తుపానువేళ చలి ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో పిల్లలు, పెద్దలు వేడివేడిగా కొన్ని కషాయాలు తాగడం ఆరోగ్యానికి మంచిది. జలుబు, జ్వరం, దగ్గు వంటివి బాధించకుండా గొంతు గరగర లేకుండా ఉండే కషాయాలను ఇంట్లో దొరికే వస్తువులతోనే తయారుచేసుకోవచ్చు.
అల్లం - మిరియాల కషాయం : ఒక పాత్రలో నీటిని మరిగించి అందులో చిన్న అల్లం ముక్క, కొన్ని నల్ల మిరియాలు, కొద్దిగా పసుపు, తులసి ఆకులు వేసి సగం అయ్యే వరకు మరిగించుకుని తాగాలి. ఇది గొంతు నొప్పి, కఫం, జలుబు నుంచి తక్షణ ఉపశమనం ఇస్తుంది. తాగే ముందు కొద్దిగా తేనె కలుపుకోవచ్చు.
తులసి - వాము - సొంటి కషాయం: తులసి ఆకులు, చిటికెడు వాము, కొద్దిగా సొంటి పొడి నీళ్లలో వేసి మరిగించి వడకట్టి తాగాలి. చలివల్ల వచ్చే జలుబు, జీర్ణ సమస్యలు తగ్గడానికి ఇది ఉపయోగపడుతుంది.
దాల్చినచెక్క - లవంగాల కషాయం: చిన్న దాల్చినచెక్క ముక్క, రెండు లవంగాలు, యాలకులు నీటిలో వేసి మరిగించి తాగాలి. శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో, వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి కాపాడటంలో ఈ కషాయం సహాయపడుతుంది.
పిల్లలకు ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు : పిల్లల జీర్ణ వ్యవస్థ సున్నితంగా ఉంటుంది కాబట్టి పెద్దలకు ఇచ్చేంత ఘాటుగా ఉండే కషాయాలు ఇవ్వకూడదు. అలాగే సంవత్సరం లోపు పిల్లలకు తేనె కలిపి ఇవ్వకూడదు.
తేలికపాటి తులసి - పసుపు నీళ్లతో(2 సంవత్సరాలు పైబడిన పిల్లలకు): కొద్దిగా తులసి ఆకులు, చిటికెడు పసుపు నీళ్లలో వేసి బాగా మరిగించి, ఆ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకు ఇవ్వవచ్చు.
పసుపు పాలు : రాత్రి పడుకునే ముందు పిల్లలకు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, స్వచ్ఛమైన తేనె లేదా బెల్లం కలిపి ఇస్తే జలుబు దరిచేరదు, నిద్ర కూడా బాగా పడుతుంది.
వాము - జీలకర్ర నీళ్లు : కొద్దిగా జీలకర్ర, వాము వేసి మరిగించిన నీటిని ఇవ్వడం వల్ల గొంతుకి ఉపశమనం లభించడమే కాకుండా జీర్ణశక్తి పెరుగుతుంది. పిల్లలకు తీవ్రమైన జ్వరం లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే స్వయంగా వైద్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.








కామెంట్లు (0)