- రిపబ్లికన్ల కంచుకోటల్లో డెమోక్రాట్ల హవా
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లు తొలి ఫలితాలు సూచిస్తున్నాయి. ప్రతినిధుల సభతో పాటు సెనేట్ ఎన్నికల్లోనూ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. రిపబ్లికన్ పార్టీకి కంచుకోటలుగా ఉన్న ప్రాంతాల్లోనూ డెమోక్రాట్లు పట్టు సాధిస్తుండటం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. సెనేట్‌లో మొత్తం 100 స్థానాలకు గాను 35 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తొలి ఫలితాల ప్రకారం డెమోక్రటిక్ పార్టీ ఇప్పటికే 9 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో సెనేట్‌పై రిపబ్లికన్ల ఆధిపత్యానికి గండిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా ట్రంప్‌కు అనుకూలంగా లేకపోవడం రిపబ్లికన్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది.
మరోవైపు ప్రతినిధుల సభ ఎన్నికల్లోనూ డెమోక్రాట్లు ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. 45 స్థానాల్లో డెమోక్రటిక్ అభ్యర్థులు ముందంజలో ఉండగా, 21 స్థానాల్లో రిపబ్లికన్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ట్రంప్‌కు బలమైన మద్దతు ఉన్న ప్రాంతాల్లోనూ ఓటర్ల వైఖరిలో మార్పు కనిపిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆరంభం నుంచి రిపబ్లికన్ పార్టీ అధికార కేంద్రాల్లో డెమోక్రాట్లు పురోగమిస్తూ వస్తున్నారు. అమెరికా రాజకీయాల్లో సెనేట్‌కు అత్యంత కీలకమైన స్థానం ఉంది. అధ్యక్షుడి ప్రతిపాదనలు, కీలక నియామకాలు, పలు నిర్ణయాలకు సెనేట్ ఆమోదం అవసరం. ఈ నేపథ్యంలో సెనేట్‌లో రిపబ్లికన్లు ఆధిపత్యాన్ని కోల్పోయే అవకాశాలున్నాయి. సెనేట్‌పై ట్రంప్ పట్టు కొనసాగుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.








కామెంట్‌లు (0)