బుధవారం, 08 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నేడు ఖగోళంలో అరుదైన ఘటన..

5 గంటల క్రితం

sunlight
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 05:56 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

నాసా : భూమిపై దాదాపు 99 శాతం మంది (సుమారు 820కోట్ల మంది ప్రజలు) ఒకే సమయంలో సూర్యకాంతి లేదా సంధ్యవెలుగును చూసే అరుదైన ఖగోళ ఘటన బుధవారం చోటుచేసుకుంది. భూమి తన అక్షంపై 23.5 డిగ్రీల వంగి ఉండటం, ఉత్తరార్థగోళంలో ప్రస్తుతం వేసవి కాలం కొనసాగుతుండటం వల్ల ఈ ప్రత్యేక పరిస్థితి ఏర్పడినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాలమానం ప్రకారం 11.10గంటలకు ప్రపంచ జనాభాలో అత్యధిక జనాభా ఉన్న ప్రాంతాలు ‘పగటి వెలుగు’, ‘సంధ్యవెలుగు’లో ఉండనున్నాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.40గంటలకు ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇది ప్రకృతి సహజంగా ఏర్పడే ఖగోళ పరిణామమే అయినప్పటికీ, ఒకే సమయంలో అత్యధిక శాతంమంది సూర్యకాంతిని లేదా సంధ్య వెలుగును చూడటం అరుదైన విషయంగా ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.


ఆ సమయంలో ప్రపంచ జనాభాలో సుమారు 83 శాతం మంది పూర్తి పగటి వెలుగులో ఉండగా, మరో 7 శాతం మంది సివిల్ ట్విలైట్, 6 శాతం మంది నాటికల్ ట్విలైట్, 3 శాతం మంది ఆస్ట్రానమికల్ ట్విలైట్‌లో ఉన్నారు. అంటే వీరికి సూర్యుడు నేరుగా కనిపించకపోయినా, వాతావరణంలో వ్యాపించిన సహజ కాంతి కారణంగా వెలుతురు కనిపిస్తుంది. ప్రపంచ జనాభాలో కేవలం ఒక శాతం మంది మాత్రమే పూర్తిగా రాత్రి చీకటిలో ఉంటారు. ఈ సమయంలో ప్రధానంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాలు, అంటార్కిటికా, అలాగే పసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పూర్తిగా రాత్రి నెలకొంది. మిగిలిన ప్రపంచంలోని అధిక జనాభా ఉన్న ప్రాంతాలన్నీ సూర్యకాంతి లేదా సంధ్యవెలుగును పొందాయి. ఆసియా, యూరప్, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలోని ఎక్కువ ప్రాంతాల్లో ప్రజలు వెలుతురులోనే ఉన్నారు.


అయితే జులై 8న మాత్రమే చోటుచేసుకోనున్న అరుదైన విషయంగా సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతోందని, కానీ ఇది సరైన సమాచారం కాదని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. ప్రతి సంవత్సరం మే మధ్య నుంచి జూలై మధ్య వరకు సుమారు రెండు నెలల కాలంలో ప్రతిరోజూ కొన్ని నిమిషాల పాటు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుందని, జులై తొలి వారంలో ఈ ప్రభావం అత్యధిక స్థాయికి చేరుతుందని వివరించారు. అందువల్ల ఇది ఒక్కరోజు మాత్రమే సంభవించే విశేషం కాకుండా, భూమి భ్రమణం, భూమి తన అక్ష‍ంపై వంగి ఉండటం, సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమణం వంటి ఖగోళ కారణాల వల్ల ఏర్పడే సహజ ప్రక్రియ అని తెలిపారు.


అయితే "ప్రపంచ జనాభాలో 99 శాతం మంది ఒకేసారి సూర్యుడిని చూస్తారని, ఈ లెక్కల్లో సంధ్యవెలుగు కూడా భాగమేనని ఖగోళ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సూర్యుడు హోరైజన్‌కు దిగువన ఉన్నప్పటికీ భూమి వాతావరణంలో కాంతి వ్యాపించడం వల్ల కనిపించే వెలుతురును కూడా ఇందులో పరిగణిస్తారు. దీంతో నేరుగా సూర్యకాంతిలో ఉన్నవారి శాతం సుమారు 83 మాత్రమే కాగా, మిగిలిన వారు వివిధ దశల సంధ్యవెలుగును చూస్తారని తెలిపారు. అయినప్పటికీ ఒకే సమయంలో భూమిపై దాదాపు మొత్తం జనాభా వెలుతురులో ఉండటం ఖగోళ శాస్త్ర పరంగా అత్యంత అరుదైన ఖగోళ పరిణామంగా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్