ఆదివారం, 18 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

వెండితెరపై ఉత్తరాంధ్ర జానపదం

1 గంట క్రితం

వెండితెరపై ఉత్తరాంధ్ర జానపదం image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026, 09:15 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం

ఉత్తరాంధ్ర జానపద కళాకారుల జీవితాలు, వారి పాటలు ఇప్పుడు మరోసారి వెండితెరపై చర్చనీయాంశమవుతున్నాయి. గరివిడి లక్ష్మి జీవితం ఆధారంగా రూపొందిన సినిమా ఈ ప్రాంతపు జానపద వైభవాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తుండగా, వెంకటేశ్‌ నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో ‘రంగమెల్లి పోయానే నారాయణమ్మ’ పాటను ఉపయోగిస్తున్నారనే సమాచారం దిమిలి పొడుగు మనిషి ప్రస్థానాన్ని మళ్లీ గుర్తుచేస్తోంది. ఒకప్పుడు పండుగలు, జాతరలు, గ్రామీణ వేడుకల్లో మార్మోగిన ఈ పాటలు ఇప్పుడు సినిమాల ద్వారా కొత్త తరాలకు చేరుతున్నాయి. అయితే ఉత్తరాంధ్ర జానపదానికి వెండితెరపై గుర్తింపు రావడం ఇప్పుడే మొదలైన పరిణామం కాదు. గతంలోనూ పవన్‌ కల్యాణ్‌ నటించిన చిత్రాలతోపాటు పలు తెలుగు సినిమాల్లో జానపద గీతాలు, ప్రాంతీయ బాణీలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ పాటల వెనుక ఉన్న చరిత్ర, కళాకారుల కృషి, ప్రజల జీవనానుభవాలను పరిశీలిస్తే ఉత్తరాంధ్ర సాంస్కృతిక సంపదలోని వైవిధ్యం అర్థమవుతుంది.

తెరపై గరివిడి లక్ష్మి జీవితం

విజయనగరం జిల్లా గరివిడి ప్రాంతానికి చెందిన రెడ్డి విజయలక్ష్మి జానపద కళాకారిణిగా ‘గరివిడి లక్ష్మి’ పేరుతో గుర్తింపు పొందారు. 1994లో బుర్రకథ చెప్పటం ప్రారంభించిన ఆమె పదివేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారని చెబుతారు. బుర్రకథను రంజింపజేయటానికి మధ్యమధ్యలో ఆమె పాడే ‘నల్ల జీలకర్ర మొగ్గ’, ‘అత్తరు సాయిబో రారా’, ‘కోసింది కొయగూర’, ‘మందులోడా.. ఓరి మాయలోడా’ వంటి పాటలు ఆమెకు విస్తృత గుర్తింపు తెచ్చాయి. జానపద గీతాలతోపాటు బుర్రకథల ద్వారా కథను చెప్పడం, పాటతో భావాన్ని పలికించడం, తనదైన ప్రదర్శనా శైలితో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఆమె కళలోని ప్రత్యేకత. ఆనంది ప్రధాన పాత్రలో, గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వంలో రూపొందిన ‘గరివిడి లక్ష్మి’ చిత్రానికి చరణ్‌ అర్జున్‌ సంగీతం అందించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో ‘నల్ల జీలకర్ర మొగ్గ’, ‘కోసింది కొయగూర’, ‘కొండ కోన కోరసు పాడే’ వంటి పాటలు గ్రామీణ జానపద వాతావరణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఒక కళాకారిణి జీవితాన్ని కథాంశంగా తీసుకోవడం ద్వారా ఆమె పాటలతోపాటు, ఆ కళను నిలబెట్టిన జీవన నేపథ్యాన్ని కూడా ప్రేక్షకులకు పరిచయం చేసే అవకాశం ఏర్పడింది.

ఇదే సంప్రదాయంలో దిమిలి పొడుగు మనిషి ప్రస్థానం కూడా ప్రత్యేకంగా ప్రస్తావించదగినది. ఆయన అసలు పేరు సురమళ్ల సంజీవరావు. 1970–74 మధ్యకాలంలో ఆయన పాడిన ప్రైవేటు పాటలు ఎల్‌పీ రికార్డుల రూపంలో వెలువడి ప్రజాదరణ పొందాయి. ‘రంగమెల్లి పోయానే నారాయణమ్మ’ వంటి పాటలు దసరా, వినాయక చవితి పందిళ్లలోనూ, ఇతర గ్రామీణ వేడుకల్లోనూ వినిపించేవి. స్థానిక యాస, హాస్యం, చమత్కారాన్ని తన పాటల్లో మేళవించిన ఆయన ఉత్తరాంధ్రతోపాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పుడు వెంకటేశ్‌ నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రంలో ఆయన పాటను ఉపయోగించటం దిమిలి పొడుగు మనిషి ప్రస్థానాన్ని మళ్లీ గుర్తుచేస్తోంది.

గతంలోనూ ఎన్నో పాటలు

ఉత్తరాంధ్ర జానపద గీతాలకు వెండితెరపై గుర్తింపు రావడం ఇటీవలి పరిణామం కాదు. తెలుగు సినిమాల్లో ఎన్నో ఏళ్లుగా జానపద బాణీలు, స్థానిక పలుకుబడితో కూడిన పాటలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘ఖుషి’లోని ‘బై బైయ్యే బంగారు రమణమ్మ’, ‘జానీ’లోని ‘నువ్వు సారా తాగుడు మానురన్నో’ వంటి పాటలు జానపద ధోరణిని గుర్తుచేస్తాయి. ‘తమ్ముడు’లోని ‘తాటిచెట్టెక్కలేవు’ పాట కూడా ఈ నేపథ్యంలో ప్రస్తావనకు వస్తుంది. ఉత్తరాంధ్ర ప్రాంతీయతను ప్రతిబింబించే పాటల్లో ఆర్‌.పి. పట్నాయక్‌ సంగీత దర్శకత్వంలో వచ్చిన ‘నువ్వు నేను’ చిత్రంలోని ‘గాజువాక పిల్లా మేం గాజులోళ్లం కాదా’ ప్రత్యేకంగా నిలుస్తుంది. స్థానిక పదజాలం, పలుకుబడి, జానపద లయతో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ప్రజాకవి వంగపండు ప్రసాదరావు పాటల ప్రస్థానం జానపదానికి, ప్రజా ఉద్యమాలకు మధ్య ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఆయన రచించిన ‘ఏం పిల్లడో ఎల్దుమొస్తవా’ ప్రజా ఉద్యమాల్లో ప్రాచుర్యం పొందిన గీతం. ఈ పాట ‘అర్ధరాత్రి స్వాతంత్ర్యం’ చిత్రంలోనూ వినిపించింది. తర్వాత ‘మగధీర’లో కొన్ని చరణాలు వినిపించాయి. మరోవైపు, ‘అల.. వైకుంఠపురములో’ చిత్రంలోని ‘సిత్తరాల సిరపడు’ శ్రీకాకుళం ప్రాంతపు జానపద వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ గుర్తింపు పొందింది. బాడ సూరన్న గాత్రం ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘పలాస 1978’లోని ‘నాదీ నక్కిలీసు గొలుసు’, ‘ధమాకా’లోని ‘పల్సరు బైక్ మీద రాను బావ’, ‘కోట బొమ్మాళి పీఎస్‌’లోని ‘లింగి లింగి లింగిడి’ పాటలు కూడా జానపద సంగీతాన్ని కొత్త తరాలకు చేరువ చేశాయి. వీటిలో కొన్ని ప్రజల్లో ముందే ప్రచారంలో ఉన్న పాటలకు సినిమా రూపాలు కాగా, మరికొన్ని ప్రాంతీయ పదజాలం, పాత బాణీలు, జానపద శైలిని ఆధారంగా చేసుకుని రూపొందినవి. ముఖ్యంగా ‘లింగి లింగి లింగిడి’ పాట నేపథ్యంలో మూల గీతాన్ని పాడిన కళాకారులకు గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం చర్చకు వచ్చింది. జానపద గీతాలను సినిమాల్లో ఉపయోగించడం వాటికి కొత్త జీవితాన్ని ఇస్తుంది. అదే సమయంలో వాటిని సేకరించినవారు, పాడినవారు, కొత్త రూపంలో అందించినవారి కృషిని గుర్తించడం కూడా అవసరం.

మట్టి మనుషుల కథలు ఎన్నో...

ఉత్తరాంధ్రలో జానపద కళాకారుల జీవితాలకే కాకుండా, ప్రజల పోరాటాలకు సంబంధించిన కథలకూ కొదవలేదు. భూమి కోసం, హక్కుల కోసం పోరాడిన వీర గున్నమ్మ వంటి మహిళలు, సామాజిక అన్యాయాలను ఎదుర్కొన్న ప్రజలు, గ్రామీణ సమాజంలో మార్పుల కోసం ఉద్యమించిన సామాన్యుల జీవితాల్లో బలమైన కథాంశాలున్నాయి. అల్లూరి సీతారామరాజు పోరాటంలో వెన్నుదన్నుగా నిలిచిన గంటం దొర, మల్లు దొర, ఎండు పడాల్‌ వంటి మన్యం వీరుల జీవితాలతోపాటు చరిత్రలో తగిన గుర్తింపు పొందని స్థానిక పోరాట యోధుల గాథలనూ వెలికితీయాలి. జానపద కళాకారుల ప్రస్థానాలు, గ్రామీణ మహిళల సంఘర్షణలు, ప్రజా ఉద్యమాల నేపథ్యాలను లోతుగా పరిశోధించి తెరకెక్కిస్తే తెలుగు సినిమాకు కొత్త కథా ప్రపంచం అందుబాటులోకి వస్తుంది. దీనికోసం విశ్వవిద్యాలయాలు, సాంస్కృతిక సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, పరిశోధకులు సమష్టిగా పనిచేయాలి. పాత పాటలను సేకరించడం, వాటి మూలాలను గుర్తించడం, కళాకారుల జీవితాలను నమోదు చేయడం, ఆడియో, వీడియో రూపాల్లో భద్రపరచడం వంటి పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి. జానపద గీతాలను తెరపై వినిపించడంతోపాటు, వాటి వెనుక ఉన్న ప్రజల జీవితాలు, కళాకారుల అనుభవాలు, చారిత్రక పోరాటాలను ఆవిష్కరించినప్పుడే ఉత్తరాంధ్ర సాంస్కృతిక వారసత్వానికి మరింత విస్తృత గుర్తింపు లభిస్తుంది.

- సుజయ సాహితి

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్