mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ELNINO – మళ్లీ మొదలైన ఎల్ నినో

5 రోజుల క్రితం

EL NINO – El Niño has started again.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 13, 2026, 12:08 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఈ వర్షాకాలంలో మరింత బలపడే అవకాశం

  • భారత వాతావరణ శాఖ వెల్లడి

న్యూఢిల్లీ : పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం ఎల్ నినో పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండి) శుక్రవారం తెలిపింది. రానున్న వర్షాకాలం (నైరుతి రుతుపవనాల కాలం)లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ నెలకు సంబంధించిన ఎల్ నినో సదరన్ ఓషిల్లేషన్ (ఇఎన్ఎస్), ఇండియన్ ఓషన్ డైపోల్ (ఐఒడి) బులిటెన్లో ఈ మేరకు వివరాలను వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్ర మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగాయని, ఇవి ఎల్ నినో ఏర్పడడానికి కావాల్సిన స్థాయిని దాటిపోయాయని పేర్కొంది. దీనికనుగుణంగానే వాతావరణంలో కూడా మార్పులు వచ్చాయని తెలిపింది. సముద్రం, గాలి కలిసి పనిచేసే తీరును బట్టి చూస్తే, ప్రస్తుతం భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఎల్ నినో లక్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ‘మాన్సూన్ మిషన్ కపుల్డ్ ఫోర్కాస్ట్ సిస్టమ్’ (ఎంఎంసిఎఫ్ఎస్) అంచనాల ప్రకారం, ఈ వర్షాకంలో ఎల్ నినో పరిస్థితులు: ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. వాస్తవానికి 2026 జూన్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఈ పరిమితిని దాటేశాయని ఐఎండి తన బులెటిన్లో పేర్కొంది. ఈ వాతావరణ మార్పును కొలిచే ‘నినో 3.4 ఇండెక్స్’ మూడు నెలల సగటు ఉష్ణోగ్రత +0.5సి కంటే పైకి రికార్డ్ అయ్యిందని తెలిపింది. ఇది ఎల్ నినో ప్రారంభమైంది అనడానికి సంకేతమని స్పష్టం చేసింది. అంతేకాదు సముద్ర పైభాగంలోనే కాకుండా, లోపలి పొరల్లోనూ ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని, రానున్న నెలల్లో ఈ వేడి నీరు పైకి వచ్చి ఎల్ నినోను మరింత బలోపేతం చేస్తుందని ఐఎండి గుర్తించింది.

భారత్ పై ఎల్ నినో ప్రభావం ఎంత ?

ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రంలో వేడి పెరడం వల్ల వచ్చే ఒక సహజమైన వాతావరణ మార్పు. భారతదేశానికి సంబంధించి చూసుకుంటే, 2000వ సంవత్సరం తర్వాత అంటే 2002, 2009, 2015, 2023లో ఎల్ నినో తరహా వాతావరణ మార్పులు వచ్చాయి. సాధారణంగా ఎల్ నినో సమయంలో దేశంలో రుతుపవనాలు బలహీనపడడం, తక్కువ వర్షాలు కురవడం, ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం, వర్షాలు లేకుండా పొడి వాతావరణం ఏర్పడడం లాంటివి  జరుగుతుంటాయి. మరీ ముఖ్యంగా కొన్ని సంవత్సరాలపాటు కరవు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే భారతదేశ వర్షపాతాన్ని కేవలం ఎల్ నినో ఒక్కటే ప్రభావితం చేయదని ఐఎండి స్పష్టం చేసింది. ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో ‘ఇండియన్ ఓషన్ డైపోల్’ (ఐఒడి) సాధారణ స్థితిలోనే ఉందని తెలిపింది. అందువల్ల ఎల్ నినో ప్రభావాన్ని తగ్గించడంలో, పెంచడంలో దీని పాత్ర చాలా పరిమితం అని పేర్కొంది. పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న పరిస్థితులను తాము నిరంతరం గమనిస్తూ, ప్రతి నెలా తాజా సమాచారాన్ని అందిస్తామని ఐఎండి పేర్కొంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్