బెంగళూరు : క్యాన్సర్‌ను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు శునకాల అసాధారణ ఘ్రాణ శక్తిని కృత్రిమ మేధ (AI), బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ (BCI) సాంకేతికతతో అనుసంధానిస్తూ బెంగళూరుకు చెందిన డీప్-టెక్ స్టార్టప్ డాగ్నోసిస్ వినూత్న పరిశోధన చేపట్టింది. 'బ్రీత్‌ఈజీ' పేరుతో అభివృద్ధి చేస్తున్న ఈ విధానం ద్వారా వ్యక్తి శ్వాస నమూనాను విశ్లేషించి క్యాన్సర్ ముప్పును ప్రారంభ దశలోనే అంచనా వేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
10 నిముషాలు మాస్క్ ....
ఈ పరీక్షలో వ్యక్తి ప్రత్యేకంగా రూపొందించిన మాస్క్‌ను సుమారు పది నిమిషాల పాటు ధరించి అందులోకి శ్వాసను విడవాలి. అనంతరం ఆ మాస్క్‌ను భద్రంగా ప్రయోగశాలకు తరలించి శిక్షణ పొందిన బీగిల్ లేదా ల్యాబ్రడార్ శునకాలకు వాసన చూపిస్తారు. శ్వాసలో ఉండే ప్రత్యేక రసాయన సమ్మేళనాలను (VOCs) శునకాలు గుర్తించే సమయంలో వాటి మెదడులో ఏర్పడే నాడీ స్పందనలను బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్‌ఫేస్ ద్వారా నమోదు చేస్తారు. ఆ సంకేతాలను కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్‌వేర్ విశ్లేషించి క్యాన్సర్ ప్రమాదంపై అంచనా రూపొందిస్తుంది.

10 రకాల క్యాన్సర్ ప్రమాద సూచనలు గుర్తించవచ్చు .....
సంస్థ అభివృద్ధి చేసిన ఆటోమేటెడ్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఒకే విడతలో వందలాది శ్వాస నమూనాలను పరీక్షించే అవకాశం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ విధానం ద్వారా పది రకాల వరకు క్యాన్సర్లకు సంబంధించిన ప్రమాద సూచనలను గుర్తించే అవకాశముందని, ప్రస్తుతం వివిధ ఆసుపత్రులతో కలిసి క్లినికల్ అధ్యయనాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
ఇదే తుది పరీక్ష కాదు ....
అయితే ఈ పరీక్ష క్యాన్సర్‌ను నిర్ధారించే తుది పరీక్ష కాదని, కేవలం ప్రాథమిక స్క్రీనింగ్ సాధనమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరీక్షలో అధిక ప్రమాద సూచనలు కనిపించినవారికి మాత్రమే బయాప్సీ, స్కాన్‌లు వంటి నిర్ధారణ పరీక్షలు చేయించడం వల్ల అనవసర ఖర్చు, సమయం తగ్గుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.
అన్ని పరీక్షలు విజయవంతమైతే ... 2027లో ...
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం .... గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి శ్వాస ఆధారిత స్క్రీనింగ్ పద్ధతులు అందుబాటులోకి వస్తే ప్రారంభ దశలోనే ప్రమాదంలో ఉన్న వ్యక్తులను గుర్తించి త్వరగా చికిత్స అందించే అవకాశం పెరుగుతుంది. అయితే దీని కచ్చితత్వం, విస్తృత వినియోగ సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు మరింత పెద్ద స్థాయిలో క్లినికల్ పరిశోధనలు అవసరమని వారు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికత పరిశోధన దశలో ఉండగా, అన్ని పరీక్షలు విజయవంతమైతే 2027లో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డాగ్నోసిస్ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.








కామెంట్‌లు (0)