ఇంటి బాల్కనీలో లేదా చిన్న కుండీలో బిర్యానీ ఆకు మొక్కను చాలా సులభంగా పెంచుకోవచ్చు. మొక్కను పెంచేటప్పుడు కుండీలోని మట్టిలో ఎప్పుడూ నీరు నిలవకూడదు. పాటింగ్ మిక్స్ తయారు చేసే సమయంలో మట్టితో పాటు ఇసుక, కొకోపీట్, నాణ్యమైన వర్మి కంపోస్ట్ కలుపుకోవాలి. ఒకవేళ మట్టి నీటిని ఎక్కువగా నిల్వ ఉంచుకుంటున్నట్లయితే, డ్రైనేజ్ కోసం అందులో కొద్దిగా ఇసుక కలపాలి. మొదట్లో ఈ మొక్కను పెంచడానికి దాదాపు 12 అంగుళాల సైజ్ ఉన్న కుండీని ఎంచుకోవాలి. మొక్క పెరిగే కొద్దీ 15 అంగుళాలు లేదా అంతకంటే పెద్ద కుండీకి మార్చుకోవచ్చు.
బిర్యానీ ఆకు మొక్కను కుండీలో నాటేటప్పుడు ముందుగా తయారు చేసుకున్న మట్టి మిశ్రమాన్ని ఒక లేయర్లా వేయాలి.
నర్సరీ కవర్ నుంచి మొక్కను జాగ్రత్తగా, వేర్లకు ఎలాంటి హాని జరగకుండా విడదీసి కుండీ మధ్యలో ఉంచాలి. చుట్టూ మట్టి వేసి చేత్తో సున్నితంగా నొక్కి, తగినన్ని నీళ్లు పోయాలి.
మొక్కలకు మంచి వెలుతురు, ఎండ చాలా అవసరం. ఎండ బాగా తగిలే చోట కుండీ ఉంచాలి.
బాల్కనీ, టెర్రస్ లేదా ఇంట్లో ఎక్కువసేపు ఎండ పడే ప్రాంతం ఈ మొక్క ఎదుగుదలకు చాలా అనుకూలంగా ఉంటుంది.
మొక్క బాగా పెరిగిన తర్వాత ఆకులను కోసేటప్పుడు వాటి రంగును గమనించాలి. పచ్చని రంగులోకి మారిన ఆకులను మాత్రమే కోయాలి. లేత పచ్చగా, కొత్తగా వస్తున్న ఆకులను వదిలేయాలి. ఆకులను చేత్తో పీకడం కంటే కత్తెరను ఉపయోగించి కట్ చేసుకోవాలి.
తేజ్ ఆకులు (బిర్యానీ ఆకు) ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలనుకుంటే, వాటిని కోసిన తర్వాత శుభ్రంగా కడిగి బాగా ఆరబెట్టాలి. ఎండలో కంటే నీడలోనే ఆరబెట్టడం మంచిది. దీనివల్ల వాటిలోని సువాసన, రుచి అలాగే ఉంటాయి.
ఆకులు పూర్తిగా ఎండిన తర్వాత వాటిని గాలి చొరబడని డబ్బాలో (ఎయిర్టైట్ కంటైనర్) భద్రపరుచుకోవచ్చు.







కామెంట్లు (0)