ఉత్తమ బాలనటుడిగా సత్కారం అందుకున్నాడు. ఆ సందర్భంగా చెప్పిన 'మైనస్ నుంచి గెలుపు వైపు అడుగులు వేస్తుంటే అందరికీ ఎదురయ్యే తొలి మజిలీ సున్నా... ఆ సున్నాను దాటితేనే విజయానికి చేరువవుతాం' అనే డైలాగు పలువురిని ఆకట్టుకుంది. జాతీయ అవార్డు ప్రకటించగానే చిత్రబృందం ప్రత్యేకంగా సంబరాలు నిర్వహించింది. సినీ ప్రముఖులు, దర్శకులు, నటీనటులు, చిత్రంలో తల్లి పాత్ర పోషించిన నివేదా థామస్‌తో పాటు అనేక మంది అభినందనలు తెలిపారు. కొడుకు విజయం గురించి తండ్రి సురేష్ కుమార్ చెప్పిన మాటలు ప్రతి తల్లిదండ్రిని ఆలోచింపజేస్తాయి. 'ఇంతకుముందు నేను ఎక్కడికి వెళ్లినా ఫలానా వాళ్ల అబ్బాయివా అని గుర్తించేవారు. ఇప్పుడు నా కొడుకు వల్ల నాకు తండ్రిగా గుర్తింపు వస్తోంది. అంతకంటే గొప్ప ఆనందం ఇంకేముంటుంది' అని ఆయన భావోద్వేగంగా చెప్పారు.
'35 చిన్న కథ కాదు' అన్న మాట నిజమే! 35 చిన్నదే కావొచ్చు కాని అది చెప్పిన సందేశం మాత్రం ఎంతో గొప్పది. పిల్లలకు అర్థం కాని చదువులు, వాటిని అర్థమయ్యేలా చెప్పలేని బోధనా విధానం, ప్రశ్నలు అడిగే పిల్లల ఆలోచనలను గౌరవించాల్సిన అవసరాన్ని ఈ సినిమా హృదయానికి హత్తుకునేలా ఆవిష్కరించింది. అరుణ్‌దేవ్‌కు జాతీయ అవార్డు తెచ్చి పెట్టింది. పిల్లల కలలకు కుటుంబం అండగా నిలిస్తే వారు ఎంత ఎత్తుకైనా ఎదగగలరని అరుణ్‌దేవ్ మరోసారి నిరూపించాడు.







కామెంట్‌లు (0)