ఎండలు పెరుగుతున్న కొద్దీ వేడి ప్రభావం శరీరంపై పడటం సహజం. అయితే అధిక ఉష్ణోగ్రతల వల్ల నెలసరి కూడా మారుతుందా? అనే సందేహం చాలామందిలో ఉంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం, అధిక వేడి ఒక్కటే నెలసరి క్రమాన్ని మార్చదు. కానీ వేడి కారణంగా శరీరంలో డీహైడ్రేషన్, నిద్రలేమి, శారీరక అలసట, మానసిక ఒత్తిడి పెరిగితే నెలసరిని నియంత్రించే హార్మోన్లపై తాత్కాలిక ప్రభావం పడొచ్చు. దీంతో అండం విడుదలలో మార్పులు ఏర్పడి నెలసరి సాధారణం కంటే ముందుగానో, ఆలస్యంగానో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ మార్పులు అందరిలో ఒకేలా కనిపించవని, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను బట్టి మారుతాయని నిపుణులు చెబుతున్నారు.
పరిశోధనల ప్రకారం పురుషులతో పోలిస్తే మహిళల శరీరం వేడిని నియంత్రించే విధానం భిన్నంగా ఉంటుంది. మహిళలకు చెమట ఆలస్యంగా, తక్కువగా పట్టడం వల్ల శరీరం చల్లబడటానికి ఎక్కువ సమయం పడుతుంది. మరోవైపు అండోత్పత్తి తర్వాత రుతుచక్రంలో భాగంగా శరీర ఉష్ణోగ్రత సహజంగానే 0.3 నుంచి 0.7 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతుంది. అలాంటి సమయంలో బయట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉంటే శరీరంపై అదనపు ఒత్తిడి పడే అవకాశం ఉందని పరిశోధకులు వివరిస్తున్నారు.
ఎప్పుడు వైద్యుడిని కలవాలి?
ఒకే నెలలో రెండుసార్లు నెలసరి రావడం ప్రతి సందర్భంలోనూ ఆరోగ్య సంకేతం కాదు. సాధారణంగా రుతుచక్రం 21 నుంచి 35 రోజుల మధ్య ఉంటుంది. 21 రోజుల రుతుచక్రం ఉన్నవారికి ఒకే క్యాలెండర్ నెలలో రెండుసార్లు నెలసరి రావడం సహజమే. మరోవైపు నెలసరి ఆలస్యమవడానికి గర్భం దాల్చడం, మానసిక ఒత్తిడి, అనారోగ్యం, బరువులో మార్పులు, అధిక వ్యాయామం, ప్రయాణాలు, నిద్రలేమి, కొన్ని మందులు వంటి అనేక కారణాలు ఉండొచ్చు. పీసీఓఎస్, థైరాయిడ్ సమస్యలు కూడా నెలసరి క్రమాన్ని దెబ్బతీయవచ్చు. నెలసరి వరుసగా కొన్ని నెలల పాటు క్రమం తప్పినా, అసాధారణ రక్తస్రావం జరిగినా, తీవ్రమైన కటి నొప్పి ఉన్నా లేదా రెండు నెలసరుల మధ్య రక్తస్రావం కనిపించినా వైద్యుడిని సంప్రదించాలని వారు సూచిస్తున్నారు. ముందుగానే పరీక్షలు చేయించుకుంటే కారణాన్ని గుర్తించి తగిన చికిత్స తీసుకోవచ్చు.








కామెంట్‌లు (0)