శుక్రవారం, 06 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమందులెలా భద్రపరుచుకోవాలి..?

19 గంటల క్రితం

మందులెలా భద్రపరుచుకోవాలి? image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 06, 2026, 05:12 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ఇంట్లో ఫస్ట్ ఎయిడ్ కిట్ లేదా కొన్ని అత్యవసర మందులను చాలామంది అందుబాటులో ఉంచుకుంటుంటారు. అయితే వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేయడం చాలా ముఖ్యం. వాటిని ఉంచే ప్రదేశం ఆ ఔషధాల నాణ్యతను కాపాడుతుంది. సరైన పద్ధతిలో భద్రపరుచుకోకపోతే మందులు త్వరగా పాడైపోయి తమ ప్రభావాన్ని కోల్పోతాయి.

చాలామంది సౌకర్యం కోసం మందులను వంటగదిలో భద్రపరుస్తుంటారు. అది చాలా పొరపాటు. వంటగదిలో వంట చేసేటప్పుడు వచ్చే వేడి, ఆవిరి వల్ల మందులు త్వరగా పాడైపోతాయి. బెడ్‌రూమ్‌లో చల్లగా, పొడిగా ఉండే అల్మారాలో ప్రత్యేకంగా ఒక బాక్స్ లేదా ఆర్గనైజర్‌ను ఏర్పాటు చేసుకుని మందులను దాచుకోవాలి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఆ పెట్టెకు తాళం వేసి, వారికి అందకుండా ఎత్తైన ప్రదేశంలో ఉంచాలి.


సాధారణంగా చాలా రకాల మాత్రలు, క్యాప్సూల్స్‌ను నార్మల్ రూమ్ టెంపరేచర్ వద్దే ఉంచవచ్చు. అయితే వాటిని అసలు ప్యాకింగ్ లేదా స్ట్రిప్స్ నుంచి వేరు చేయకుండా అలాగే ఉంచాలి. ఒకవేళ పొడులు లేదా కరిగే మాత్రల ప్యాకెట్లలో తేమను పీల్చుకునే చిన్న ప్యాకెట్లు ఉంటే వాటిని పొరపాటున కూడా పడేయకూడదు. అలాగే ఎండ నేరుగా తగిలే కిటికీల దగ్గర కూడా మందులను ఉంచకూడదు.

​​ఫ్రిజ్‌లో ఏ మందులు పెట్టాలి?

కొన్ని రకాల ఇంజెక్షన్లు, ఐ డ్రాప్స్ వంటి వాటిని రిఫ్రిజిరేటర్‌లో భద్రపరచాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వాటిని ఫ్రిజ్ మెయిన్ కంపార్ట్‌మెంట్‌లో ఉంచాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రీజర్‌లో పెట్టి గడ్డకట్టించకూడదు. అలాగే ఉష్ణోగ్రత మారుతుండే ఫ్రిజ్ డోర్ షెల్ఫ్‌లలో కూడా మందులను ఉంచడం మంచిది కాదు. ఒకవేళ బయట ప్రయాణాల్లో ఉండి ఫ్రిజ్ అందుబాటులో లేకపోతే, ప్రత్యేకమైన ఇన్సులేటెడ్ కోల్డ్ బాక్సులను ఉపయోగించాలి. శీతాకాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండే బాల్కనీలు లేదా కిటికీల అంచుల దగ్గర సిరప్‌లు గడ్డకట్టకుండా చూసుకోవాలి.

పాడైనవి ఎలా గుర్తించాలి?

మందుల ప్యాకింగ్ ఉబ్బినా, సిరప్‌ల రంగు మారినా, వాటిలో చిన్నపాటి రేణువులు కనిపించినా, అలాగే మాత్రలు విరిగిపోయినా లేదా ఒకదానికొకటి అతుక్కుపోయినా అవి పాడైపోయినట్లే. అలాంటి వాటిని వాడకూడదు. మందులు వాడే ముందు ఎప్పుడూ వాటి ఎక్స్‌పైరీ తేదీలను సరిచూసుకోవడం చాలా ముఖ్యం.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్