హెటిరో కంపెనీ వ్యర్థ రసాయన జలాలే కారణమని మత్స్యకారుల ఆరోపణ
యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి : సిపిఎం
ప్రజాశక్తి- నక్కపల్లి (అనకాపల్లి) : అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట పంచాయతీ బోయపాడు సముద్రతీరంలో భారీగా చేపలు మృత్యువాత పడ్డాయి. అవి శనివారం సముద్రపు ఒడ్డుకు కొట్టుకురావడంతో వాటిని చూసిన మత్స్యకారులు తీవ్ర ఆందోళన చెందారు. రాజయ్యపేట పంచాయతీ మాజీ వార్డు సభ్యులు మైలపల్లి మహేష్ బాబు తదితర మత్స్యకారులు మాట్లాడుతూ హెటిరో కంపెనీ వ్యర్థ రసాయన జలాలను శుద్ధి చేయకుండా సముద్రంలోకి వదలడం వల్లే భారీగా చేపలు మృతి చెందాయని ఆరోపించారు. పది నుంచి 15 టన్నుల చేపలు చనిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. బోయపాడు సముద్ర తీరం నుండి సుమారు నాలుగైదు కిలోమీటర్ల మేర మృతి చెందిన చేపలు ఒడ్డుకు చేరాయని, ఇలా అయితే మత్స్యకారులు ఎలా జీవనం సాగిస్తారని ఆవేదన వెలిబుచ్చారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో చేపల వేట సాగకపోవడంతో ఈ ప్రాంత మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి జీవనం సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. చేపలు చనిపోయిన ప్రాంతాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎం.అప్పలరాజు పరిశీలించారు. చేపలు చనిపోవడానికి కారణమైన హెటిరో డ్రగ్స్ యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఆర్‌డిఒ ఎదుట నిరసన
ఘటనా స్థలాన్ని ఆర్‌డిఒ వివి.రమణ పరిశీలించారు. ఇటువంటి సంఘటనలు తరుచూ జరుగుతున్నా ప్రభుత్వాధికారులు సరైన రీతిలో స్పందించడం లేదంటూ మత్స్యకారులు ఆయన ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్‌డిఒ మాట్లాడుతూ తాజా ఘటనపై నిష్పాక్షికంగా దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.
హోంమంత్రి అనిత ఆరా
చేపల మృత్యువాత ఘటనపై రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని, కారణాలను శాస్త్రీయంగా పరిశీలించి పూర్తి నివేదిక అందజేయాలని వారిని ఆదేశించారు.









కామెంట్‌లు (0)