భారతదేశంలో ప్రతి ఏడాది దాదాపు 80 వేల మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. అంటే ప్రతి నాలుగు నిమిషాలకు ఒక మహిళ ఈ వ్యాధికి బలవుతోంది. అయితే ఈ మరణాల్లో అత్యధిక భాగాన్ని నివారించ వచ్చని వైద్య శాస్త్రం చెబుతోంది. చిన్న వయసులో ఇచ్చే HPV టీకా, తరువాత క్రమం తప్పకుండా చేసే పరీక్షలు ఉంటే గర్భాశయ క్యాన్సర్‌ను దాదాపు పూర్తిగా అడ్డుకోవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. తాజాగా బ్రిటన్‌లో వెలువడిన అధ్యయనం ఈ ఆశకు మరింత బలం చేకూర్చింది. HPV టీకా తీసుకున్న యువతుల్లో గర్భాశయ క్యాన్సర్ మరణాలు సున్నాకి చేరినట్లు వెల్లడించింది.
ప్రపంచ ప్రసిద్ధ వైద్య పత్రిక ‘ది లాన్సెట్’లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బ్రిటన్‌లో 2008 నుంచి అమలవుతున్న HPV టీకా కార్యక్రమం ఫలితాలను పరిశీలించిన పరిశోధకులు ఆశ్చర్యకరమైన విషయాన్ని గుర్తించారు. 2020-24 మధ్య 20 నుంచి 24 ఏళ్ల వయస్సు గల మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ కారణంగా ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. టీకా లేకపోయి ఉంటే కనీసం 23 మంది మరణించి ఉండేవారని అంచనా వేశారు. గర్భాశయ క్యాన్సర్‌ను నిర్మూలించే దిశగా ఇది చారిత్రక అడుగని వైద్య నిపుణులు చెబుతున్నారు.
భారత్‌లో ముప్పు
గర్భాశయ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో నాలుగో అత్యంత సాధారణ క్యాన్సర్. ఈ క్యాన్సర్ కారణంగా ఎక్కువ మరణాలు సంభివిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి. ప్రపంచ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ గణాంకాల ప్రకారం 2022లో భారతదేశంలో 79,906 మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో మరణించారు. ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు అవగాహన లోపం, గ్రామీణ ప్రాంతాల్లో స్క్రీనింగ్ పరీక్షల కొరత, వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం. గర్భాశయ క్యాన్సర్ ప్రారంభ దశల్లో పెద్దగా లక్షణాలు కనిపించవు. ఫలితంగా చాలా మంది మహిళల్లో రెండో లేదా మూడో దశకు చేరిన తరువాతే వ్యాధి బయటపడుతోంది. అప్పటికి చికిత్స ఖర్చు పెరగడంతో పాటు ఫలితాలు కూడా పరిమితంగానే ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే గర్భాశయ క్యాన్సర్ కేసుల్లో 95 శాతానికి పైగా HPV వైరస్ కారణమే. అందువల్ల వైరస్‌ను అడ్డుకోవడం ద్వారా క్యాన్సర్‌ను కూడా నివారించవచ్చని వైద్య శాస్త్రం చెబుతోంది.
వైరస్ నుంచి రక్షణ
HPV అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఇది 200కు పైగా వైరస్ రకాల సమూహం. ప్రధానంగా లైంగిక సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. ప్రపంచంలో అత్యంత సాధారణ లైంగిక సంక్రమణ వైరస్‌లలో ఇది ఒకటి. చాలా మందిలో వైరస్ రెండు సంవత్సరాల లోపే శరీరం నుంచి తొలగిపోతుంది. కానీ కొన్ని అధిక ప్రమాదకర రకాలు ఎక్కువకాలం శరీరంలో కొనసాగితే గర్భాశయ కణాల్లో మార్పులు తెస్తాయి. ఇవి క్రమంగా క్యాన్సర్‌గా మారే ప్రమాదం ఉంటుంది. HPV టీకా ఈ ప్రమాదకర వైరస్ రకాలపై రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వైరస్ శరీరంలోకి ప్రవేశించినా అది స్థిరపడకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం లైంగిక జీవితం ప్రారంభమయ్యే ముందే టీకా ఇస్తే అత్యధిక రక్షణ లభిస్తుంది. అందుకే ప్రపంచంలోని అనేక దేశాలు 9 నుంచి 14 ఏళ్ల మధ్య వయస్సు గల బాలికలకు ఈ టీకాను ఇస్తున్నాయి. కొన్ని దేశాలు బాలురనూ టీకా కార్యక్రమంలో చేర్చాయి.
బ్రిటన్‌లో మంచి ఫలితం
బ్రిటన్‌లో నమోదైన ఫలితాలు ప్రపంచానికి ఆశాజనక సంకేతాలు పంపుతున్నాయి. 2000-04 మధ్య 20 నుంచి 24 ఏళ్ల మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌తో 25 మరణాలు నమోదయ్యాయి. 2015-19 నాటికి ఆ సంఖ్య ఐదుకి తగ్గింది. 2020-24 కాలానికి వచ్చేసరికి పూర్తిగా సున్నా అయింది. ఈ అనుభవం భారత్‌కు కూడా కీలక పాఠాన్ని అందిస్తోంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 14 ఏళ్ల లోపు సుమారు 1.15 కోట్ల బాలికలకు ఉచిత HPV టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం సమర్థంగా అమలైతే వచ్చే రెండు మూడు దశాబ్దాల్లో గర్భాశయ క్యాన్సర్ భారాన్ని గణనీయంగా తగ్గించే అవకాశం ఉంది. అయితే టీకా ఒక్కటే సరిపోదు. మహిళల్లో అవగాహన పెరగాలి. 30 ఏళ్లు దాటిన మహిళలు క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ సేవలు అందుబాటులోకి రావాలి. అప్పుడు మాత్రమే మరణాల సంఖ్య వేగంగా తగ్గుతుంది.
అపోహలే అడ్డంకి
HPV టీకాపై ప్రపంచవ్యాప్తంగా కొన్ని అపోహలు వ్యాపిస్తున్నాయి. టీకా వంధ్యత్వానికి కారణమవుతుందని, తీవ్రమైన దుష్ప్రభావాలు ఉంటాయని కొందరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు జరిగిన పరిశోధనల్లో అలాంటి వాదనలకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. 2020లో అమెరికాలో నిర్వహించిన అధ్యయనం HPV టీకా తీసుకున్న మహిళల్లో వంధ్యత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా తేల్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, అనేక దేశాల వైద్య సంస్థలు కూడా ఈ టీకా సురక్షితమైనదేనని చెబుతున్నాయి. గర్భాశయ క్యాన్సర్ ప్రత్యేకత ఏమిటంటే ఇది పూర్తిగా నివారించగలిగే కొద్ది క్యాన్సర్లలో ఒకటి. కారణమయ్యే వైరస్ తెలుసు. దాన్ని అడ్డుకునే టీకా ఉంది. ముందుగానే గుర్తించే పరీక్షలు కూడా ఉన్నాయి. అందువల్ల సరైన విధానాలు అమలు చేస్తే భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్‌ను అరుదైన వ్యాధిగా మార్చడం సాధ్యమే. బ్రిటన్‌లో మరణాల సంఖ్య సున్నాకి చేరడం ఒక దేశ విజయమే కాదు; ప్రపంచానికి దిశానిర్దేశం చేసిన ఉదాహరణ. భారత్‌లో ప్రతి ఏడాది దాదాపు 80 వేల మంది మహిళల ప్రాణాలు తీస్తున్న ఈ వ్యాధిపై విజయం సాధించాలంటే టీకా, పరీక్షలు, అవగాహన అనే మూడు ఆయుధాలను సమాజం విస్తృతంగా వినియోగించాలి. అప్పుడు మాత్రమే వేలాది కుటుంబాలను కాపాడటం సాధ్యమవుతుంది.








కామెంట్‌లు (0)