ఈసారి భారతీయ సినిమా ఆస్కార్ ప్రయాణంలో రెండు భిన్నమైన కథలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్ర గ్రామీణ జీవితం, అక్కడి శతాబ్దాల నాటి ‘గొంధల్’ సంప్రదాయాన్ని కథగా మలిచిన మరాఠీ చిత్రం ‘గొంధల్’ను భారత్ అధికారికంగా 99వ అకాడమీ అవార్డుల అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి ఎంపిక చేసింది. మరోవైపు నాగాలాండ్‌లోని కోన్యాక్ సమాజం, వారి జీవన విధానం, మారుతున్న విశ్వాసాలను చూపించిన ‘అంగ్’ టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ప్లాట్‌ఫామ్ పోటీలో విజేతగా నిలిచి ఆస్కార్ పరిశీలనకు అర్హత సాధించింది. ఒకటి భారత అధికారిక ప్రవేశికగా, మరొకటి అంతర్జాతీయ చలనచిత్రోత్సవ విజయం ద్వారా అకాడమీ పరిశీలనలోకి రావడం ఈసారి ప్రత్యేకత. రెండు చిత్రాలూ భారతదేశంలోని ప్రధాన స్రవంతికి దూరంగా ఉన్న ప్రాంతాలు, సంస్కృతులు, మనుషుల జీవితాలను ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తున్నాయి. అందుకే ఈ రెండు సినిమాల ఆస్కార్ ప్రయాణం కంటే వాటి వెనుక ఉన్న భారతీయ కథలే మరింత ఆసక్తికరమైన అంశంగా నిలుస్తున్నాయి.
గొంధల్... ఒక రాత్రి, ఎన్నో జీవితాలు
సంతోష్ దావఖర్ రచించి, దర్శకత్వం వహించిన ‘గొంధల్’ మహారాష్ట్ర గ్రామీణ నేపథ్యంలో సాగే థ్రిల్లర్. సినిమాలోని కథ ఒక రాత్రి జరిగే సంప్రదాయ గొంధల్ కార్యక్రమం చుట్టూ తిరుగుతుంది. ‘గొంధల్’ అనేది మహారాష్ట్రలో శతాబ్దాలుగా కొనసాగుతున్న జానపద-ఆధ్యాత్మిక సంప్రదాయం. ఇందులో భక్తిగీతాలు, సంగీతం, నృత్యం, దేవతల ఆరాధన వంటి అంశాలు ఉంటాయి. దర్శకుడు ఈ సంప్రదాయాన్ని కేవలం నేపథ్యంగా ఉపయోగించకుండా కథలోని ప్రధాన భాగంగా మలిచాడు. కొత్తగా పెళ్లైన దంపతులు, వారి కుటుంబం, వారి చుట్టూ ఉన్న వ్యక్తుల సంబంధాలు, కోరికలు, అనుమానాలు, మోసాలు, కుట్రలు ఆ రాత్రి జరిగే కార్యక్రమంతో కలుస్తాయి. బయటికి భక్తి, సంప్రదాయం, ఉత్సవం కనిపిస్తుంటే లోపల వ్యక్తుల జీవితాల్లో మరో కథ నడుస్తుంటుంది. ఈ రెండు ప్రపంచాల మధ్య ఏర్పడే వ్యత్యాసమే చిత్రానికి ప్రధాన ఉత్కంఠను ఇస్తుంది.
కథలో సుమన్ అనే మహిళ తన వివాహ జీవితంతో అసంతృప్తిగా ఉంటుంది. ఆమె జీవితంలో గొంధల్ కళాకారుడు సాహెబ్ ప్రవేశిస్తాడు. అతనిపై ఏర్పడిన ఆకర్షణతో సుమన్ తన జీవితాన్ని మార్చుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో కుటుంబ సంబంధాలు, నమ్మకాలు, వ్యక్తిగత ప్రయోజనాలు ఒకదానితో ఒకటి ఢీకొంటాయి. కథ ముందుకు వెళ్లేకొద్దీ సాధారణంగా కనిపించే కుటుంబ సంబంధాల వెనుక దాగి ఉన్న కోరికలు, భయాలు, మోసాలు బయటపడతాయి. ఒకే రాత్రిలో కథను నడపడం వల్ల సమయం క్రమంగా గడిచే కొద్దీ ఉత్కంఠ పెరుగుతుంది. సంప్రదాయ కార్యక్రమం కొనసాగుతున్నంతసేపూ కథలోని మరో అంతర్గత సంఘర్షణ కూడా తీవ్రతరం అవుతుంది. అందువల్ల ‘గొంధల్’ ఒక జానపద కళను చూపించే సినిమా మాత్రమే కాదు; సంప్రదాయం, వ్యక్తిగత స్వేచ్ఛ, వివాహ బంధం, కోరిక, నైతికతల మధ్య జరిగే సంఘర్షణను థ్రిల్లర్ రూపంలో చెప్పే ప్రయత్నం.
సంప్రదాయానికి ఆధునిక సినిమా భాష
‘గొంధల్’ నిర్మాణంలో సంప్రదాయాన్ని సహజంగా తెరపైకి తీసుకురావడం ప్రధాన సవాలుగా నిలిచింది. రాత్రివేళ జరిగే గొంధల్ కార్యక్రమం, డప్పుల మోత, నృత్యం, అగ్ని, జనసమూహం, గ్రామీణ వాతావరణం కథలోని మానసిక ఉద్రిక్తతతో కలిసి పనిచేస్తాయి. ఛాయాగ్రహణంలో వెలుగు-చీకట్లను ఉపయోగించడం ద్వారా కథలోని గంభీరత ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపుతుంది. ఎడిటింగ్ కూడా ఆ రాత్రి సాగుతున్న వేడుకతో పాటు కథలోని పరిణామాలను సమాంతరంగా నడిపే విధంగా రూపొందించారు. ఒక సన్నివేశాన్ని సుమారు 25 నిమిషాల నిడివితో చిత్రీకరించడానికి ఏడు రోజుల సమయం పట్టిందని ఎడిటర్ ఆశిష్ మ్హాత్రే చెప్పారు. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించడం మరో ప్రత్యేకత.
సంతోష్ దావఖర్‌కు గొంధల్ సంప్రదాయంతో వ్యక్తిగత అనుబంధం ఉంది. చిన్నప్పటి నుంచే ఈ ప్రదర్శనలను చూస్తూ పెరిగిన అనుభవం కథకు ప్రేరణగా మారింది. అందుకే సినిమాలో సంప్రదాయాన్ని బయటివారి చూపుతో కాకుండా, దాని లోపలి వాతావరణాన్ని అర్థం చేసుకున్న వ్యక్తి దృష్టితో చూపించే ప్రయత్నం కనిపిస్తుంది. దావఖర్‌కు 2025లో జరిగిన 56వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవంలో ఉత్తమ దర్శకుడి సిల్వర్ పీకాక్ పురస్కారం లభించింది. ఇప్పుడు 33 చిత్రాల నుంచి ‘గొంధల్’ను భారత అధికారిక ప్రవేశికగా ఎంపిక చేయడం ఆ చిత్రానికి మరో కీలక గుర్తింపు.
2
అంగ్... మారిపోతున్న ప్రపంచంలో ఒక తండ్రి
‘అంగ్’ నాగాలాండ్‌కు చెందిన దర్శకుడు థేజా రియో రూపొందించిన తొలి ఫీచర్ చిత్రం. 1960ల ప్రారంభంలో నాగాలాండ్ నేపథ్యంలో, కోన్యాక్ భాషలో కథ సాగుతుంది. ‘అంగ్’ అనే పదానికి కోన్యాక్ సమాజంలో ‘గ్రామ నాయకుడు’ అని అర్థం. కథలో అంగ్‌బా అనే వృద్ధ నాయకుడు అనారోగ్యంతో ఉన్న భార్య, మాట్లాడలేని చిన్న కుమారుడితో కలిసి దాదాపు ఖాళీ అయిపోయిన గ్రామంలో మిగిలిపోతాడు. అతని గ్రామం, అతని చుట్టూ ఉన్న సమాజం, అతను నమ్మిన జీవన విధానం అన్నీ మారిపోతాయి. పాత సంప్రదాయ విశ్వాసాల స్థానంలో క్రైస్తవ మత ప్రభావం పెరుగుతోంది. కొత్త ప్రపంచం గ్రామంలోకి వస్తోంది. కానీ అంగ్‌బా మాత్రం తన పూర్వీకుల జీవన విధానాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండడు. ఈ పరిస్థితిలో తండ్రీకొడుకుల మధ్య ఉన్న బంధం, ఒక మనిషికి తన ఇంటితో ఉన్న అనుబంధం, ఒక సమాజం తన గతాన్ని కోల్పోతున్నప్పుడు కలిగే బాధ కథలో ప్రధాన అంశాలుగా మారతాయి.
‘అంగ్’ కథలో పెద్ద రాజకీయ సంఘటనల కంటే ఒక చిన్న కుటుంబం అనుభవించే మార్పుకే ప్రాధాన్యం ఉంది. అంగ్‌బా తన ప్రపంచం ముగిసిపోతోందని గ్రహించినా దానిని వదులుకోలేడు. మరోవైపు అతని కుమారుడు మారుతున్న కాలానికి ప్రతీకగా కనిపిస్తాడు. ఈ తండ్రి-కొడుకు సంబంధం ద్వారా దర్శకుడు సంప్రదాయం, విశ్వాసం, కుటుంబం, గుర్తింపు, మార్పు వంటి పెద్ద ప్రశ్నలను ముందుకు తెచ్చాడు. అమెరికన్ మిషనరీ పాత్రలో బాఫ్టా అవార్డు విజేత డగ్లస్ హెన్షాల్ నటించగా, ఇతర ముఖ్య పాత్రల్లో స్థానిక నాగాలాండ్ నటీనటులు ఉన్నారు. ఇది నాగాలాండ్ గురించి బయటివారు చెప్పిన కథలా కాకుండా, ఆ ప్రాంతం నుంచి వచ్చిన దర్శకుడు తన నేల, తన ప్రజలు, తన సంస్కృతిని చూసిన దృష్టితో చెప్పిన కథగా నిలుస్తుంది.
16 ఎంఎం చిత్రపటం... స్థానికుల ప్రపంచం
‘అంగ్’ నిర్మాణంలో 16 ఎంఎం ఫిల్మ్‌ను ఉపయోగించారు. డిజిటల్ కెమెరాల కాలంలో 1960ల నాగాలాండ్ వాతావరణాన్ని పాత ఫొటోల జ్ఞాపకాన్ని కలిగించేలా చూపించేందుకు ఫిల్మ్ స్టాక్‌ను ఎంచుకున్నారు. సినిమా కోసం పాత నాగాలాండ్ గ్రామాన్ని పునర్నిర్మించారు. ఇళ్లు, గ్రామ నిర్మాణం, ఉపయోగించే వస్తువులు, దుస్తులు, చుట్టుపక్కల వాతావరణం వంటి అంశాల విషయంలో స్థానికుల సహకారం తీసుకున్నారు. ఈ చిత్రానికి నాన్సీ నిసా బెసో, థేజా రియో నిర్మాతలు.
2026 టొరంటో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ‘అంగ్’కు ప్రపంచ ప్రీమియర్ జరిగింది. అక్కడి ప్లాట్‌ఫామ్ పోటీలో అది 12 చిత్రాల్లో పోటీ చేసిన ఏకైక భారతీయ చిత్రం. సెప్టెంబర్ 20న ప్లాట్‌ఫామ్ అవార్డును గెలుచుకుంది. ప్లాట్‌ఫామ్ విభాగం ప్రత్యేకమైన దర్శకుల దృష్టి, కొత్త కథన పద్ధతులకు ప్రాధాన్యం ఇచ్చే పోటీ విభాగం. 2026 నుంచి ఆ విభాగం విజేతకు అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ ఆస్కార్ విభాగంలో పరిశీలనకు ప్రత్యేక అర్హత లభించే నిబంధన అమల్లోకి వచ్చింది. అందువల్ల ‘అంగ్’ భారత అధికారిక ప్రవేశిక కాకపోయినా, ఆస్కార్ పరిశీలనకు చేరిన రెండో భారతీయ చిత్రంగా నిలిచింది.
ఈ రెండు సినిమాలను భారతదేశంలోని రెండు భిన్న సాంస్కృతిక ప్రపంచాలుగా చూడవచ్చు. ఒకటి మహారాష్ట్రలోని ఒక గ్రామీణ వేడుకలో మనుషుల అంతర్గత జీవితాలను చూపిస్తే, మరొకటి నాగాలాండ్‌లో కనుమరుగవుతున్న ఒక గ్రామం ద్వారా ఒక సమాజం మారుతున్న చరిత్రను చెబుతుంది. దేశంలోని ప్రాంతీయ భాషలు, జానపద సంప్రదాయాలు, గిరిజన సంస్కృతులు కూడా ప్రపంచ ప్రేక్షకులను చేరగలవన్న విషయాన్ని ఈ రెండు చిత్రాల ప్రయాణం చూపిస్తోంది.
- ప్రజాశక్తి సినిమా డెస్క్









కామెంట్‌లు (0)